ఆక్వా సభా? అరాచక ప్రదర్శనా?
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:12 AM
ఆక్వా రైతులతో సమీక్ష అంటూ వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సభ ఆసాంతం అరాచక ప్రదర్శనలాగే సాగింది. రైతుల సమస్యలు వినిపించాల్సిన చోట రప్పా.. రప్పా.. అరుపులు..
రైతు సమస్యలు వినిపించాల్సిన చోట ‘రప్పా.. రప్పా..’ అరుపులు, కేకలు
‘రాజారెడ్డి రాజ్యాంగం’ అంటూ ప్లకార్డులతో విపరీత పోకడలు
జగన్ సభ వద్దకు వస్తుండగా వీరంగం.. సైలెన్సర్లు తీసిన బైకులతో ఫీట్లు
ట్రాఫిక్ స్తంభన.. తిట్టుకున్న స్థానికులు.. సభలోనూ ‘అతి’.. పడబోయిన జగన్
భీమవరం సభలో రైతులతో మాటల్లేవ్.. అంతా ఊకదంపుడే
భీమవరం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతులతో సమీక్ష అంటూ వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన సభ ఆసాంతం అరాచక ప్రదర్శనలాగే సాగింది. రైతుల సమస్యలు వినిపించాల్సిన చోట రప్పా.. రప్పా.. అరుపులు.. ‘విధ్వంసం కోసం ఎదురుచూస్తున్నా’మంటూ వింత పోకడలతో వేసే కేకలు మారు మోగాయి. సభకు వచ్చిన వారిలో ఆక్వా రైతుల కంటే పార్టీ కార్యకర్తలే ఎక్కువగా కనిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లూథరన్ మైదానం హెలిప్యాడ్‌లో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో దిగిన జగన్ కిలోమీటరు దూరంలో ఉన్న సభావేదిక వద్దకు రోడ్డు షోగా వచ్చారు. ర్యాలీలో కొందరు యువకులు రచ్చ రచ్చ చేశారు. బైక్‌ల సైలెన్సర్లు తీసి పెద్ద శబ్దాలతో నడిపారు. వీరి హడావుడితో భీమవరం ప్రధాన రహదారిపై గంటపాటు ట్రాఫిక్ స్తంభించింది. ఆస్పత్రికి వెళ్లే రోగులు, ప్రయాణాలు చేసే వారు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు. ఇక సభా వేదిక వద్ద యువకులు జగన్ వద్దకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ముందు వరుసల్లో కూర్చున జనం చెల్లాచెదురై బయటకు వచ్చేశారు. యువతులు బారికేడ్లు దాటి బయటకు పరుగులు తీశారు. రైతుల నుంచి సమస్యలు ఆలకించేందుకు జగన్ ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అక్కడ రైతులు కానరాలేదు. పార్టీ క్యాడర్, జగన్ అభిమానులే ఉన్నారు. భీమవరం పరిసర ప్రాంతాల నుంచి ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇచ్చి తరలించారు. కార్యకర్తలు సభా వేదిక వద్ద, రహదారులపై ప్లకార్డులతో రచ్చచేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ అంటే రాజారెడ్డి రాజ్యాంగం’, ‘ఇక 2.0...ఊచకోతే’, ‘2027-29లో మీ విధ్వంసం కోసమే మేం ఎదురుచూస్తున్నాం జగన్’, ‘2029లో మీకుంది రప్పా రప్పా’ అంటూ కొంత మంది యువకులు ఫ్లకార్డులతో రెచ్చిపోయారు. హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు ఫొటోలను కొంతమంది ప్రదర్శించారు. జగన్ తిరుగు ప్రయాణంలోనూ కార్యకర్తలు అతిగా ప్రవర్తించి తోపులాట జరగడంతో ఒక కార్యకర్తకు కాలు విరిగింది. ఆయనను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
తూలి పడబోయిన జగన్
జగన్ సభకు వచ్చే సమయంలో గ్యాలరీలో తోపులాట జరగటంతో మీడియా ప్రతినిధులు భయపడి బారికేడ్లను దాటి వేదిక వద్దకు వెళ్లిపోయారు. అక్కడే ఉన్న మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పడిపోబోయిన ఓ మహిళను మహిళా కానిస్టేబుల్ పట్టుకుని.. మంచి నీరు ఇచ్చి బయటకు తీసుకువచ్చారు. వేదిక పైనుంచి పలువురు నాయకులు సహకరించాలని, వెనక్కి జరగాలని కోరినా ఫలితం కనిపించలేదు. జగన్ వేదికపై నుంచి మాట్లాడుతున్న సమయంలో కుడి వైపున ఉన్న బాక్సులపై కుర్రకారు ఎక్కడంతో అవి పడిపోయాయి. అక్కడే ఉన్న లైట్లు ప్రజలపై పడటంతో గందరగోళం ఏర్పడింది. సభా ప్రాంగణంలో మంచినీరు దొరక్క, వచ్చిన వారు ఉక్కపోతకు అల్లాడిపోయారు. జగన్ మాట్లాడుతున్న సమయంలో పలువురు యువకులు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేయగా... ఆయన చిరునవ్వు నవ్వారు. ప్రసంగం పూర్తయ్యాక వేదిక నుంచి జగన్ దిగుతుండగా క్యాడర్ వెనుక నుంచి ఒక్క ఉదుటున ముందుకు వెళ్లారు. సెక్యూరిటీ అదుపు తప్పింది. భద్రతా సిబ్బందిలో ఒకరు వేదికపై పడిపోయారు. జగన్ ముందుకు తూలారు. సెక్యూరిటీ, నాయకులు అడ్డుకోకపోతే కింద పడిపోయేవారు. దీనిపై జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కన్నెర్ర చేశారు. జనాలను తరలించడంపై దృష్టి పెట్టిన నాయకులు, సభావేదిక వద్ద ఏర్పాట్లలో మాత్రం విఫలమయ్యారు.