Share News

మారీచుడు, సుబాహుడులా జగన్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు: మంత్రి కొలుసు

ABN , Publish Date - Oct 05 , 2026 | 06:18 AM

: రామాయణంలో విశ్వామిత్రుడు, మునులు లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే మారీచుడు, సుబాహుడు ఎలాగైతే ఆటంకాలు సృష్టించేవారో అలానే కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాజీ సీఎం జగన్‌ ఆటంకాలు కలిగిస్తున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు.

మారీచుడు, సుబాహుడులా జగన్‌   అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆటంకాలు: మంత్రి కొలుసు
jaganmohanreddy

వైసీపీ అవినీతిపై కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌కు ఫిర్యాదు

గుంటూరు, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రామాయణంలో విశ్వామిత్రుడు, మునులు లోక కల్యాణం కోసం యజ్ఞాలు చేస్తుంటే మారీచుడు, సుబాహుడు ఎలాగైతే ఆటంకాలు సృష్టించేవారో అలానే కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మాజీ సీఎం జగన్‌ ఆటంకాలు కలిగిస్తున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై ఆదివారం తెనాలిలోని బుర్రిపాలెంలో కేంద్ర మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. పేదలందరికి ఇళ్ల పథకం కోసం రూ.20 లక్షల విలువ చేసే భూమిని రూ.కోటికి ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయించిన జగన్‌ తన పార్టీ నేతలకు ఆయాచితంగా లబ్ధి చేకూర్చారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు జరిపి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. పేదలకు మంజూరు చేసిన ఇళ్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఈ ఒక్క ఇళ్ల నిర్మాణాల్లోనే రూ.2 వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది రావడం లేదని, కేవలం ఒక్క రోజు వచ్చారని, అది కూడా అరగంట మాత్రమే ఉండి.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేసి బయటకు వెళ్లిపోయారన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడని వారు రేపు ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రశ్నించారు. పేదలకు అనేక పథకాల ద్వారా మంచి చేస్తోన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 05 , 2026 | 06:29 AM