Share News

BJP: జగన్‌ క్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jan 09 , 2026 | 04:24 AM

తల్లి పార్టీ ఓట్‌ చోరీ అంటుంది. పిల్ల పార్టీ క్రెడిట్‌ చోరీ అంటోంది. ఎర్రబస్సు వెళ్లని చోటుకు ఏయిర్‌ బస్‌ ఎందుకు? అంటూ ప్రశ్నించిన జగన్‌ ముందుగా ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి.

BJP: జగన్‌ క్షమాపణ చెప్పాలి

  • ఉత్తరాంధ్రుల్ని అవమానించావు.. ’అన్నమయ్య’ గేట్లను వదిలేశావ్‌

  • రాజధానిని ధ్వంసం చేశావు: బీజేపీ

అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ‘తల్లి పార్టీ ఓట్‌ చోరీ అంటుంది. పిల్ల పార్టీ క్రెడిట్‌ చోరీ అంటోంది. ఎర్రబస్సు వెళ్లని చోటుకు ఏయిర్‌ బస్‌ ఎందుకు? అంటూ ప్రశ్నించిన జగన్‌ ముందుగా ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మరమ్మత్తులు చేయకుండా విపత్తుకు కారణమైన వైసీపీ అధ్యక్షుడికి రాయలసీమ ప్రాజెక్టులపై ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత ఉందా?’ అని ఏపీ బీజేపీ నిప్పులు చెరిగింది. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో యామినీ శర్మ, కిలారు దిలీ్‌పతో కలసి బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ విలేకరులతో మాట్లాడారు. ‘భోగాపురం(విశాఖ) అంతర్జాతీయ విమానాశ్రయానికి రెండోసారి శిలాఫలకం వేయడానికి మాత్రమే పరిమితమైన జగన్‌ క్రెడిటిని కొట్టేయాలనుకుంటే ప్రజలు నవ్వుతారు. రాజధాని అమరావతిలో ప్రజా వేదికను కూల్చావ్‌.. రాయలసీమలో అన్నమయ్య ప్రాజెక్టును నాశనం చేశావ్‌.. ఉత్తరాంధ్రలో రుషికొండ ధ్వంసం చేశావ్‌.. 2019-24మధ్య అరాచకం అంటే ఏమిటో చూపించావ్‌. ప్రజలు చిత్తుగా ఓడించినా పెట్టుబడిదారులకు బెదిరింపు మెయిల్స్‌ పంపుతూ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నావు. మెడికల్‌ కాలేజీలు పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు కేంద్రంతో పాటు నీతి ఆయోగ్‌ అంగీకరించింది. మీరు అడ్డుకున్నా 17 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి తీరుతాం. సీమకు తీరని ద్రోహం చేసిన జగన్‌... తిరుమల పవిత్రతను దెబ్బతీసి, లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడు. ఆఖరికి ఖాళీ మద్యం సీసాలతోనూ చేస్తున్న నీచపు పనుల్ని దేవుడు కూడా క్షమించడు. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ జైలుకు వెళ్లాడంటూ వాడు, వీడు అని మాట్లాడుతున్న పేర్ని నాని... ఇక్కడ జైలుకు వెళ్లిన జగన్‌ను ఏమని పిలుస్తారో..! జగన్‌పై ఉన్న అవినీతి కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరగా ముగించాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని జేపీ పేర్కొన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 04:25 AM