Minister Parthasarathy: అధికారం ఉంటే ఒకలా.. లేకుంటే మరోలా!
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:51 AM
సొంత ప్యాలెస్‌లకు రూ.వేల కోట్లు ఖర్చు చేసిన జగన్... ప్రజా రాజధానికి మాత్రం నయా పైసా ఖర్చు పెట్టలేదు అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు.
జగన్ తాచుపాము బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం: పార్థసారథి
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘సొంత ప్యాలెస్‌లకు రూ.వేల కోట్లు ఖర్చు చేసిన జగన్... ప్రజా రాజధానికి మాత్రం నయా పైసా ఖర్చు పెట్టలేదు’ అని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రానికి మంచి రాజధాని ఎంత అవసరమో... ఆ రాజధానిపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించడం కూడా అంతే అవసరం. అధికారం లేనప్పుడు అసెంబ్లీ సాక్షిగా రాజధానికి జై అన్న జగన్, అధికారంలోకి వచ్చిన తర్వాత నై అని అన్నారు. నయవంచనకు అసలైన రూపం జగనే. జగన్ కారణంగా ఐదేళ్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా ప్రజలు బాధపడాల్సి వచ్చింది. కులాల మధ్య చిచ్చు, ప్రాంతాల మధ్య విషం నింపడమే జగన్‌రెడ్డి నీచ రాజకీయం. అమరావతిని ఒక ప్రాంతానికే చెందిన నగరంగా చిత్రీకరించడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. పీపీపీ విధానంలో వచ్చే సంస్థల యజమానులను తాము అధికారంలోకి రాగానే అరెస్టు చేస్తామని బెదిరించడం జగన్ జుగుప్సాకర రాజకీయానికి తార్కాణం. 11 సీట్లకు పడిపోయినా, జగన్ తాచుపాము బుద్ధి మారకపోవడం దౌర్భాగ్యం’ అని మంత్రి మండిపడ్డారు.