ఏమైంది జగన్?
ABN , Publish Date - May 22 , 2026 | 04:08 AM
‘సంప్రదాయిని... సుప్పిని... సుద్దపూసని’.... గురువారం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన సుదీర్ఘ ‘ఉపన్యాసం’ విన్నోళ్లకు గుర్తుకొచ్చిన పాట ఇది! ‘నా అంత మంచోడు లేడు’ అంటూ ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు.
ప్రెస్ మీట్ పేరిట విచిత్ర విన్యాసాలు
వైఎస్‌ను రిలయన్స్ చంపిందని నాడు దాడులు
దీని వెనుక చంద్రబాబు ఉన్నారని నేడు ఆరోపణ
రాజారెడ్డి, వివేకా హత్యలూ ఆయన పనేనట!
మరి సీఎంగా ఉండగా దర్యాప్తు చేయించలేదేం?
రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందెవరు?
జగన్ తీరుపై వైసీపీ శ్రేణుల్లోనే విస్మయం
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘సంప్రదాయిని... సుప్పిని... సుద్దపూసని’.... గురువారం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన సుదీర్ఘ ‘ఉపన్యాసం’ విన్నోళ్లకు గుర్తుకొచ్చిన పాట ఇది! ‘నా అంత మంచోడు లేడు’ అంటూ ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. తాడేపల్లి ప్యాలె్‌సలో గురువారం ఉదయం 11.36 గంటల నుంచి మధ్యాహ్నం 1.17 దాకా ఎంపిక చేసుకున్న మీడియాతో జగన్ మాట్లాడారు. వంగవీటి రంగా హత్య 1988లో జరిగింది. కానీ, అప్పుడు చంద్రబాబే సీఎంగా ఉన్నారనేలా, ఆయనే ఈ హత్యకు కారణమన్నట్లుగా జగన్ ఆరోపించారు. తన తాత వైఎస్ రాజారెడ్డి హత్య ఘటనను ప్రస్తావించినప్పుడు.. ఆయన ఏదో కొత్త విషయం బయటపెడతారని అంతా అనుకున్నారు. కానీ, అప్పట్లో నిందితులను ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్‌లో దాచారంటూ వింత ఆరోపణ చేశారు. చివరికి... తండ్రి మరణంపైనా చిత్రవిచిత్ర విన్యాసాలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని అసెంబ్లీకి రానివ్వనంటూ చంద్రబాబు ప్రకటించిన రెండ్రోజులకే హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని... అందువల్ల దీనికీ చంద్రబాబే కారణమన్నట్లుగా మాట్లాడారు. వైఎస్ దుర్మరణం వెనుక రిలయన్స్ సంస్థ హస్తం ఉందని ఇదే జగన్ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన అనుచర గణం ఉమ్మడి రాష్ట్రంలో పలు చోట్ల రిలయన్స్ దుకాణాలపై దాడులకూ తెగబడింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీతో చెట్టపట్టాలు వేసుకుని.. ఆయన సిఫారసు చేసిన పరిమళ్ నత్వానీకి వైసీపీ తరఫున రాజ్యసభ సీటిచ్చారు. ఇప్పుడేమో హెలికాప్టర్ ప్రమాదం వెనుక చంద్రబాబు కుట్ర ఉందన్నట్లు మరో చిత్రమైన ఆరోపణ చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. అప్పట్లోనే దానిని చంద్రబాబుపై నెట్టేసేందుకు జగన్ ప్రయత్నించారు. మొదట గుండెపోటుగా చిత్రించి.. తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ తన పత్రికలో, చానల్లో దుష్ప్రచారం చేశారు. సీబీఐ దర్యాప్తు జరపాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఎం అయ్యాక సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, దర్యాప్తు అధికారి రాంసింగ్‌పై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించారు. సునీత భర్తే ఈ హత్య చేయించారని జగన్ ఆరోపిస్తుంటారు. ఇప్పుడు దీని వెనుకా చంద్రబాబే ఉన్నారని ప్లేటు తిప్పారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ టీడీపీ నేతలపై విచ్చలవిడిగా కేసులు పెట్టారు. చివరికి... చంద్రబాబునూ అరెస్టు చేయించారు. మరి... తన తండ్రి, తాత, చిన్నాన్నల మరణాల వెనుక చంద్రబాబు పాత్ర ఉంటే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు? ‘మంచోడు’ కాబట్టి వదిలేశారా??
అమరావతిపై అదే కక్ష..
రాజధాని అమరావతిపై జగన్ తన అక్కసు మరోసారి బయటపెట్టుకున్నారు. మూడు ముక్కలాటతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది ఆయనే! ఇప్పుడు... చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని ‘రివర్స్’ ఆరోపణ చేశారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్, ఇతర కార్యాలయాల నిర్మాణాలు అమరావతిలో వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ ఆపేయాలని జగన్ డిమాండ్ చేయడం గమనార్హం. పైగా... రాష్ట్రానికి చంద్రబాబు రాజధాని లేకుండా చేస్తున్నారట!