ఇక గూడుపుఠాణి హైదరాబాద్‌లో!
ABN , Publish Date - Mar 10 , 2026 | 03:54 AM
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుపుఠాణి నడిపే బ్యాచ్ వేదిక మార్చేసింది. విజయవాడలో సమావేశాలైతే అడ్డంగా దొరికిపోతున్నామన్న భావనతో మకాంను మళ్లీ హైదరాబాద్‌కు మార్చింది.
రూటు మార్చిన జగన్ అనుకూల బ్యాచ్
విజయవాడ భేటీ రట్టుకావడంతో జాగ్రత్త
6న ఐఏఎస్‌లతో రిటైర్డ్ అధికారి మంతనాలు
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ‘కర్తవ్య బోధ’
రహస్య భేటీని బయటపెట్టిన ‘ఆంధ్రజ్యోతి’
దీంతో మకాం హైదరాబాద్‌కు మార్పు
సురక్షితంగా ఉండేందుకు వేదికగా ఓ కీలక ఐపీఎస్ ఇల్లు ఎంపిక
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గూడుపుఠాణి నడిపే బ్యాచ్ వేదిక మార్చేసింది. విజయవాడలో సమావేశాలైతే అడ్డంగా దొరికిపోతున్నామన్న భావనతో మకాంను మళ్లీ హైదరాబాద్‌కు మార్చింది. జగన్ హయాంలో ఉన్నతస్థాయి పదవి నిర్వహించిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శుక్రవారం విజయవాడలో పలువురు ఐఏఎస్‌లు, ఉన్నతాధికారులతో రహస్యంగా భేటీ అయిన విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. జగన్ ‘దూత’గా రంగంలోకి దిగిన ఆయన.. ‘కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ప్రభుత్వంపై బురదజల్లేందుకు అవసరమైన సమాచారం మాకు ఇవ్వండి. మీకు ఏం కావాలో మేం చూసుకుంటాం’ అని అధికారులకు ఎర వేశారు. నాటుకోడి చికెన్ బ్రేక్‌ఫా్‌స్టతో జరిపిన భేటీ కాస్తా బయటపడింది. ఈ గుట్టు రట్టయ్యాక కొందరు అధికారులు అయితే ఏంటటా అన్న ధోరణిలో ఉన్నారు. మరికొందరు కాస్త ఆందోళన చెందారు. మొత్తానికి ఇకపై సమావేశాలకు విజయవాడ సేఫ్ కాదన్న అభిప్రాయం ఆ అధికారుల్లో వ్యక్తమైంది. ఇకపై హైదరాబాద్‌లో జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జగన్ ప్రేరేపిత అధికారులు కొందరు హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతంలో తరచుగా సమావేశమయ్యేవారు.
జగన్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ ఉన్నతాధికారి ఈ సమావేశాలను నిర్వహిస్తూ ఎవరికి ఏం కావాల్నో చూసుకునేవారు. ఈ మధ్య రెండు మూడుసార్లు హైదరాబాద్‌లో ఆ ఐఏఎస్‌లు ఆ మాజీ పెద్దాయనతో సమావేశం నిర్వహించారు. ఏదో పనిమీద విజయవాడ వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం అధికారులతో భేటీ అయ్యారు. ఇకపై ఏ ఇబ్బంది రాకుండా ఉండేలా హైదరాబాద్‌లో కూడా సురక్షిత ప్రాంతంలో సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న ఓ ఐపీఎస్ ఇంటిని అడ్డాగా ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. గతంలో ఆయన నివాసంలోనే రెండు దఫాలుగా కీలక భేటీలు జరిగాయి. ఈ మాజీ పెద్దాయన, ఆ ఐపీఎస్ అత్యంత ఆప్తులు. దగ్గరి బంధుత్వం కూడా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో తన ఇంటినే సమావేశాలకు వాడుకోవాలని ఆ ఐపీఎస్ కూడా చెప్పినట్లు తెలిసింది. ఆయన ఈ మాట ఇవ్వడానికి ఓ కారణం ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు అంటే ఆ అధికారికి పడదు. ఆయన జగన్‌కు అత్యంత ఆప్తుడు. ఉమ్మడి ఏపీలో ఆయన రాయలసీమ జిల్లాల్లో కీలక బాధ్యతల్లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఇకపై ప్రతీ పక్షం రోజులకోసారి హైదరాబాద్‌లో సమావేశాలు జరుపుకొందామని ఆయన సమాచారం పంపినట్టు తెలిసింది. విజయవాడ సమావేశాల అనంతర పరిణామాలతో ఎవరూ కంగారు పడవద్దని అధికారులకు భరోసా ఇచ్చినట్టు సమాచారం.