పదే పదే అదే విషం!
ABN , Publish Date - Jan 24 , 2026 | 04:42 AM
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. గత ఏడాది ఆగస్టులో గాలి పోగేసి అబద్ధాలతో అమరావతిపై దాడిచేసిన ఆయన..
అమరావతిపై ఆగని జగన్ అబద్ధాలు
చదరపు అడుగు నిర్మాణానికి రూ.10-13 వేల ఖర్చట!
రాష్ట్రానికి పెనుభారమంటూ గగ్గోలు.. వాస్తవానికి టవర్ల నిర్మాణంలో ఎస్‌ఎఫ్‌టీకి 5 వేలే.. నివాసాల్లో గరిష్ఠంగా రూ.6,884..
ఆయన హయాంలో ‘రుషికొండ’ నిర్మాణంలో చ.అడుగుకు 15,293 ఖర్చు
తప్పుడు లెక్కల విన్యాసాలు.. మాయమాటలతో ప్రజలను నమ్మించే ఎత్తుగడ
అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది.
మునుపటిలాగానే రాజధాని ప్రాంతం కార్మికులు, యంత్రాల సందడితో కళకళలాడుతోంది. దీంతో జగన్ తన పాత శైలిలో అమరావతిపై విషం చిమ్మడం ఆరంభించారు. మాజీ ముఖ్యమంత్రిగా తాను చెప్పిన లెక్కలను ప్రజలు నమ్ముతారని ఆయన భ్రమల్లో ఉన్నారు. గాలి లెక్కలు వేసి అమరావతి నిర్మాణంలో దోపిడీ జరిగిపోతోందని గగ్గోలు మొదలుపెట్టారు. రాజధానిపై నిలువెల్లా విషం నింపుకొని.. అక్కడేవో ఘోరాలు జరిగిపోతున్నాయని చెప్పేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. అందుకే నిజాల గణాంకాలపై అబద్ధాల అంకెలతో దాడి మొదలుపెట్టారు. పదే పదే విషం కక్కితే జనం నమ్మేస్తారనేది ఆయన నమ్మకం.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. గత ఏడాది ఆగస్టులో గాలి పోగేసి అబద్ధాలతో అమరావతిపై దాడిచేసిన ఆయన.. తాజాగా అసత్య గణాంకాలతో విషం చిమ్మాలని చూశారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణాల్లో అవినీతి జరిగిపోతోందని... అడ్డగోలుగా ఖర్చుపెట్టేస్తున్నారని.. ప్రభుత్వంపై పెనుభారం పడుతోందని.. కళ్లముందు అవినీతి జరిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని.. తాను మాట్లాడితే తప్ప ఏదీ బయటకు రావడం లేదని గగ్గోలు పెట్టారు. అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు, అధికారుల నివాస సముదాయాల నిర్మాణం చేస్తున్న సంగతి తెలిసిందే. చదరపు అడుగు నిర్మాణానికి రూ.10 వేల నుంచి 13వేల దాకా ఖర్చుపెడుతున్నారని జగన్ తాజాగా ఆరోపించారు. అయితే ఏ భవనంపైనా అంత ఖర్చు లేనే లేదు. అధికారిక లెక్కల ప్రకారం, సవరించిన ధరల మేరకు చదరపు అడుగు నిర్మాణానికి కనిష్ఠంగా రూ.5 వేలు, గరిష్ఠంగా 6,884 మాత్రమే వ్యయమవుతోంది.
సచివాలయం 1, 2 టవర్లలో నిర్మాణం, వసతులు, ఫర్నిచర్, ఇతర సదుపాయాలతో కలిపి చదరపు అడుగుకు అవుతున్న ఖర్చు గరిష్ఠంగా 5 వేలు. 2014-19 నడుమ ప్రతిపాదించిన నిర్మాణ వ్యయం రూ.3,200గా ఉంటే.. ఇప్పుడు మారిన పరిస్థితులు, పెరిగిన ధరలతో రూ.5 వేలకు చేరింది. అంటే సగటున రూ.1,800 పెరిగింది. ఇందుకు కారణం కూడా జగనే. సీఎంగా ఉన్న ఐదేళ్లలో రాజధాని పనులను ఆపేశారు. అప్పుడు ఈ పనులన్నీ చేసి ఉంటే ఈ పాటికి సచివాలయం బ్లాకుల నిర్మాణం జరిగేది. అదనపు ఖర్చు భారం పడేదికాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారుల నివాసాల కోసం పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు. జగన్ చెబుతున్న వ్యయం ఇక్కడా లేదు. ఇందులో కనిష్ఠంగా చదరపు అడుగుకు రూ.6,884 ఖర్చుచేయనున్నారు. గతంలో దీని అంచనా రూ.4,200. ఇవేవీ కనికట్టు లెక్కలు కావు. రాజధాని నిర్మాణ పనుల అధికారిక గణాంకాలు. మరి జగన్ చెబుతున్న ఖర్చు ఎక్కడ పెడుతున్నారు?
రుషికొండ ప్యాలెస్ ఖర్చు గుర్తుందా..?
ఆయన సీఎంగా ఉండగా విశాఖలోని రుషికొండపై రాజసౌధం నిర్మించుకున్నారు. అక్కడ రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ముందు టూరిజం రిస్టార్ట్ అని చెప్పి, చివరకు దానిని సీఎం క్యాంపు కార్యాలయంగా చేద్దామనుకున్న ఘనత ఆయనదే. రుషికొండ ప్యాలె్‌సను ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించారు. సగటున ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి అయిన ఖర్చు రూ.15,293. ఆ ప్యాలె్‌సలో ఒక బాత్‌రూం ఇంటీరియర్ ఖర్చే రూ.16 లక్షలు. ఇంటీరియర్ టెండర్‌ను ఆయన తన సొంత మనుషులకు, బంధువులకు కట్టబెట్టిన ఉదంతమూ వెలుగులోకి వచ్చింది. అమరావతిలో కూడా అచ్చం ఇలాగే జరుగుతోందని ఆయన భ్రమపడి ఉంటారని అధికార వర్గాలు ఎద్దేవాచేస్తున్నాయి.
ఆ అధికారి మౌనముద్ర..
జగన్ ప్రభుత్వంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణం సమయంలో టూరిజం శాఖలో కీలక పోస్టులో ఉన్న అధికారే ఇప్పుడు సీఆర్‌డీఏలో ఉన్నారు. చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించి ఆ ప్యాలెస్ ఎలా కట్టారు... ప్రజాధనం ఎంతలా దుర్వినియోగం చేశారో ఆ అధికారికి బాగా తెలుసు. ఇప్పుడు సీఆర్‌డీఏలో ఉన్న అదే అధికారి.. అమరావతి నిర్మాణంపై జగన్ చేసిన ఆరోపణలపై పల్లెత్తు మాటనలేరు. ప్రభుత్వానికి నిజాలు చెప్పలేరు. చెబితే గతం బయటకు వస్తుందన్న భయంతోనే ఆ అధికారి మౌనముద్రవహించారా? ఈ పరిణామం కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.