చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి ఎవరొస్తారు?
ABN , Publish Date - Mar 26 , 2026 | 04:06 AM
ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తానే తెచ్చానని, దావో్‌సలో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు కూడా చేశానని మాజీ సీఎం జగన్ అన్నారు.
ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నేనే తెచ్చా : జగన్
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తానే తెచ్చానని, దావో్‌సలో అవగాహనా ఒప్పందాలపై సంతకాలు కూడా చేశానని మాజీ సీఎం జగన్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నక్కపల్లిలో 2,200 ఎకరాల భూమిని కేటాయించానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సుందర ముఖారవిందాన్ని చూసి పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఎవరొస్తారని అన్నారు. తాను తీసుకువచ్చిన స్టీల్ ప్లాంట్‌ను సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కొనసాగించి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. తానేదో ఘనత సాధించినట్లుగా కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చుకున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. గూగుల్‌నూ, అదానీనీ కూడా తీసుకువచ్చింది తానేనని చెప్పారు. 2023లో నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కునూ తీసుకొచ్చానని, అయితే ఈ పార్కుకు అడుగులు ముందుకు పడలేదని, ఎక్కువ భూమి కావాలని దానిని జటిలం చేశారని అన్నారు. రామాయపట్నం పోర్టు 85 శాతం, మూలపేటలో పోర్టు 30శాతం పూర్తి చేశామన్నారు. మచిలీపట్నం పోర్టునూ వైసీపీ హయాంలోనే 30శాతం పూర్తి చేశామన్నారు. ఈ పనులన్నీ పూర్తయితే తనకు పేరు వస్తుందని ఆపేశారని అన్నారు.