AP CM Chandrababu Naidu:‘ రాయలసీమ’పై జగన్‌ది రాద్ధాంతం
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:48 AM
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రాద్ధాంతం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎత్తిపోతలతో లభించేవి 35 టీఎంసీలు
అందులో రాష్ట్రం వాటా 22 టీఎంసీలే
కానీ, సీమ సస్యశ్యామలం అంటూ అబద్ధాలు
జగన్ అక్రమాలపై దర్యాప్తునకే 30 ఏళ్లు: బాబు
పోలవరం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ అధ్యక్షుడు జగన్ రాద్ధాంతం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి పూర్తి చేసిన ఘనత తనదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశాక.. రాయలసీమలో కృష్ణా జలాలను వినియోగించుకుంటామని చెప్పారు. ‘‘రాయలసీమ ఎత్తిపోతలకు 2020 మే 5న జగన్ రూ.3,825 కోట్లతో పాలనామోదం తెలిపారు. దానిపై తెలంగాణ నాయకుడు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు (ఎన్‌జీటీ) వెళ్లగా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టును ముంకొనసాగించవద్దంటూ అదే నెల 20న ’స్టే’ ఇచ్చింది. డీపీఆర్‌ను తయారు చేస్తున్నామంటూ ఎన్‌జీటీకి నివేదించిన జగన్.. ప్రాజెక్టు పనులు కొనసాగిస్తుండటంతో 2020 అక్టోబరు 29న స్టాప్‌వర్క్ ఆర్డర్‌ను ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ తొలిసారి 2.65 కోట్ల మేర అపరాధ రుసుం వేసింది. డీపీఆర్ పేరిట పనులు చేయడంపై 2024 మే 22న రెండోసారి రూ.100కోట్ల అపరాధ రుసుము విధించగా, రూ.25 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది’’ అని చంద్రబాబు వివరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం యావత్తు రాయలసీమకు ప్రయోజనం కలిగిస్తుందంటూ జగన్ చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఈ పథకం వల్ల 35 టీఎంసీలు మాత్రమే వాడుకునేందుకు వీలుంటుందని.. ఇందులో రాష్ట్రవాటా 22 టీఎంసీలేనని వివరించారు. ఈ పథకానికి సమీపంలో మాల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలున్నాయన్నారు. అయితే, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించకుండానే రూ.966 కోట్లు, మరో మూడు ఎత్తిపోతల పథకాలు నిర్మించకుండానే జగన్ ప్రభుత్వం దాదాపు రూ.2500 కోట్లు చెల్లించిందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు నిర్ణయాలపై దర్యాప్తును చేపడితే తుది నివేదిక వచ్చేందుకు 25 నుంచి 30ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. జగన్ నిర్ణయాలపై కేసులు పెట్టాలని కోర్టులే ఆదేశిస్తున్నాయని సీఎం తెలిపారు.