Ganta Srinivasa Rao: ఇది జగన్ దిగజారుడుతనం
ABN , Publish Date - Jan 06 , 2026 | 04:47 AM
భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై మాజీ సీఎం జగన్ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడంపై టీడీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు.
చేయని పనులకు క్రెడిట్ తీసుకోవడమా..?: గంటా
ఎయిర్‌పోర్టుకు బీజం వేసింది చంద్రబాబే
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధి పనులపై మాజీ సీఎం జగన్ క్రెడిట్ తీసుకోవాలని ప్రయత్నించడంపై టీడీపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు మండిపడ్డారు. జగన్‌ను ఉత్తరాంధ్ర ద్రోహిగా, అభివృద్ధి కార్యక్రమాల నిరోధకుడిగా అభివర్ణించారు. విశాఖలో విలేకరుల సమావేశంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... ‘‘చేయని పనులు తానే చేశానని చెప్పుకొని క్రెడిట్ కొట్టేయడానికి జగన్మోహన్‌రెడ్డి యత్నించడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనం. భోగాపురం విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల క్రెడిట్ తనదేనంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 2015లో ఫిబ్రవరి 12న విజయనగరం పర్యటనలో సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం ప్రకటన చేశారు. ఆ ఏడాది ఏప్రిల్ నుంచే భూసేకరణ ప్రారంభమైంది. అదే ఏడాది అన్ని అనుమతులూ వచ్చాయి. నాడు విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న నేనే భూసేకరణ పనులు పర్యవేక్షించా. ‘విశాఖ విమానాశ్రయంలో మధ్యాహ్నం వేళ ఈగలు తోలుకుంటున్నారు. భోగాపురంలో మరో విమానాశ్రయం దేనికి?’ అంటూ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రోల్ అవుతున్నాయి. అయినా జగన్మోహన్‌రెడ్డి... కూటమి ప్రభుత్వం చేసిన పనుల క్రెడిట్ తీసుకోవాలని చూడడం సిగ్గుచేటు’’ అని గంటా అన్నారు.
నాడు రైతులను రెచ్చగొట్టింది జగన్ అండ్ కో: మంత్రి కొండపల్లి
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి బీజం వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాడుభూములు ఇచ్చిన రైతులను జగన్ రెచ్చగొట్టి ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరించారని.. ఇవన్నీ నేడు వీడియోల రూపంలో ప్రత్యక్షంగా జనం చూస్తున్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు పాల్గొన్నారు.