Share News

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ జగన్‌ పనే

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:58 AM

రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికలపై అప్పట్లో కొన్ని సందేహాలు, వినతులు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు వాటికి వివరణ ఇచ్చారు.

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ జగన్‌ పనే

  • వైసీపీ హయాంలోనే రిజర్వేషన్‌ జీవో

  • నాటి నుంచి ప్రతి నోటిఫికేషన్‌లోనూ అమలు

  • డీఎస్సీలో అపోహలకు ఆ జీవోనే కారణం

  • హారిజాంటల్‌ అర్థంకాకే ఈ గందరగోళం

  • క్రీడా కోటాలో పరీక్షలపై అబద్ధాల ప్రచారం

  • రాత పరీక్ష ఉన్నా, లేకపోయినా ఒకటే

  • అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం

2023, ఆగస్టు 2న హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమల్లోకి తీసుకొస్తూ అప్పటి జగన్‌ ప్రభుత్వం జీవో 77ను జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేశారు.

హారిజాంటల్‌ రిజర్వేషన్‌.. డీఎస్సీలో అపోహలకు దారితీసిన రిజర్వేషన్‌ విధానం. వాస్తవానికి హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను తీసుకువచ్చింది జగన్‌ సర్కారే. ఈ రిజర్వేషన్‌ ప్రకారం.. ఎంత మెరుగైన ర్యాంకు వచ్చినా చివరి వరకు ఉద్యోగానికి ఎంపికవుతారా? లేదా? అనేది సందేహమే. చివరి క్షణం వరకు ఏ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థి జాబితా నుంచి బయటికి వెళ్తారో తెలియదు. ఈ విధానం అర్థంకాకే చాలా మంది అభ్యర్థులు తమకు కావాలనే ఉద్యోగాలు ఇవ్వలేదని ఆందోళన చెందుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికలపై అప్పట్లో కొన్ని సందేహాలు, వినతులు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. అయితే, గత కొద్దిరోజులుగా జగన్‌ మీడియా, వైసీపీ.. హారిజాంటల్‌ రిజర్వేషన్‌పై దుష్ప్రచారం చేస్తున్నాయి. దీంతో దాదాపు 10 నెలలుగా ఈ విషయాన్ని పట్టించుకోని కొందరు అభ్యర్థులు ఇప్పుడు తెరపైకి వచ్చారు. నిజంగానే తమకు అన్యాయం జరిగిందేమోనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఇటీవల జగన్‌ డీఎస్సీ అభ్యర్థులతో ఓ సమావేశం నిర్వహించారు. ‘‘అయ్యో.. డీఎస్సీలో అన్యాయం చేసి మీకు ఉద్యోగాలు రాకుండా చేశారు.’’ అంటూ అభ్యర్థుల పట్ల సానుభూతి కురిపించారు. కళ్లు మూసి తెరిస్తే మూడేళ్లు గడిచిపోతాయని ఆ వెంటనే మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. అయితే, అసలు ఈ మొత్తం గందరగోళానికి కారణమైన హారిజాంటల్‌ రిజర్వేషన్‌ గురించి మాత్రం జగన్‌ పెదవి విప్పలేదు. దీనికి కారణం హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమల్లోకి తెచ్చింది ఆయనే. 2023, ఆగస్టు 2న హారిజాంటల్‌ రిజర్వేషన్‌ను అమల్లోకి తీసుకొస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం జీవో 77ను జారీ చేసింది. ఆ తర్వాత వచ్చిన పలు ఉద్యోగ నోటిఫికేషన్లకు ఈ రిజర్వేషన్‌ విధానాన్ని అమలు చేశారు. తాజాగా డీఎస్సీ పోస్టుల భారీలోనూ ఇదే రిజర్వేషన్‌ను అమలు చేశారు. మొత్తం 15,941 పోస్టులను భర్తీ చేసిన క్రమంలో చాలా మంది దగ్గరి వరకూ వచ్చి ఉద్యోగాలు కోల్పోయారు. తొలుత ఉద్యోగం వస్తుందని భావించినా హారిజాంటల్‌ రిజర్వేషన్‌ వర్తింపుతో వారు ఉసూరు మనక తప్పలేదు. హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ప్రక్రియలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీ్‌సమెన్‌కు పోస్టులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, ఈ ప్రక్రియలో ఎక్కడా ఉల్లంఘనలకు అవకాశం లేకుండా అధికారులు పక్కాగా వ్యవహరించారు. జీవో 77ను అనుసరించే హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలుచేశారు. ఈ జీవో కారణంగా అభ్యర్థులకు అన్యాయం జరిగిందంటే దానికి జగన్‌ ప్రభుత్వమే కారణమవుతుంది. కూటమి ప్రభుత్వం యథాతధంగా అదే జీవోను అమలుచేసింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్‌ను మాత్రమే వర్గీకరించింది. అది కూడా ఎస్సీ కేటగిరీలో అంతర్గతంగా జరిగింది.


ఫిక్స్‌డ్‌ రోస్టర్‌ తొలగించడంతో

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ రాకముందు వర్టికల్‌ రిజర్వేషన్‌లో ఫిక్స్‌డ్‌ రోస్టర్‌ పాయింట్లు ఉండేవి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌తో పాటు మహిళా, క్రీడలు, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్ కోటాలకు కూడా ముందుగానే రోస్టర్‌ ఫిక్స్‌ అయ్యేది. ఆ కేటగిరీల అభ్యర్థులను వారికి కేటాయించిన పాయింట్లలోనే చూపించేవారు. దీంతో గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు హారిజాంటల్‌లో మహిళా, క్రీడా, పీహెచ్‌, ఎక్స్‌ సర్వీస్‌మెన్ కోటాలకు ఫిక్స్‌డ్‌ రోస్టర్‌ తొలగించారు. తొలుత క్రీడా కోటా అభ్యర్థులను వారి సామాజికవర్గాల రోస్టర్‌లో ఎంపిక చేశారు. సామాజిక రిజర్వేషన్లు పూర్తయ్యాక మిగిలిన మూడు కోటాలకు హారిజాంటల్‌ రిజర్వేషన్‌ అమలుచేశారు. లేనిపక్షంలో చివర్లో హారిజాంటల్‌ అమలు చేసి జనరల్‌ మెరిట్‌ అభ్యర్థులను తొలగించి ఈ మూడు కోటాల అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ క్రమంలో వెనక ర్యాంకుల్లో ఉన్న ఈ మూడు కోటాల అభ్యర్థులు ఏ సామాజికవర్గాలకు చెందిన వారైతే.. జనరల్‌ మెరిట్‌లో చివరన ఉన్న అదే సామాజిక వర్గాల అభ్యర్థుల కు నష్టం జరిగింది. ఇది చాలా సంక్లిష్టంగా ఉండటం వల్ల కావాలనే అన్యాయం చేశారనే అనుమానాలు వచ్చాయి. వైసీపీ, జగన్‌ మీడియా అగ్నికి ఆజ్యం పోసినట్లు అభ్యర్థులను మరింత రెచ్చగొట్టాయి. మొత్తం ఆందోళనకు కారణమైన జీవో 77ను తీసుకొచ్చింది జగన్‌ ప్రభుత్వమేననే వాదనను కావాలని తెరమరుగు చేశాయి.


రాత పరీక్ష ఉన్నా.. లేకున్నా..

క్రీడా కోటా అభ్యర్థులకు రాత పరీక్ష తొలగించడంపై జగన్‌ ఆరోపణలు చేశారు. కావాలనే రాత పరీక్ష లేకుండా నేరుగా ఉద్యోగాలిచ్చారని విమర్శిస్తున్నారు. అయితే, గతంలో రాత పరీక్ష వల్ల ఏం జరిగిందనే దానిని మాత్రం బయటకు చెప్పడం లేదు. మెగా డీఎస్సీ నిర్వహణకు ముందు క్రీడా కోటా అభ్యర్థులకు రాత పరీక్షను రద్దుచేశారు. కేవలం వారి క్రీడా ప్రతిభ, సంబంధిత పోస్టులకు విద్యాపరమైన అర్హతలను మాత్రమే ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే, మెగా డీఎస్సీకి ముందు డీఎస్సీల్లో రాత పరీక్ష నిర్వహించినా, మెగా డీఎస్సీల్లో రాత పరీక్ష నిర్వహించకపోయినా ఒకే విధానం అమలైంది. గతంలో డీఎస్సీల్లో రాత పరీక్ష ఉన్నప్పుడు పాఠశాల విద్యాశాఖ అన్ని పోస్టులకు కలిపి ఒకే నోటిఫికేషన్‌ జారీచేసేది. క్రీడా కోటా అభ్యర్థులు కూడా పరీక్షలు రాసేవారు. అనంతరం వారి జాబితాలను శాప్‌కు పంపేవారు. అక్కడ రాత పరీక్ష మార్కులను ఒక్కశాతం కూడా పరిగణనలోకి తీసుకునేవారు కాదు.


పతకాలే ప్రామాణికం

రాత పరీక్షలో వంద మార్కులు వచ్చిన అభ్యర్థి.. క్రీడా ప్రతిభలో వెనకబడితే.. రాత పరీక్షలో 30 మా ర్కులే వచ్చిన అభ్యర్థికి ఎక్కువ పతకాలు లభించి ఉంటే క్రీడల కోటాలో 30 మార్కుల అభ్యర్థినే ఎంచుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే కేవలం అభ్యర్థుల దరఖాస్తుల నమోదుకే క్రీడాకారులతో రాత పరీక్ష రాయించేవారు. మెగా డీఎస్సీలో రాత పరీక్ష తొలగించి క్రీడా కోటా పోస్టులకు స్పోర్ట్స్‌ శాఖ ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో అభ్యర్థులు నేరుగా క్రీడా కోటా నోటిఫికేషన్‌లోనే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాత పరీక్ష అవసరం లేకుండా పోయింది. భవిష్యత్తులో క్రీడా కోటా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినా వాటిలో వచ్చే మార్కులకు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు. ఈ విషయం బయటకు చెప్పకుండా కావాలనే రాత పరీక్ష తీసేశారని వైసీపీ అధినేత దుష్ప్రచారం చేస్తున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 04:02 AM