Share News

అక్రమాల గుట్టు తేల్చరా!?

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:00 AM

గత జగన్‌ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా..

అక్రమాల గుట్టు తేల్చరా!?

  • జగన్‌ ప్రభుత్వం నాటి ఇసుక బిల్లుల క్లియరెన్స్‌కు ఏపీఎండీసీలో కదలిక

  • నిపుణులతో అధ్యయన కమిటీ ఏర్పాటు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత జగన్‌ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సిద్ధమవుతోంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా.. నేతల ఒత్తిళ్లు, పీజీఆర్‌ఎ్‌సలో వరస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండటంతో బకాయిలను సెటిల్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపుపై అధ్యయనం కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్‌కుమార్‌ తాజాగా ఆదేశాలు జారీ చే శారు. ఈ కమిటీలో గత జగన్‌ ప్రభుత్వంలో నియమితులై, ఇప్పటికీ ఎండీసీలో కీలక హోదాలోనే కొనసాగుతున్న ఓ వైస్‌ ప్రెసిడెంట్‌, ఎండీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ముఖ్య ఆర్థిక అధికారి(సీఎ్‌ఫఓ), ఫైనాన్స్‌, అకౌంట్స్‌ విభాగం చూసే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, కంపెనీ కార్యదర్శి, ఆడిట్‌ విభాగం అధికారి సభ్యులుగా ఉంటారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అమ్మకాలను ప్రైవేటు కంపెనీ జేపీ వెంచర్స్‌కు అప్పగించడానికి ముందు ఏడాదిపైనే ఏపీఎండీసీ నేతృత్వంలో ఇసుక నిర్వహణ జరిగింది. ఇందుకోసం ఏపీఎండీసీ జిల్లా, డివిజన్‌, మండలాల వారీగా ప్రైవేటు ఏజెన్సీలు, సంస్థలను ఎంపిక చేసి వాటి ద్వారా ఇసుక అమ్మకాలు నిర్వహించింది. అప్పట్లో నాటి అధికార వైసీపీ నేతలు కొందరు తమ ప్రధాన అనుచరులు, బినామీలను ముందుపెట్టి ఇసుక కాంట్రాక్టులు తీసుకున్నారు. కొందరు నిజంగానే పారదర్శకంగా టెండర్లు దక్కించుకున్నారు. 2019 సెప్టెంబరు నుంచి 2021లో ప్రైవేటు ఏజెన్సీకి కాంట్రాక్ట్‌ ఇచ్చేవరకు ఏపీఎండీసీనే ఇసుక వ్యాపారాన్ని చూసుకుంది. ఈ సమయంలో వైసీపీ నేతలు భారీగా ఇసుక వ్యాపారాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అమ్మకాల్లో ఎండీసీకి డబ్బులు వచ్చాయి కానీ, ఇసుక రవాణా చేసిన వారికి, కాంట్రాక్టులు చేసిన మరికొందరికి బిల్లులు చెల్లించలేదు. తమకు బిల్లులు చెల్లించాలని కొందరు కోర్టును ఆశ్రయించారు.


బిల్లులను ఎందుకు పెండింగ్‌ పెట్టార ని హైకోర్టు పలుమార్లు చీవాట్లు పెట్టింది. తప్పనిసరి పరిస్థితుల్లో కొంద రు కాంట్రాక్టర్లకు బిల్లులు సెటిల్‌ చేశారు. కానీ ఇంకా భారీగానే సెటిల్‌ చేయాల్సి ఉంది. ఇందులో నాటి వైసీపీ నేతలు, లోగడ కీలక ప్రజాప్రతినిధులుగా వ్యవహరించిన వారి ప్రధాన అనుచరుల బకాయిలు కూడా ఉన్నాయి. ఇసుక అమ్మకాలకు సంబంధించి పలువురిపై ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వారు కోర్టుకు వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులు చెల్లించాలన్న ఒత్తిళ్లు రకరకాల పద్ధ్దతుల్లో వచ్చినా స్పందించలేదు. ఇప్పుడు కొందరు వైసీపీ నేతలు తమకు తెలిసిన అధికారుల ద్వారా ఇసుక బకాయిల చెల్లింపు అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అనూహ్యంగా ఈ అంశంపై ఏపీఎండీసీలోనూ కదలిక వచ్చింది. నాడు ఇసుక అమ్మకాల్లో ఏం జరిగిందో నిగ్గు తేల్చకుండా, ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపుపై అధ్యయనానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 27 , 2026 | 04:01 AM