Share News

బాధిత మత్స్యకారులకు రూ.కోటి ఇవ్వాలి

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:54 AM

సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రమాదంనుంచి బయటపడ్డ బోటు యజమాని కారి చిన్నాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు.

బాధిత మత్స్యకారులకు రూ.కోటి ఇవ్వాలి

  • లేదంటే మేమొచ్చిన నెలలోపే అందిస్తాం

  • కళ్లు మూసి తెరిచే లోగానే మూడేళ్లు పూర్తి

  • ఆ తర్వాత వచ్చేది వైసీపీయే విశాఖలో మత్స్యకారులకు జగన్‌ పరామర్శ

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలకు, ప్రమాదంనుంచి బయటపడ్డ బోటు యజమాని కారి చిన్నాకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ డిమాండ్‌ చేశారు. లేదంటే తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపే పరిహారం అందజేస్తామన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలతోపాటు కారి చిన్నాను విశాఖలో జబ్బర్‌తోటలోని వారి ఇళ్లకు వెళ్లి జగన్‌ మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఆరుగురు మృత్స్యకారులు ప్రాణాలతో బయటపడేవారన్నారు. బాధిత కుటుంబాలను సీఎం, డిప్యూటీ సీఎంగానీ, ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనితగానీ ఇంతవరకూ పరామర్శించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. అనిత వీడియోకాల్‌లో బాధితులను పరామర్శించడం ఏమిటన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందినా కలెక్టర్‌ పట్టించుకోలేదని, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే కొంపముంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపుగా త్రిసభ్య కమిటీని వేసిందన్నారు. ఆ కమిటీ అబద్ధాలతో రిపోర్టు తయారుచేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం పరిహారం కింద ముష్టి వేసినట్టు రూ.పది లక్షలు చొప్పున ఇచ్చి దానికి గొప్పగా ప్రచారం చేసుకుంటోందన్నారు. కళ్లు మూసి తెరిచేలోగానే మూడేళ్లు గడిచిపోతాయని, ఆ తర్వాత వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం వైసీపీ తరఫున ఏడు కుటుంబాలకు రూ.ఏడు లక్షలు చొప్పున పరిహారం అందజేస్తున్నట్టు మార్గమధ్యంలో... ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో జగన్‌ ప్రకటన ఇప్పించారు.

Updated Date - Jul 15 , 2026 | 04:55 AM