Share News

ఫ్లాప్‌ షో!

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:32 AM

వైసీపీ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పేరిట హడావుడికి ప్రయత్నించింది. అదృశ్యమైన పడవల వల్ల మత్సకారులలో రేగిన అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పన్నాగం పన్నింది.

ఫ్లాప్‌ షో!

  • బస్సులు పంపినా కడలిపుత్రుల నిరాసక్తత

  • కేవలం ఇద్దరితోనే ముఖాముఖి కార్యక్రమం

  • స్థానిక నాయకులపై జగన్‌ అసంతృప్తి

  • తుస్సుమన్న జగన్‌ మత్య్సకార సభ

కావలి, కావలి రూరల్‌, అల్లూరు, బిట్రగుంట, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పేరిట హడావుడికి ప్రయత్నించింది. అదృశ్యమైన పడవల వల్ల మత్సకారులలో రేగిన అలజడిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పన్నాగం పన్నింది. కానీ.. ఈ రెండు ప్రయత్నాలూ బెడిచికొట్టాయి. జగన్‌ సభ పట్ల మత్స్యకారులు పెద్దగా ఆసక్తి కనపరచకపోవడంతో కార్యక్రమం తుస్సుమంది. మొక్కుబడిగా ఇద్దరు మత్స్యకారులతో మాట్లాడించి జగన్‌ వెనుదిరిగారు. ఆ తర్వాత స్థానిక నాయకులపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సాగర్‌ డిఫెన్స్‌ పరిశ్రమ ఏర్పాటు వల్ల మత్స్యకారులకు హార్బర్‌ దూరమవుతుందంటూ చాలాకాలంగా వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. జగన్‌ను అక్కడికి తీసుకువచ్చి మత్స్యకారులలో చొచ్చుకుపోవాలని పథకం రచించారు. అందులో భాగంగానే బుధవారం జువ్వలదిన్నెలో భారీఎత్తున జగన్‌ సభకు సన్నాహాలు చేశారు. కానీ, సీన్‌ రివర్స్‌ అయ్యింది. జగన్‌ సభకు వచ్చేందుకు మత్స్యకారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మత్స్యకార గ్రామాలు కట్టుబాటుతో ఉన్నందున వారు జగన్‌ సభకు వస్తారా!? రారా!? అనే అనుమానాలు వైసీపీ నేతల్లో రేకెత్తాయి. పైగా అల్లూరు మండలం పట్టపుపాలెం మత్స్యకారులు జగన్‌ సభకు వెళితే లక్ష రూపాయలు జరిమానా అంటూ దురాయి విధించారు.


దీంతో ఇతర సామాజిక వర్గాల కోసం ప్రయత్నించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి జిల్లా నాయకులతో కలిసి జనసమీకరణకు పథకాలు రూపొందించారు. కావలి నియోజకవర్గంతోపాటు సర్వేపల్లి, నెల్లూరు సిటీ, కోవూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టారు. దూరప్రాంతాల నుంచి బస్సులు, హార్బర్‌ సమీప ప్రాంతాల నుంచి ఆటోలు పెట్టి వారికి కొంత నగదుతోపాటు అన్నం, బిర్యానీ ప్యాకెట్లు అందచేసి జనాన్ని తరలించారు. కావలి పట్టణంలోని అన్ని వార్డులలో ఆటోలు పెట్టి జన సమీకరణ చేపట్టినా ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. మత్స్యకార గ్రామాలకూ బస్సులు, ఇతర వాహనాలను పంపినా ఎవరూ పెద్దగా ఎక్కలేదని తెలుస్తోంది.

Updated Date - Apr 16 , 2026 | 04:33 AM