పరామర్శా.. లేక బల ప్రదర్శనా?
ABN , Publish Date - Feb 05 , 2026 | 06:09 AM
ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడి జైలు పాలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల పరామర్శ పేరుతో వైసీపీ అధినేత జగన్ బుధవారం బల ప్రదర్శనకు దిగారు.
అరగంట ప్రయాణానికి 9 గంటలపాటు జగన్ దండయాత్ర
వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపేసి.. లేని జనం ఉన్నట్టు నానా హడావుడి
ట్రాఫిక్ భారీగా స్తంభించినట్టు కలరింగ్
అంబటి ఇంట్లో గడిపింది అరగంట
మీడియాతో మాట్లాడింది గంటన్నర
అడుగడుగునా నిషేధాజ్ఞల ఉల్లంఘన
పోలీసుల హెచ్చరికలు బేఖాతర్
నరకం చూసిన గుంటూరు వాసులు
గుంటూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రిపై బూతులు మాట్లాడి జైలు పాలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబసభ్యుల పరామర్శ పేరుతో వైసీపీ అధినేత జగన్ బుధవారం బల ప్రదర్శనకు దిగారు. పరామర్శకు వచ్చినట్లు కాకుండా గుంటూరు నగరంపై దండయాత్ర చేసినట్లుగా ఆయన పర్యటన సాగింది. తాడేపల్లికి, గుంటూరు నగరానికి మధ్య దూరం సుమారు 30 కిలోమీటర్లు. అరగంటలో చేరుకోవచ్చు. కానీ, తొమ్మిది గంటలపాటు ఈ తతంగాన్ని జగన్ అండ్ కో నడిపించారు. జనం పెద్దగా లేకపోయినప్పటికీ వాహనాలను అడ్డదిడ్డంగా నిలిపివేసి, భారీగా జనం వచ్చినట్లు, ట్రాఫిక్ స్తంభించినట్లు కలరింగ్ ఇచ్చారు. సాయంత్రం నాలుగున్నరకు అంబ టి ఇంటిలోకి ప్రవేశించిన జగన్ అక్కడ గడిపింది అరగంట. కానీ, ఐదు గంటలకు బయటికి వచ్చి గంటన్నరకుపైగానే మీడియాతో మాట్లాడటం గమనార్హం.
ఆద్యంతం ఆంక్షలను ఉల్లంఘిస్తూ..
జగన్ పర్యటన ఆద్యంతం నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ సాగింది. జగన్ పర్యటన సందర్భంగా గతంలో చోటు చేసుకున్న పరిణామాలను, శాంతిభద్రతల సమస్యలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. నగరంలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, ఉల్లంఘించి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తే 30 పోలీస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. జగన్ పర్యటనకు అనుమతి లేదని కూడా ప్రకటించారు. అయినప్పటికీ జగన్ అండ్ కో పోలీస్ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుంటూరుకు బయలుదేరారు. ఉదయం 10:40 నిమిషాలకు జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి 20 వాహనాల్లో బయలుదేరారు. అక్కడి నుంచి గుంటూరు చేరుకునే వరకు సుమారు పదిచోట్ల ఐదారు వందల మంది కార్యకర్తలు రాగానే, వాహనాలను ఎక్కడికి అక్కడ నిలిపివేశారు. దీంతో జాతీయ రహదారితో పాటు గుంటూరు నగరంలోనూ ఎక్కడికక్కడ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. వీఐపీ రోడ్డు నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు ఇంటి వరకు సుమారు మూడు గంటల పాటు ఈ యాత్ర సాగింది. పట్టాభిపురం, గుజ్జనగుండ్ల రింగ్‌రోడ్లలో వాహన చోదకులు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విధం గా సాయంత్రం 4.20కి జగన్ కాన్వాయ్ అం బటి ఇంటి వద్దకు చేరుకుంది. కాగా, నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగించిన నేపథ్యంలో జగన్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేేస అవకాశం ఉన్నా, పోలీసులు సంయమనం పాటించారు.
రోజంతా ఉద్రిక్తత
గుంటూరు నగరంలో అంబటి నివాసం ఉన్న సిద్థార్థ నగర్ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కార్యాలయం వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, అటువైపు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా అంబటి ఇంటికి అత్యంత సమీపంలో ఉన్న టీడీపీ నాయకుడు శివనాగమల్లేశ్వరరావు అలియాస్ అబ్బూరు మల్లి కార్యాలయానికి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జగన్ ఎక్కడికి బయలుదేరితే అక్కడకు వెంట వ చ్చే తాడేపల్లికి చెందిన జేబు దొంగల ముఠా బుధవారం ఆయన పర్యటనలో హల్‌చల్ చేసింది. 15 మంది ముఠా ఆయన పర్యటనలో చేతివాటం ప్రదర్శించింది. అనేకమంది జేబుల్లోని డబ్బులు, సెల్‌ఫోన్లు కొట్టేశారు.