జాదూ జగన్!
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:19 AM
కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఆయన అలా అనుకున్నా ఎవరికీ ఇబ్బందేమీ లేదు. కానీ, తను చేయని ప్రారంభోత్సవాలను చేసినట్టు..
జువ్వలదిన్నె హార్బర్‌పై పచ్చి అబద్ధాలు
తుస్సుమన్న జగన్ మత్స్యకార సభ
బస్సులు పంపినా కడలిపుత్రుల నిరాసక్తత
(నెల్లూరు - ఆంధ్రజ్యోతి)
కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయని, మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని వైసీపీ అధినేత జగన్ అంటున్నారు. ఆయన అలా అనుకున్నా ఎవరికీ ఇబ్బందేమీ లేదు. కానీ, తను చేయని ప్రారంభోత్సవాలను చేసినట్టు..సాధించని ప్రాజెక్టులను తానే మ్యాప్ గీసి మరీ పట్టుకొచ్చినట్టు అబద్ధాలు చెప్పడం ఏమిటని జనం నిలదీస్తున్నారు. జగన్ బుధవారం నెల్లూరు జిల్లా జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా మత్స్యకారులతో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానికులనే విస్మయానికి గురి చేశాయి. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్‌ను తానే సాధించుకొచ్చానని జగన్ తెలిపారు. అయితే, ప్రాజెక్టు మంజూరయ్యింది టీడీపీ ప్రభుత్వంలోననేది అక్కడి వారికి బాగా తెలుసు. జువ్వలదిన్నెను సాధించడానికి చంద్రబాబు ఆనాడు పెద్ద యజ్ఞమే సాగించారు. మొదట రూ.30 కోట్లతో, ఆ తరువాత రూ.50 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనుకున్నారు. బ్లూ రివల్యూషన్ ప్రోగ్రామ్ కింద దీన్ని మల్టీపర్పస్ హార్బర్ కిందకు మార్చాలని కేంద్రాన్ని కోరారు. అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి సహకారంతో మోదీ సర్కారును నాడు ఒప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.288 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జీవో విడుదల చేశారు. 2019 మార్చి 1న ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. కానీ, ఐదేళ్ల కాలంలో ఒక్క బిల్డింగ్ కూడా పూర్తి కాలేదు.
మిషనరీ రాలేదు. కరెంటు సప్లయ్ లేదు. వాటర్ పైపు లైన్లు లేవు. కానీ, ఆ స్థితిలోనే జువ్వలదిన్నెకు ప్రారంభోత్సవం జరిపించేయాలని సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం భావించింది. ఇంతలో.. కేంద్రం అడ్డుపడింది. 2024 మార్చి 12న షామియానాలు వేసి, టీవీలు ఏర్పాటు చేసి, మత్స్యకారులందరిని పిలిపించి హడావుడి చేశారు. మరో రెండు గంటల్లో జగన్ ప్రారంభిస్తారనగా అనూహ్యంగా ఆ కార్యక్రమం ఆగిపోయింది. అసంపూర్ణంగా ఉన్న హార్బర్‌ను ప్రారంభించడానికి కేంద్రం అంగీకరించలేదు. దీంతో వచ్చినవారంతా తిరిగి వెళ్లిపోయారు. వాస్తవాలు ఇలా ఉండగా, తన హయాంలోనే హార్బర్ పనులు పూర్తి అయ్యాయని, జాతికి తాను అంకితం కూడా చేసేశానని జగన్ చెప్పడం విడ్డూరం. కూటమి హయాంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం 90 శాతం పనులయ్యాయి. తక్కిన పనులు కూడా పూర్తిచేసి హార్బర్‌ను మత్స్యకారులకు స్వాధీనం చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.
మొక్కుబడిగా ముఖాముఖి
మత్స్యకారులను ముందుపెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్ స్కెచ్ వేశారు. కానీ, మత్స్యకార నాయకుల నుంచి ఆశించిన స్పందన (కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం) రాకపోవడంతో ముఖాముఖి కార్యక్రమాన్ని మొక్కుబడిగా ‘మమ’ అనిపించారు. కేవలం ఇద్దరితోనే మాట్లాడించి వెనుదిరిగారు. ఒక మత్స్యకార కాపు నాయకుడు మాట్లాడుతూ... ‘మాకోసం ఇక్కడ హార్బర్ కట్టారు. ఇందులోనే ఒక ప్రైవేటు పరిశ్రమకు 30 ఎకరాలు ఇచ్చేశారు’ అన్నారు. ఆ నాయకున్ని రెచ్చగొట్టేలా జగన్ మాట్లాడినా.. ఆయన మాత్రం.. మా కష్టం సీఎంకు చెప్పండి అంటూ ముగించారు. మరో మత్స్యకార నాయకుడు మాట్లాడుతూ...తమిళనాడుకు చెందిన కడలూరు బోట్లు మా కడుపు కొడుతున్నాయని అనగానే జగన్ ఆయననూ రెచ్చగొట్టేలా ఆవేశంగా మాట్లాడారు. కానీ, ఆ నాయకుడూ ప్రభుత్వంపై పల్లెత్తు విమర్శ చేయలేదు.
సాగర్ డిఫెన్స్‌ను తరిమేస్తాం..
జువ్వలదిన్నె పర్యటనలో జగన్ వ్యాఖ్యలు
బిట్రగుంట, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో ఏర్పాటు చేస్తున్న సాగర్ డిఫెన్స్ కంపెనీని తరిమేస్తామని మాజీ సీఎం జగన్ అన్నారు. బుధవారం నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను జగన్ సందర్శించారు. మత్స్యకారులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ. ‘‘వైసీపీ హయాంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణం పూర్తయింది. 2024 మార్చి 12న సీఎం హోదాలో జాతికి అంకితం చేశాను. ఈ హార్బర్‌ను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు మత్స్యకారులకు స్వాధీనం చేయలేదు?’’ అని జగన్ ప్రశ్నించారు. ‘‘కళ్లు మూసుకుంటే మూడేళ్లు గడిచిపోతాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది వైసీపీనే. అన్ని విధాల మత్స్యకారులను ఆదుకుంటాం’’ అని జగన్ హామీ ఇచ్చారు.