ఘోరాలు చేసి నీతులు!
ABN , Publish Date - Jan 23 , 2026 | 03:29 AM
భూముల రీసర్వే పేరుతో జరిగిందేమిటి? అది సమస్యలను పరిష్కరించడమా? కొత్త సమస్యలను సృష్టించడమా? జగన్ చెప్పుకొంటున్నట్లు అవి గొప్పలా? రైతులకు మిగిల్చిన తిప్పలా?
రీ సర్వే ‘ఘన కార్యాల’పై జగన్ గొప్పలు
సమగ్ర సర్వే పేరిట రాష్ట్రమంతా భూ విలయం
6,680 గ్రామాల్లో 8.75 లక్షల మందికి సమస్యలు
వందేళ్ల తర్వాత రీసర్వే అంటూ భారీ వివాదాలు
తాను మహాయజ్ఞం చేసినట్లుగా నేడు కలరింగ్
పైగా బాబుకు ఏమీ తెలియదని ఎద్దేవా
ఉమ్మడి రాష్ట్రంలోనే రీసర్వేకు చంద్రబాబు యత్నం
ఆ తర్వాత భూదార్, కార్స్‌తో సాంకేతికత జోడింపు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూముల రీసర్వే పేరుతో జరిగిందేమిటి? అది సమస్యలను పరిష్కరించడమా? కొత్త సమస్యలను సృష్టించడమా? జగన్ చెప్పుకొంటున్నట్లు అవి గొప్పలా? రైతులకు మిగిల్చిన తిప్పలా? ఆయన హయాంలో రీసర్వే జరిగిన 6680 గ్రామాల్లో ఏ రైతును అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు. అప్పుడు జగన్ కారణంగా తలెత్తిన సమస్యలను కూటమి సర్కారు కూడా పరిష్కరించలేకపోతోంది. రీ సర్వే కారణంగా కొత్త సమస్యలు తలెత్తాయని ఏకంగా 8,75,986 మంది పిటిషన్లు సమర్పించారు. రీసర్వేకు ముందు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో సగటున ఐదారుగురు రైతులకు భూ వివాదాలు ఉండేవి. ఆ తర్వాత... సగటున ఒక్కో గ్రామంలో 100 మంది రైతులకు భూ వివాదాలు వచ్చాయి. జగన్ సర్కారు నాటి ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు అనే చిన్న గ్రామంలో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేపట్టింది. కేవలం 182 సర్వే నంబర్లు ఉన్న గ్రామంలో దాదాపు 9 నెలలు పైలట్ ప్రాజెక్టు కింద రీసర్వే చేస్తే.. 118 సర్వే నంబర్ల పరిధిలో భూముల విస్తీర్ణంలో భారీ తేడాలు వచ్చాయి.
నాడు పైలట్ ప్రాజెక్టు పూర్తయ్యాక రెవెన్యూ శాఖ సమర్పించిన రిపోర్టులోనే ఈ అంశాలున్నాయి. అయినా ఆ రిపోర్టును జగన్ సర్కారు ఆమోదించింది. తప్పులు వస్తున్నాయని వెనకడుగు వేయవద్దని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో సర్వేచే యాలని నాటి సీఎం జగన్ స్వయంగా ఆదేశించారు. దాని ఫలితమే ఊరూరా రీసర్వే తప్పులు. సర్వే సరిహద్దుల చట్టం-1923 ప్రకారం.. సర్వే చేయానికి ముందే రైతుకు నోటీసులివ్వాలి. రీ సర్వే పూర్తయ్యాక 9(2) నోటీసు ఇవ్వాలి. రైతుల అభ్యంతరాలను పరిష్కరించడానికి గడువు ఇవ్వాలి. ఇవేవీ సక్రమంగా జరగలేదు. అందుకే... ఇన్ని తప్పులు, తిప్పలు.
సర్వే ఆఫ్ ఇండియా ఎందుకు వైదొలగింది?
సర్వే పారదర్శకంగా చేశామని గురువారం ప్రెస్‌మీట్‌లో జగన్ పదేపదే ప్రస్తావించారు. అదే నిజమైతే రీ సర్వే నుంచి సర్వే ఆఫ్ ఇండియా (ఎస్‌వోఐ) ఎందుకు వైదొలగింది? భూముల సర్వేలో పాల్గొనేందుకు ఆ సంస్థ తొలుత ఆసక్తి చూపింది. సేవలతోపాటు టెక్నాలజీ కూడా అందిస్తామని సర్కారుతో ఎంవోయూ కుదుర్చుకుంది. కానీ... రీసర్వే చట్టపరిధిలో సాగడం లేదని, అడ్డగోలు తప్పులు చేస్తూ వాటిని ఆమోదించమంటున్నారంటూ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగింది. జగన్ సొంత మనుషులు, సిబ్బందిని తొందరపెట్టినట్లుగా.. ఒత్తిడి చేసినట్లుగా సర్వే ఆఫ్ ఇండియాకు రీసర్వే టార్గెట్లు పెట్టడం వల్లే ఆ సంస్థ వైదొలగిన మాట నిజం. అంతేకాదు... పైలట్ ప్రాజెక్టు జరిగిన తక్కెళ్లపాడులో వచ్చినటువంటి తప్పులే రాష్ట్రమంతా వస్తున్నాయని, రీసర్వేలో లోపాలున్నాయని కలెక్టర్లు, సర్వే అధికారులు నివేదించినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా... రీసర్వేలో తప్పులున్నాయంటూ ఎవ్వరూ నివేదించవద్దని.. సర్వే తప్పులను ఎత్తిచూపవద్దని టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్సుల్లో నాటి సర్వే ఉన్నతాధికారి బెదిరింపులకు దిగారు.
బాబు ఎప్పుడో చేసిన ఆలోచనే ఇది...
‘చంద్రబాబుకు రీసర్వే గురించి తెలుసా? ఏనాడైనా ఆలోచించారా? టెక్నాలజీతో సర్వే చే యాలన్న ఆలోచన ఎందుకు రాలేదు?’ అని కూడా జగన్ ప్రశ్నలు సంధించారు. అయితే... ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడున్న టెక్నాలజీ ఎలకా్ట్రనిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) ద్వారా 2000లోనే చంద్రబాబు రీ సర్వేకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, చిత్తూరు జిల్లా వెంకటగిరి కోట, కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలాల పరిధిలో పైలట్ ప్రాజెక్టులు చేపట్టారు. కానీ భూముల విస్తీర్ణంలో తేడాలు రావడం, రైతులు సంతృప్తిగా లేకపోవడంతో పక్కనపెట్టారు. ఆ తర్వాత అంటే 2015లోనూ రీసర్వేకు చంద్రబాబు మరోసారి ప్రయత్నించారు. ఇందుకు తన కుప్పం నియోజక వర్గాన్నే ఎంచుకున్నారు. హై రిజల్యూషన్ శాటిలైట్ ఇమేజ్ (హెచ్‌ఆర్‌ఎ్‌సఐ) టెక్నాలజీ వినియోగించారు. భూముల విస్తీర్ణంలో తేడాలు భారీగా వస్తుండడంతో ఆ పనినీ ఆపేశారు. మరోసారి 2016లో ఈటీఎస్ ఆధారంగా అనంతపురం, కర్నూలు, విశాఖలో రీ సర్వే ప్రయత్నాలు చే శారు. ఇక్కడా భూముల విస్తీర్ణంలో తేడాలు, కొత్త వివాదాలు వస్తుండడంతో నిలిపివేశారు. కానీ... జగన్ సర్కారు పైలట్‌లో తప్పులు వచ్చినా రాష్ట్రమంతా అలాగే తప్పులతో సర్వేచేసి నానా గందరగోళం సృష్టించింది.
డిజిటలైజేషన్ జరిగింది బాబు హయాంలోనే..
భూ రికార్డుల ఆధునికీకరణ గురించి చంద్రబాబుకు తెలుసా అని జగన్ మరో అసంబద్ధ ప్రశ్న వేశారు. వెబ్‌ల్యాండ్ విధానం తీసుకొచ్చింది ఎవరు? భూ రికార్డులను డిజిటలైజ్ చేసి వాటికి చట్టబద్ధత తీసుకొచ్చింది ఎవరు? 2014-19 కాలంలోనే ఇవి జరిగాయని జగన్‌కు తెలిసినా.. ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు. వెబ్‌ల్యాండ్‌లోని ఆర్‌ఎ్‌సఆర్ డేటాకు రైతుల ఆధార్‌ను సీడింగ్ చేయించింది కూడా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వమే. రైతుల భూమి పటాలను తెలిపే భూమి చిత్రపటాలు (ఫీల్డ్ మెజర్‌మెంట్ బుక్స్-ఎ్‌ఫఎమ్‌బీ) అధ్వాన స్థితిలో ఉంటే వాటిని డిజిటలైజ్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. 2014-19 కాలంలో 95 శాతం పూర్తయిన ఎఫ్‌ఎమ్‌బీ డిజిటలైజేషన్‌ను జగన్ రాగానే నిలిపివేయించారు. దీంతో అప్పటివరకు ఈ ప్రాజెక్టుపై చేసిన వ్యయం వృధా అయింది.
కార్స్‌తో 2018లోనే భూదార్!
రీసర్వే చేపట్టిన ప్రతి సారీ భూముల విస్తీర్ణంలో తేడాలు వస్తుండడంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు భావించారు. ఇందుకు అంతర్జాతీయంగా పేరుగాంచిన అక్షాంశ, రేఖాంశాలతో కూడిన సాంకేతికతను ఉపయోగించాలని నిర్ణయించారు. రైతుకు చెందిన ప్రతి భూమికీ అక్షాంశ, రేఖాంశాలను నిర్దేశించడం ద్వారా ఎవరి భూమి ఎక్కడుందో చూపించి, భూ వివాదాలకు చెక్‌పెట్టాలని భావించారు. దీని ఫలితమే భూధార్ ప్రాజెక్టు. 2018లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో దీనిని ప్రారంభించారు. టెక్నాలజీలో బాగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ సత్యనారాయణ నేతృత్వంలో భూదార్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు కోసమే కార్స్(కంటిన్యుయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్)ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కార్స్ బేస్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు 2018 సెప్టెంబరు 25న జీవో 1348 జారీచేశారు. ఇది దాచలేని చరిత్ర. 2019లో జగన్ సర్కారు వచ్చాక భూదార్‌ను పక్కనపెట్టేశారు. దానికి రీసర్వే అని పేరుపెట్టారు. అయినా సరే, కార్స్ నెట్‌వర్క్, రోవర్లను తానే తెచ్చానని జగన్ గొప్పగా చెప్పుకోవడం గమనార్హం.