మాయ మాటల జగన్.. పేలని మావి‘గన్’!
ABN , Publish Date - Apr 04 , 2026 | 03:15 AM
‘మావిగన్ మాట అందరినోటా వినిపిస్తోంది’ అన్న జగన్ పత్రిక మాట నిజమే! కానీ... ఈ ఆలోచనను ప్రశంసిస్తూ కాదు! ఇదేమి వింత సలహా అంటూ ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. జగన్ నోట ‘మావిగన్’ అనే పేరు రావడమే ఆలస్యం!
ఆ మాటకు పడీపడీ నవ్వుకుంటున్న జనం
అయినా.. ప్రచారం కోసం జగన్ పాట్లు
‘అదే మాట’ అంటూ సొంత మీడియాలో పాట
అసలు వాస్తవాలకు ముసుగేసి పిచ్చి వాదనలు
భవ్య నగరానికీ, నాలుగు బిల్డింగులకూ తేడా తెలియదా?
110 కిలోమీటర్ల పొడవునా నిర్మాణాలు ఎలా చేస్తారో?
భూసేకరణ, ఇతర ఖర్చులకు డబ్బులు అక్కర్లేదా?
అమరావతి రైతులతో చట్టబద్ధ ఒప్పందాల మాటేమిటి?
విశాఖ పేరుతో ఉత్తరాంధ్రులను మోసగించడమేనా?
రాష్ట్ర విభజన జరిగిన ఇన్నేళ్ల తర్వాత ఇదేం చర్చ?
ఐదేళ్లలో అమరావతిని సర్వ నాశనం చేయలేదా?
ఆయన వల్ల ఆరేళ్ల విలువైన కాలం కరిగి పోలేదా?
సోషల్ మీడియాలో పీక్స్‌కు ట్రోలింగ్
తప్పు చేస్తే దిద్దుకోవాలి!.. అడుసు తొక్కితే, కాలు కడుక్కోవాలి!.. కానీ... తప్పును ‘ఒప్పు’ అని నమ్మించేందుకు నానా తంటాలు పడితే!? బురదను అత్తరుగా చెబుతూ అందరికీ పూసేందుకు ప్రయత్నిస్తే!? ‘జగన్... మావిగన్’ ఆలోచనలాగానే ఉంటుంది. మొదటి రోజునే ఫ్లాప్‌టాక్ వచ్చిన సినిమాకు హడావుడిగా ‘సక్సెస్ మీట్’ ఏర్పాటు చేసినట్లవుతుంది! మచిలీపట్నం - విజయవాడ- గుంటూరు మధ్యలో హైవే వెంబడి రాజధాని ఏర్పాటు చేయాలని, దానికి ‘మావిగన్’ అనే పేరు పెట్టాలని వైఎస్ జగన్ ఇచ్చిన సలహా విని జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇంతగా ‘ట్రోల్’ అయిన సరుకు ఇంకొకటి లేదు. అయినా సరే...
‘ఇది అద్భుతం. అసమాన్యం’ అంటూ సొంత మీడియాలో సొంత జనంతో డప్పు కొట్టించుకుంటున్నారు. ‘అందరి నోటా మావిగన్ మాటే’ అంటూ శుక్రవారం జగన్ పత్రికలో వింత విన్యాసాలు చేశారు. డొల్ల వాదనలు వినిపిస్తూ మళ్లీ మళ్లీ తమ దివాలాకోరుతనాన్ని చాటుకుంటున్నారు.
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
‘మావిగన్ మాట అందరినోటా వినిపిస్తోంది’ అన్న జగన్ పత్రిక మాట నిజమే! కానీ... ఈ ఆలోచనను ప్రశంసిస్తూ కాదు! ఇదేమి వింత సలహా అంటూ ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. జగన్ నోట ‘మావిగన్’ అనే పేరు రావడమే ఆలస్యం! సోషల్ మీడియాకు ఆయన సరుకుగా మారారు. పలు ఊర్లు, ప్రాంతాలు, సినిమా డైలాగులతో ‘సంక్షిప్త’ పదాలను సృష్టించి... ‘మావిగన్’తో ఓ ఆటాడుకుంటున్నారు.
వాటిని చూసీ, వినీ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇలా, ఈ ఒక్క కోణంలోనే అందరినోటా ‘మావిగన్’ మాట వినిపిస్తోంది. పన్నెండేళ్లయినా అమరావతి పూర్తి కాలేదు... అంటూ జగన్ పత్రికలో ఆయన సొంత జనం వాపోయారు. ఈ పన్నెండేళ్ల లెక్క ఎక్కడి నుంచి వచ్చిందో మరి! అమరావతి కోసం భూసమీకరణ మొదలైందే 2015 జనవరిలో. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తయారీ, ఆమోదానికి మరింత సమ యం పట్టింది. 2016 నుంచి అమరావతిలో శరవేగంగా పనులు మొదలయ్యాయి. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి రూ.10 వేల కోట్లకుపైగా విలువైన పనులు జరిగాయి. జగన్ సీఎం కావడం, అమరావతిని అటకెక్కించడం జరిగిపోయింది. 2024లో ఆయన గద్దెదిగేనాటికి అంతా నాశనం. అమరావతి ఒక చిట్టడివిలా తయారైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి... ఆ పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించి, పాత నిర్మాణాల పటిష్ఠతను పరీక్షించాల్సి వచ్చింది. జీఏడీ టవర్లలో నిండిపోయిన నీళ్లను తోడిపోయడానికే ఎన్నో రోజులు పట్టింది. ఇంకా... న్యాయ వివాదాలు తలెత్తకుండా మళ్లీ పనులు మొదలు పెట్టేందుకు చర్చలు, చర్యలు! ఇదంతా పూర్తిచేసేందుకు దాదాపు ఏడాది పట్టింది! ఇదంతా జగన్ నిర్వాకం వల్లే అన్నది సుస్పష్టం! వెరసి... వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న ‘12 ఏళ్ల’లో ఒక సంవత్సరం అమరావతి ముందస్తు కసరత్తుకే పోయింది. అచ్చంగా మరో ఆరేళ్లను జగన్ మింగేశారు. అలా కాకుండా... తన హయాంలోనూ అంతే వేగంతో అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే నగరానికి ఎప్పుడో ఒక రూపం వచ్చి ఉండేది.
ఉత్తరాంధ్రకు ఉత్త చెయ్యేనా?
అసలు విషయం ఏమిటంటే... జగన్‌కు అమరావతి అంటే అక్కసు! దాని ఉనికీ ఊసూ లేకుండా చేయడమే ఆయన ఉద్దేశం. అందుకే, మూడుముక్కలాటకు తెరలేపారు. విశాఖను కార్యనిర్వాహక రాజధాని అంటూ ఉత్తరాంధ్రవాసులను ఊరించారు. ఇప్పుడు... ‘ప్లాన్ బి’ పేరుతో విశాఖను పక్కనపెట్టి ‘మావిగన్’ మాటెత్తుకున్నారు. ‘విశాఖ.. మావిగన్... మీరు ఎంచుకునే రాజధాని ఏది?’ అని సూటిగా అడిగితే ఏమని చెబుతారు? పన్నెండేళ్లు చంద్రబాబు ఏం చేశారంటున్న జగన్... ఐదేళ్లలో తన మూడు రాజధానులను ఎందుకు అమలులోకి తేలేకపోయారు?
రాజధాని రైతుల మాటేమిటి?
రాజధాని రైతుల ప్లాట్లను అభివృద్ధి చేయలేదంటూ జగన్, ఆయన పార్టీ నేతలు ఇప్పుడు వారిపై ఎంతో ప్రేమ ఒలకబోస్తున్నారు. మరి... అధికారంలో ఉన్న ఐదేళ్లు చేసిందేమిటి? మొత్తంగా అమరావతినే ఎత్తి పక్కనపెట్టేశారు కదా? రైతుల ప్రయోజనాలు రాజధానితో ముడిపడి ఉన్నాయని తెలిసీ వారి గొంతు కొయ్యలేదా? అమరావతికోసం ఉద్యమించిన వారి చుట్టూ కేసుల ఉచ్చు బిగించలేదా? ఇప్పుడు ‘మావిగన్’ అంటున్న ఇదే జగన్... రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? వారితో చేసుకున్న చట్టబద్ధమైన ఒప్పందాల నేపథ్యంలో... అమరావతి నుంచి ఒక్క కార్యాలయాన్నీ తరలించలేరని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందాలను ఉల్లంఘిస్తే వారికి చెల్లించాల్సిన పరిహారం ఎంతో అంచనా ఉందా? వారి భూములను యథాతథంగా తిరిగి ఇవ్వడం సాధ్యమా? ఇప్పటికే అమరావతిలో జరిగిన నిర్మాణాలను కూల్చేస్తారా? కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాలకు, విద్యా, వైద్య సంస్థలకు ఇచ్చిన స్థలాలను వెనక్కి తీసుకుని... వాటిని తరిమేస్తారా? దీనిపై జగన్ ఆలోచన ఏమిటి? ‘మావిగన్’ ప్రతిపాదన చేసినప్పుడే దీనిపైనా స్పష్టత ఇవ్వాలి కదా? ఈ సంక్లిష్టతలు, వాస్తవాలు జగన్‌కు తెలియదనుకోవాలా? లేక... ‘మావిగన్’ పేరుతో మరో మాయాజాల, మభ్యపెట్టే ప్రయత్నం చేశారనుకోవాలా?
ఎలా కడతారో!?
అమరావతి ‘సైల్ఫ్ ఫైనాన్స్‌డ్’ ప్రాజెక్టు అని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. అది ఎలా వర్కౌట్ అవుతుందో కూడా వివరించింది. అయినా సరే... ‘రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? అమరావతి పూర్తి కావడం అసాధ్యం!’ అని అపశకునాలు పలుకడం వైసీపీ నేతలకే చెల్లింది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు మ ధ్య 110 కి.మీ. హైవే ఉందని... ‘మావిగన్’ చక్కటి రాజధాని అవుతుందని జగన్ ఉవాచ! సరే! మరి... కార్యాలయాలు, భవనాలను ఎక్కడ కడతారు? గాల్లో కట్టేస్తారా? దానికి భూములు అక్కర్లేదా? భూసేకరణకు, నిర్మాణాలకు ఖర్చు కాదా? హైవే వెంబడి ప్రభుత్వ భూములు ఉన్నా యా? ఈ ప్రశ్నలకు జగన్, ఆయన పార్టీ నేతలు ఏమని బదులిస్తారు?
అసలు ఉద్దేశాన్ని మరిచి...
‘‘హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం బిల్డింగ్‌కు తోడుగా ఆ పక్కనే మరో మూడు నాలుగు భవనాలు కట్టి... ‘సాఫ్ట్‌వేర్ టెక్నలాజికల్ పార్క్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌టీపీఐ)ని పూర్తి చేస్తే సరిపోయేది కదా! ఎక్కడో మాదాపూర్‌లో ‘హైటెక్ సిటీ’ ఎందుకు?’’ అని ప్రశ్నించి ఉన్నా, నాటి పాలకులు జగన్ తరహాలోనే ఆలోచించి ఉన్నా ‘సైబరాబాద్’ అనే నగరం ఏర్పడేది కాదు! ఉన్నతమైన ఆలోచనలు, లక్ష్యాల నుంచి పుట్టుకొచ్చిందే... ‘సైబరాబాద్’. అమరావతి కూడా అలాంటిదే. అక్కడొకటి, ఇక్కడొకటి ఐదారు బిల్డింగులు కట్టి... అద్దె భవనాల్లో సర్దుకుపోయి అదే రాజధాని అంటే సరిపోతుంది. కానీ... చంద్రబాబు ఆలోచనలు వేరు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి అద్భుతమైన నగరాన్ని వదులుకుని రావాల్సి వచ్చింది. ‘ఏదో అలా బతుకుతున్నారు’ అనిపించుకోవడమా? లేక... ఆంధ్రులు సగర్వంగా తలెత్తుకునేలా నవ రాజధానిని నిర్మించుకోవడమా? ఈ ప్రశ్నల నుంచే ‘అమరావతి’ పుట్టుకొచ్చింది. అమరావతి పేరుతో ఒక ప్రపంచ స్థాయి నగరం నిర్మితమవుతోంది. జగన్ మాత్రం నాలుగైదు బిల్డింగులు కట్టుకుంటే చాలు అంటున్నారు. అమరావతిని మొత్తం ఏపీకి ‘గ్రోత్ ఇంజిన్’లా మార్చాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యం. ‘అదేం అక్కర్లేదు’ అనేది జగన్ వాదన. చంద్రబాబు లక్ష్యానికి, జగన్ మాటలకూ తేడా ఇదీ! నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘అమరావతి’కి మద్దతు పలికింది ఆయనే! అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల మాటెత్తింది ఆయనే! ఇప్పుడు మళ్లీ ‘మావిగన్’ అంటున్నదీ ఆయనే! రాష్ట్ర విభజన జరిగిన 12 ఏళ్లకు... ఇప్పుడు ‘రాజధాని’పై ఇలాంటి వాదనలు తెరపైకి తేవడం, దీనిపై చర్చ జరపాల్సి రావడమే దౌర్భాగ్యం కాదా! ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో చట్ట సవరణ చేయాల్సి వచ్చిందంటే... దానికి కారణం జగన్! ‘ఆయన వస్తే ఏం చేస్తారో’ అనే భయం, ఆందోళన!
మూత పడిన నోళ్లు...
రాజ్యసభలోనూ అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే... రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. కూటమి నేతలు ర్యాలీలు జరిపారు. అదే సమయంలో... రెండు రోజులుగా ‘మావిగన్’పై ట్రోలింగ్స్ ఆగడంలేదు. జగన్ చేసిన ప్రతిపాదనను సమర్థిస్తూ ఒక్క కార్యక్రమం జరగలేదు. జగన్ వీరభక్త వైసీసీ నేతలు కూడా ప్రకటనలతో సరిపుచ్చారు. అది కూడా... ‘పార్టీ పెద్దల సూచన’ మేరకే! దీంతో... సొంత మీడియా ద్వారా ‘మావిగన్’కు జేజేలు కొట్టించాలనుకున్నారు. ‘‘ఆయనేదో మాట్లాడుతుంటారు. అవన్నీ సీరియ్‌సగా తీసుకోవద్దు. వాటిపై మమ్ములను స్పందించమని అడగొద్దు. ఇంత జరిగిన తర్వాత మళ్లీ మూడు ప్రాంతాలతో మూడు ముక్కలాట ఆడాలనడం, దానికి మావిగన్ అని పేరు పెట్టడం ఏమిటి?’’ అని వైసీపీ విధేయులే యూట్యూబ్ చానళ్లలో చెబుతున్నారు.
కాపురం కథలు...
‘‘అమరావతికి మేం వ్యతిరేకం కాదు. అందుకే చంద్రబాబుకంటే ముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. మా నాయకుడే ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటున్నారు. ఆయనకే అమరావతిపై అసలైన ప్రేమ’’ అంటూ వైసీపీ నేతలు పస లేని వాదనలు పదేపదే చేస్తున్నారు. అమరావతిపైనా, పైసా తీసుకోకుండా భూములు ఇచ్చిన రైతులపైనా నిజంగా ప్రేమ ఉంటే... మూడు ముక్కలాటకు ఎందుకు తెరలేపినట్లు? ఇప్పుడు ‘మావిగన్’ అని ఎందుకు అంటున్నట్లు? ఇవి పరస్పర విరుద్ధమైన వాదనలు కావా? బుధవారం నుంచి జగన్ మావిగన్ ప్రతిపాదనే విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతోంది. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని, జగన్ ప్రతిపాదనను మరింత ఇరకాటంలోకి నెట్టాయి. ‘మేము అమరావ తికి వ్యతిరేకం కాదు. కేవలం బిల్లును వ్యతిరేకించాం’ అని వైవీ చెప్పారు. అమరావతికి వ్యతిరేకం కాదంటూ... ఆ బిల్లును వ్యతిరేకించడమేమిటని నెటిజన్లు, ప్రజలు గట్టిగా ప్రశ్నించడం ప్రారంభించారు. ‘‘జగన్ చెబుతున్న మావిగన్ ప్రకారం 110 కిలోమీటర్ల కారిడార్‌లో ఏ ఆఫీసును ఎక్కడ ఏర్పాటుచేస్తారు? ప్రజలు తమ సేవల కోసం ఎన్ని ప్రాంతాలకు తిరగాలి? అమరావతికీ, మావిగన్‌కూ మధ్య తేడాను జనం తెలుసుకోలేరనుకుని ఏదో మాట్లాడితే అపహాస్యం పాలవడం ఖాయం’’ అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.