జగన్ పీఏ భూంఫట్!
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:06 AM
తిరుపతి జిల్లాలో హథీరాంజీ మఠం భూములు, విజయవాడ శివారులో రైతుల పొలాలు, విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను కొట్టేసి.. జగన్ పీఏ కేఎన్‌ఆర్ రూ.వేల కోట్ల ఆస్తుల సామ్రాజ్యాన్ని..
వ్యవస్థలను వాడుకుని వందల కోట్ల దోపిడీ
విశాఖలో రూ.250 కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాలు స్వాహా
బెజవాడలో రియల్టర్‌ను గన్‌తో బెదిరించి ఓ వెంచర్‌లో 5400 గజాలు
తిరుపతి సమీపంలో చెవిరెడ్డి వెంచర్‌లో పదెకరాలు
భార్య పేరుతో 81 లక్షలకే కొన్న కేఎన్‌ఆర్
మద్యం సిట్‌కు దొరికింది ఇక్కడే
తవ్వితీస్తున్న దర్యాప్తు బృందాలు
అధికారం దక్కించుకున్న అవినీతి నేతలు.. అక్రమాలకు పాల్పడి వందలు, వేల కోట్ల రూపాయలు ఆర్జించిన ఘటనలు ఉన్నాయి.. కానీ ఒక ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రూ.వందల కోట్ల ఆస్తులకు పడగలెత్తడం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే జరిగింది. తండ్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన మేళ్లకు ప్రతిఫలంగా.. తనయుడు జగన్ ఆస్తులు పోగేసుకున్న తరహాలోనే ఆయన పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డి (కేఎన్‌ఆర్) భూ దోపిడీకి పాల్పడ్డాడు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని, బ్యూరోక్రాట్లను వాడుకుని, న్యాయ ప్రక్రియను హైజాక్ చేసి, షెల్ కంపెనీలు సృష్టించి, బినామీల పేర్లతో అతడు కుప్పపోసిన ఆస్తుల గుట్టలు చూసి.. దర్యాప్తు బృందాలు విస్తుపోతున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తిరుపతి జిల్లాలో హథీరాంజీ మఠం భూములు, విజయవాడ శివారులో రైతుల పొలాలు, విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను కొట్టేసి.. జగన్ పీఏ కేఎన్‌ఆర్ రూ.వేల కోట్ల ఆస్తుల సామ్రాజ్యాన్ని విస్తరించిన తీరు సినిమాల్లో చూపించే మాఫియాను తలపిస్తోంది. బంధువులు, స్నేహితులు బినామీలుగా లెక్కకు మించి షెల్ కంపెనీలు పుట్టించి.. విదేశీ నిధులు వచ్చినట్లు చూపించి.. విశాఖపట్నం కేంద్రంగా వందల కోట్ల భూ దోపిడీకి పాల్పడిన వైనం సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీ్‌సను తలపిస్తోంది. విజయవాడలో రైతుల భూములను కొని వెంచర్‌లో కలిపి.. రియల్టర్‌ను గన్‌తో బెదిరించి అందరకి కన్నా ఎక్కువ లాక్కున్న వైనం మాఫియాను గుర్తుచేస్తోంది. తిరుపతిలో హథీరాంజీ మఠం భూములను సైతం కొట్టివేసిన విధానం కొండపై ఉన్న దేవదేవుడినే భయపెట్టేలా ఉంది. కేఎన్‌ఆర్ భూ దోపిడీ ఇలా..
నాటి నంబర్ టూతో కలిసి..
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలోకి జగన్ హయాంలో వైసీపీకి చెందిన ముఠాలు చొరబడ్డాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న అందమైన నగరంలో రుషికొండను తవ్వి రూ.వందల కోట్ల ప్రజాధనంతో విలాసవంతమైన ప్యాలెస్ నిర్మాణం మొదలుపెట్టడంతో జగన్ సొంత జిల్లాకు చెందిన శక్తులు అక్కడ తిష్ఠవేశాయి. కేఎన్‌ఆర్ సైతం అక్కడి భూములపై కన్నేశాడు. ఆధునిక విశాఖగా పేరొందిన మధురవాడ, భీమిలి ప్రాంతంలోని భూములపై గురిపెట్టాడు. అప్పట్లో విశాఖను ఏలుతున్న వైసీపీ నంబర్ టూ నేతతో కలిసి భారీ స్కెచ్ వేశాడు. ఏపీ హౌసింగ్ బోర్డుతో 2019 ఫిబ్రవరిలో అభివృద్ధి ఒప్పందం చేసుకుని ఎన్‌సీసీ అనే నిర్మాణ సంస్థ తీసుకున్న 97 ఎకరాలపై కన్నేశాడు. నిధుల కొరత, కరోనా కారణంగా ఏడాదిన్నర దాటినా ఆ సంస్థ పనులు మొదలుపెట్టలేదు. అక్కడ ఎకరం రూ.100 కోట్ల వరకు ఉంది. అయినా 97 ఎకరాలను కారుచౌకగా రూ.180 కోట్లకే సదరు కంపెనీకి కట్టబెట్టడానికి.. దానికి నిధులు సమకూర్చే మిషతో ఆ భూములు స్వాహా చేసేందుకు కేఎన్‌ఆర్ ముఠా పథక రచన చేసింది. దానికి నిధులివ్వడానికి మాత్సడో అనే సింగపూర్ కంపెనీని పుట్టించారు. దానికి భారత్‌లో భాగస్వామిగా జెయింట్ ఇంజనీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పెట్టారు. ఈ రెండు కంపెనీల యజమానులెవరని ఆరా తీస్తే.. కేఎన్‌ఆర్ బినామీ, అతడి దగ్గరి స్నేహితుడు కుందూరు రమణారెడ్డి పేరుతోనే ఆ రెండూ ఉన్నట్లు బయటపడింది. రమణారెడ్డిపై దేశంలోని పలు ప్రాంతాల్లో 16 కేసులున్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే రెండేళ్ల కిందట దేశం వదిలి పారిపోయాడు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. భాగస్వామ్యం కింద ఎన్‌సీసీలోకి రూ.76 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చిన ఈ రమణారెడ్డి.. విశాఖలోని 97 ఎకరాల్లో కనీసం లేఅవుట్ కూడా వేయకముందే 22 ప్లాట్లను (ఒక్కొక్కటీ 676 గజాల చొప్పున).. పలువురు నెల్లూరు, కడప జిల్లావాసుల పేరుతో రిజిస్టర్ చేయించాడు. అప్పట్లో విశాఖను ఏలిన నంబర్ టూ బావమరిది గడికోట ద్వారకానాథ్‌రెడ్డి పేరుతో 10, కడప జిల్లాకు చెందిన కీర్తిరెడ్డి, సంగిరెడ్డి తదితరుల పేర్లతో మరో 12 రిజిస్టర్ చేశాడు. వీరిలో కేఎన్‌ఆర్ బినామీలు, షెల్ కంపెనీలు కూడా ఉన్నట్లు తేల్చే డాక్యుమెంటరీ ఆధారాలను మద్యం కుంభకోణం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించింది.
‘దండా’ ఖాతాల్లోకి కేఎన్‌ఆర్ అక్రమ డబ్బులు
కేఎన్‌ఆర్ తనతో 15 ఏళ్లుగా వ్యాపార వ్యవహారాలు సాగిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన దండా వీరారెడ్డి భార్య దండా బిందుమాధవి పేరుతో ఓ షెల్ కంపెనీ ఏర్పాటు చేశాడు. ఊరూపేరూ లేని వ్యక్తులు, వ్యాపార ఖాతాల నుంచి ఆ కంపెనీలోకి రూ.కోట్లు తరలివచ్చాయి. మరోవైపు.. రమణారెడ్డి సమీప బంధువు విప్పల శంతన్‌రెడ్డి పేరుతో మరో షెల్ కంపెనీ, కేఎన్‌ఆర్ బావమరిది రామ్‌గోపాల్‌రెడ్డి పేరుతో ఆక్స్‌లే అనే పేరుతో మరొకటి సృష్టించి.. విశాఖలో ప్రభుత్వ భూములు ఈ ముగ్గురికి బదిలీ అయ్యేలా పకడ్బందీ పథకం వేశారు.
చెవిరెడ్డి వెంచర్‌లో భూములు కొని..
మద్యం కుంభకోణ కేసులో కీలక నిందితుడైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తిరుపతి సమీపంలో కేవీబీ పురం వద్ద 47 ఎకరాల్లో వెంచర్ వేశారు. అక్కడ ఎకరా ధర కనీసం రూ.2 కోట్లు ఉంటుంది. అయితే కేఎన్‌ఆర్‌లో అందులో 10 ఎకరాలను రూ.81 లక్షలకే తన భార్య శశికళ పేరిట కొనుగోలు చేశాడు. చెవిరెడ్డి ఆర్థిక, భూలావాదేవీలపై దర్యాప్తు చేస్తున్న సిట్‌కు కేఎన్‌ఆర్‌కు దొరికింది ఇక్కడే. ఇంత తక్కువ మొత్తానికి ఎలా కొన్నారని సిట్ నిలదీసింది. ఇందులో మరో కోణం ఏమిటంటే.. ఈ 47 ఎకరాల్లో కొంత హథీరాంజీ మఠం భూమి కూడా ఉంది. దానిని ఆ మఠాధిపతి అర్జున్‌దాస్ చెవిరెడ్డికి విక్రయించినట్లు వెలుగుచూసింది. దాస్ ఈ విక్రయ వ్యవహారంలో అరెస్టు కూడా అయ్యారు.
బెజవాడలో రియల్టర్‌ను బెదిరించి..
రాష్ట్రం నడిబొడ్డున ఉండే విజయవాడ శివారులోని రామవరప్పాడు వద్ద ఓ స్థిరాస్తి వ్యాపారి రైతుల నుంచి ఎకరా రూ.7 కోట్ల చొప్పున కొని వెంచర్ వేశారు. ఆయన తలపై గన్ పెట్టి కేఎన్‌ఆర్ 1.06 ఎకరాలు రాయించుకున్నాడు. ఆ భూమిని తన బినామీ దండా వీరారెడ్డి భార్య బిందుమాధవి నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు పక్కాగా రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత అదే భూమిని స్థిరాస్తి వ్యాపారికి అభివృద్ధికి ఇచ్చి ఇతరులకన్నా ఎక్కువ శాతం గజాల రూపంలో తీసుకున్నారు. ఇది సరిపోదన్నట్లు దండా వీరారెడ్డి కూడా ఆ వ్యాపారిని గన్‌తో బెదిరించి మరో 1100 గజాలు రాయించుకున్నాడు. ఆ వెంచర్లో కేఎన్‌ఆర్ బినామీల పేరుతో ఉన్న మొత్తం 5400 గజాల భూమి విలువ ఇప్పుడు రూ.కోట్లలో ఉంది. కానీ రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు చూపించిన ధర రూ.74 లక్షలు మాత్రమే. ఆ సొమ్ము కూడా చెల్లించినట్లు ఎక్కడా రికార్డుల్లో లేదని సమాచారం.
ప్రభుత్వ విలువ 18 కోట్లు.. కొన్నది 11 కోట్లకు..
జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో రియల్ బూమ్ వచ్చింది. అయినా అక్కడ ప్రభుత్వ విలువ కన్నా తక్కువ ధరకు స్థిరాస్తి దక్కించుకోవడం కేఎన్‌ఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. ప్రభుత్వ భూమిని ఎన్‌సీసీకి విక్రయించేలా చక్రం తిప్పిన నంబర్ టూ బావమరిది గడికోట ద్వారకానాథ్‌రెడ్డి పేరుతో మొత్తం 10 ప్లాట్లు (676 గజాల చొప్పున) విక్రయించారు. వాటి ప్రభుత్వ విలువ రూ.18.51 కోట్లు కాగా.. కొనుగోలు చేసింది మాత్రం రూ.11 కోట్లకే కావడం విశేషం. ఇదే ధరతో మిగతా 12 ప్లాట్లు కేఎన్‌ఆర్ బినామీలకు రిజిస్టర్ అయ్యాయి. వారిలో బావమరిది రామ్‌గోపాల్‌రెడ్డి, దండా బిందుమాధవి ఖాతాల్లోకి కేఎన్‌ఆర్ అక్రమ సొమ్మును మళ్లించి ఆ ఖాతాల నుంచి ఎన్‌సీసీకి ఆస్తి కొనుగోలు కింద బదిలీ చేసి తెల్లడబ్బుగా మార్చేశాడు. ఎన్‌సీసీకి రూ.180 కోట్లకే 97 ఎకరాల భూమిని వైసీపీ ప్రభుత్వం విక్రయించినందుకు ప్రతిఫలంగా ఈ సొమ్ము దక్కినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నిధులు సమకూర్చడానికి రమణారెడ్డి పేరుతో ఏర్పాటుచేసిన మత్సడో, జెయింట్ ఇంజనీరింగ్ సంస్థల్లోకి వెంటనే డబ్బు జమచేయడం కుదరలేదు. తాడేపల్లి ప్యాలె్‌సలో వసూలు చేసిన సొమ్ము, మద్యం ముడుపుల్లో వాటాలు, ఇతరత్రా దందాల రూపంలో వచ్చిన సొమ్ము కేఎన్‌ఆర్‌కు సకాలంలో అందలేదు. దీంతో కంపెనీకి డబ్బులివ్వలేకపోయాడు. ఆ సంస్థ ఈ తలనొప్పి తమకెందుకంటూ ఇతరులకు ఆ భూమి విక్రయించేందుకు లేదా మరో సంస్థతో కలిసి వెంచర్ వేసేందుకు సిద్ధమైంది. దరిమిలా కేఎన్‌ఆర్ హైకోర్టులో రమణారెడ్డితో పిటిషన్ వేయించాడు. స్టే రావడంతో ఎన్‌సీసీ ఉలిక్కిపడింది. కేఎన్‌ఆర్ ఆ కంపెనీ ప్రతినిధులను రాజీకి రప్పించి.. రెండున్నర ఎకరాలు అప్పనంగా తీసేసుకున్నాడు. క్రయ విక్రయాల్లో చూపించేందుకు దండా వీరారెడ్డి భార్య బిందుమాధవి, బావమరిది రామ్‌గోపాల్‌రెడ్డి పేరుతో ఉన్న షెల్ కంపెనీల ఖాతాల నుంచి కొంత సొమ్ము బదిలీ చేశాడు. అంతిమంగా ఎకరా వంద కోట్ల విలువచేసే రెండున్నర ఎకరాల భూమిని (రూ.250 కోట్లు) సొంతం చేసుకున్నాడు.