Share News

మెగా డీఎస్సీపై జగన్‌ మరో విన్యాసం!

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:10 AM

బట్టతలకు, మోకాలికి ముడిపెట్టినట్లుగా జగన్‌ తీరు ఉంది. అసలు ఏమాత్రం సంబంధం, పోలిక లేని మెగా డీఎస్సీని నీట్‌ ఉదంతంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

మెగా డీఎస్సీపై జగన్‌ మరో విన్యాసం!

  • నీట్‌ ఉదంతంతో ముడిపెట్టే యత్నం

  • డీఎస్సీలో అక్రమాలంటూ ఆరోపణలు

  • సందేహాలన్నీ సర్కారు నివృత్తి చేసినా నిరసనల పేరిట యాగీ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

బట్టతలకు, మోకాలికి ముడిపెట్టినట్లుగా జగన్‌ తీరు ఉంది. అసలు ఏమాత్రం సంబంధం, పోలిక లేని మెగా డీఎస్సీని నీట్‌ ఉదంతంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగా డీఎస్సీలో పేపర్‌ లీక్‌ కాలేదు. ఎలాంటి అక్రమాలు జరగలేదు. దీనిపై జగన్‌ చేసిన అసత్య ఆరోపణలకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన వివరణ ఇచ్చింది. నీట్‌ వ్యవహారం ఇందుకు పూర్తిగా భిన్నమైనది. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ కావడంతో కేంద్ర ప్రభుత్వం మళ్లీ పరీక్షలు నిర్వహించింది. నీట్‌ ఉదంతంపై కాక్రోచ్‌ జనతా పార్టీ, విద్యార్థుల పోరాటంతో చివరకు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మంద్ర ప్రధాన్‌ రాజీనామా చేశారు. ఈ ఎపిసోడ్‌లో కాక్రోచ్‌ జనతా పార్టీని జగన్‌ బాహాటంగా సమర్థించే సాహసం చేయలేదు. ప్రధాని మోదీకి కోపం రాకుండా సుతిమెత్తగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను స్వాగతిస్తున్నానంటూ పేర్కొన్నారు. జరిగింది ఇదయితే.. రాష్ట్రంలోనూ కాక్రోచ్‌ జనతా పార్టీ తరహా ఉద్యమం నడుస్తోందంటూ జగన్‌ సహా కిందిస్థాయి వైసీపీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. డీఎస్సీ అవకతవకల వ్యవహారంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి లోకేశ్‌ను తొలగించాలన్న డిమాండ్‌తో మంగళవారం రాష్ట్రమంతా నిరసన ర్యాలీలు చేపట్టాలని పార్టీ యువజన, విద్యార్థి విభాగాలకు జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై యువత, డీఎస్సీ అభ్యర్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


మెగా డీఎస్సీకి, నీట్‌కు పోలికేంటి?

కూటమి అధికారంలోకి వచ్చాక పారదర్శకంగా మెగా డీఎస్సీని నిర్వహించింది. దీనిపై జగన్‌, ఆయన పార్టీ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. మెగా డీఎస్సీపై 240 కేసులు వేశారు. ప్రశ్నపత్రాలు లీక్‌ అయ్యాయంటూ జగన్‌ ఆరోపణలు గుప్పించారు. చివరికి ప్రజా ప్రయోజనాల పేరిట వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొట్టివేసింది. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కొంత మంది అభ్యర్థులతో ముచ్చటిస్తూ జగన్‌ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలన్నింటికి విద్యాశాఖ అధికారులు స్పష్టమైన సమాధానాలు చెప్పారు. అదేవిధంగా రోస్టర్‌ విధానంపై చేసిన ఆరోపణలకూ ప్రభుత్వం సమాధానాలు చెప్పింది. ప్రభుత్వం నుంచి బలమైన కౌంటర్‌ రావడంతో కొన్నాళ్లు సైలెంట్‌ అయ్యారు. నిజంగానే డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలు దొరికితే కాక్రోచ్‌ జనతా పార్టీ తరహాలో జగన్‌ ఎందుకు పోరాటం చేయలేదని డీఎస్సీలో సెలెక్టయిన అభ్యర్థులు నిలదీస్తున్నారు.

నాడు నిరుద్యోగులకు మోసం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ నిరుద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని గాలికి వదిలేశారు. ఏటా జనవరి ఒకటో తేదీన ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నెరవేర్చలేదు. గ్రూప్‌-1 ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చారు. నియామకాల్లో పారదర్శకత లేకుండా చేశారు. గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాల వ్యవహారంపై ‘సిట్‌’ దర్యాప్తునకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించింది. సిట్‌ దర్యాప్తులో భాగంగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులుతోపాటు మధుసూదనరావు అరెస్టయ్యారు. ఈ అక్రమాలపై జగన్‌ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. నాడు నిరుద్యోగుల గురించి ఏమాత్రం పట్టించుకోని జగన్‌ ఇప్పుడు వారిని రెచ్చగొట్టేందుకు పూటకో విన్యాసం, ఆరోపణలు చేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 05:12 AM