జగన్ కాపు ద్రోహి
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:09 AM
వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి కాపు ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ విమర్శించారు.
వారికి రిజర్వేషన్‌ను వ్యతిరేకించాడు
వారికి ఆ సౌకర్యాన్ని కల్పించిన సీఎంలు దామోదరం సంజీవయ్య, చంద్రబాబే
కాపు నేతలను ఫ్యాక్షన్ ఉచ్చులో ఇరికించేసిన జగన్మోహన్‌రెడ్డి
మీడియాతో మంత్రి నిమ్మల, ఎంపీ సానా
అమరావతి, జూన్ 23(ఆంద్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి కాపు ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ విమర్శించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం సానాతో కలసి నిమ్మల మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో కాపులకు మేలు చేసేలా రిజర్వేషన్‌లను కల్పించిన ముఖ్యమంత్రులుగా దళిత బిడ్డ దామోదరం సంజీవయ్య, చంద్రబాబు చరిత్రలో నిలిస్తే... కాపులకు రిజర్వేషన్లు తీసేసిన ముఖ్యమంత్రుల్లో నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. కేంద్రం 10ు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ కల్పిస్తే.. బీసీలకు అన్యాయం జరగకుండా అందులో ఐదు శాతం రిజర్వేషన్‌ను కాపులకు చంద్రబాబు కల్పించారు. కాపులకు రిజర్వేషన్ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నానని ఎన్నికల ప్రచారంలో బాహాటంగా జగన్ ప్రకటించారు. అధికారంలోనికి వచ్చాక రిజర్వేషన్‌ను రద్దుచేసి కాపులకు తీరని అన్యాయం చేశారు’ అని మంత్రి మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశాక నిరాశ, నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందన్నారు.
ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకుంటే...
‘జగన్‌ది పులివెందుల ఫ్యాక్షన్ సంస్కతి. ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకున్న ఎవరైనా బయటకు రావడం అసాధ్యం. వైసీపీ కాపు నేతలను జగన్ రెచ్చగొట్టి తప్పులు చేయించి జైలుకు వెళ్లేలా చేస్తున్నాడు. తద్వారా కాపు నేతలు తన విషపు వల నుంచి బయటకు రాలేక అక్కడే ఉండిపోయేలా చేస్తున్నాడు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి. పేర్ని కృష్ణమూర్తికి నాయకుడిగా మంచి పేరుంది. ఆయన కొడుకు పేర్ని నానితో తప్పులు చేయించి ఇరికిస్తున్నాడు. పేర్ని కుటుంబంలోని మహిళలపైనా కేసులు నమోదయ్యేలా జగన్ చేశాడు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తండ్రి గుడివాడ గుర్నాథరావుకు మంచి పేరుంది. కానీ.. అమర్నాథ్‌తో వైరిపక్షం రాజకీయ నేతలను తిట్టించి సమాజం ఛీత్కరించుకునేలా జగన్ చేస్తున్నాడు’ అని మంత్రి మండిపడ్డారు. ‘జగన్‌ది ఫ్యాక్షన్ కార్ఖానా. చంద్రబాబుది నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. కాపుల గురించి మాట్లాడే నైతిక అర్హత గొడ్డలి పార్టీకి లేదు. ప్రతి సందర్భంలోనూ కాపు నేతలను కరివేపాకులానే జగన్ వాడుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి, మిఽథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను... అధికారం కోల్పోయాక అంబటి, పేర్ని, గుడివాడ, కురసాలలాంటి కాపు నేతలను వాడుకోవడం ప్రజలు గమనిస్తున్నారు’ అని వివరించారు.
బాబు, పవన్ రామలక్ష్మణులు...
‘చంద్రబాబు, పవన్ కల్యాణ్ రామలక్ష్మణుల వంటివారు. వారిద్దరినీ వేరు చేస్తే తప్ప తనకు రాజకీయ మనుగడ లేదని గ్రహించిన జగన్ కుట్రలకు తెరతీశారు. ఇందులో భాగంగానే కాపులను జగన్ టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లను విడదీయడం జగన్ వల్ల కాదు. చంద్రబాబును రాజకీయంగా అడ్డుకోవడం సాధ్యం కాదని గ్రహించి గొడ్డలి పార్టీ అడ్డదారులు తొక్కుతోంది’ అని నిమ్మల ఆరోపించారు. ‘తోట త్రిమూర్తులు కాపు నేతలతో ఆత్మీయ సభ పేరిట నిర్వహించిన సమావేశం నిరుద్యోగ నేతల ఆక్రోశ సమావేశం. జగన్ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదన్నప్పుడు వైసీపీ కాపు నేతలు ఆయన్ను ఎందుకు నిలదీయలేదు? కాపు రిజర్వేషన్లను రద్దు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? కాపు రిజర్వేషన్ల రద్దుపై నిలదీస్తే జగన్, చెంప చెళ్లుమనిపిస్తాడని భయమా? కాపు భవనాలు టీడీపీ హయాంలో 80 శాతం పూర్తయితే... ఐదేళ్లలో జగన్ మిగిలిన 20శాతం ఎందుకు పూర్తిచేయలేదు?’ అని సతీశ్ ప్రశ్నించారు.