Share News

జగన్‌ రాకతో జనాలకు తంటా

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:46 AM

వైసీపీ అధినేత జగన్‌ పరామర్శల ప్రహసనం ప్రజలకు నరకం చూపిస్తోంది. ఆయన పర్యటనలు సాగు..తున్న తీరుతో అత్యవసర పనుల మీద రోడ్డెక్కె వాహనదారులు చుక్క లు చూస్తున్నారు.

జగన్‌ రాకతో జనాలకు తంటా

  • ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శను బల ప్రదర్శనలా మార్చిన జగన్‌

  • ఓర్వకల్లు టు కర్నూలు జిల్లా జైలుకు గంట

  • కాన్వాయ్‌లో 40 నిమిషాలకు మించదు

  • కానీ.. నాలుగు గంటలు సాగిన వైనం

  • హైవే మీద వైసీపీ కార్యకర్తల వీరంగం

  • నిషేధాజ్ఞలున్నా గుంపులుగా రోడ్డుపైకి..

  • జనాలు, వాహనదారులకు ఇక్కట్లు

  • జైలు వద్ద కార్యకర్తల ‘అతి’..

  • పోలీసులతో వాగ్వాదం.. తోపులాట.. రచ్చరచ్చ

కర్నూలు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధినేత జగన్‌ పరామర్శల ప్రహసనం ప్రజలకు నరకం చూపిస్తోంది. ఆయన పర్యటనలు సాగు..తున్న తీరుతో అత్యవసర పనుల మీద రోడ్డెక్కె వాహనదారులు చుక్క లు చూస్తున్నారు. మహిళను అవమానించడంతో పాటు టీడీపీ కార్యకర్తలపై దాడిచేసిన కేసులో జైలుకువెళ్లిన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శ కోసం గురువారం కర్నూలు జిల్లాలో జగన్‌ పర్యటించారు. ఓర్వకల్లు విమానాశ్రయంలో దిగిన ఆయన కర్నూలు జిల్లా కారాగారం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించారు. నిజానికి, ఓర్వకల్లు నుంచి కర్నూలు జైలు వద్దకు వెళ్లడానికి పట్టేది గంట. జగన్‌ కాన్వాయ్‌కు 40 నిమిషాలకంటే ఎక్కువ పట్టదు. అలాంటిది జగన్‌ నాలుగు గంటలకుపైగా యాత్రను సాగదీశారు. పోలీసుల ఆంక్షలు, నిబంధనలను తుంగలో తొక్కి జాతీయ రహదారిపైకి వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడం.. పార్టీ జెండాలు చేతపట్టుకుని కేరింతలు కొడుతూ రోడ్డుపై అడ్డదిడ్డంగా పరుగులు పెట్టడంతో, ఆ మార్గంలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అసాంతం బల ప్రదర్శనలా సాగిన జగన్‌ యాత్రలో వైసీపీ కార్యకర్తలు ‘అతి’ చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జీలు.. కార్యకర్తలతో జాతీయ రహదారిని ఎక్కడికక్కడ నిర్బంధించారు. వివిధ సర్కిళ్లలో గుంపులుగా చేర్చారు. అలాంటి చోట ఆగుతూ..రోడ్‌షో సాగిస్తూ.. కార్యకర్తలకు అభివాదం చేస్తూ జగన్‌ పర్యటనను సాగించారు. కార్యకర్తల అత్యుత్సాహంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీస్‌ ఆంక్షలు ఉల్లంఘిస్తూ నేషనల్‌ హైవేపై హంగామా సృష్టించారు. నేషనల్‌ హైవేపై జగన్‌ కాన్వాయ్‌తో జిల్లా జైలు వద్దకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. అయినా.. ఆ మార్గంలో కొందరు కార్యకర్తలు వీరంగం సృష్టించారు.


అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. వాగ్వాదానికి దిగి పోలీసులనే తోసేశారు. ఇలా.. ఉదయం 11 గంటలకు రోడ్డెక్కిన ఆయన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కర్నూలు రూరల్‌ మండలం పంచలింగాల గ్రామం సమీపంలో ఉన్న జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. విరూపాక్షిని ములాఖత్‌లో కలిసేందుకు జగన్‌, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతి ఉంది. అయితే.. పోలీస్‌ భద్రతా వలయాలను తోసేసి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు జైలు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. విరూపాక్షిని ఆయన భార్య, కుమారుడుతో కలసి వెళ్లి జగన్‌ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విరూపాక్షిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా అరెస్టు చేయించింది. ఆ ఘటనలో ఆయన మానవత్వంతో వ్యవహారించారు. మాజీ సీఎంను అని కూడా చూడకుండా జైలు గేటు బయట నిలబెట్టి నన్ను ఫొటోలు తీసి అవమానించారు. తిరిగి మా ప్రభుత్వం వచ్చాక రెట్టింపు చేస్తాం’’ అని జగన్‌ హెచ్చరించారు.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు ప్రత్యక్షం..

జగన్‌ కర్నూలు పర్యటనలో తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే విజయుడు పేరిట స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. పంచలింగాల చెక్‌పోస్టు సర్కిల్‌ నుంచి జిల్లా జైలుకు వెళ్లే రహదారిలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 14 , 2026 | 04:47 AM