‘ఆక్వా’పై అవాకులు
ABN , Publish Date - Jul 16 , 2026 | 04:16 AM
ఆక్వా రంగంపై మాజీ సీఎం జగన్ అన్నీ అబద్ధాలే మాట్లాడారు. ఆత్మస్తుతితో ఆగకుండా.. అడ్డగోలుగా పర నిందకూ పాల్పడ్డారు. అప్సడా చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేశామని..
రాయితీ ఇవ్వకుండా నాడు ట్రాన్స్‌ఫార్మర్ల ధరలు పెంచేసింది జగన్
ఆదుకోవడం లేదంటూ కూటమిపై విమర్శలు
యూనిట్ 1.50 పైసలకే విద్యుత్ ఇస్తున్నా.. ఇవ్వడం లేదంటూ వేదిక నుంచి అవాకులు
జగన్ హయాంలో ఆక్వా వర్సిటీ విద్యార్థులకు నరకం
ఆ నెపం కూటమిపై వేసిన వైసీపీ అధినేత
ఆత్మస్తుతి.. పరనిందలా సాగిన ప్రసంగం
భీమవరం, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఆక్వా రంగంపై మాజీ సీఎం జగన్ అన్నీ అబద్ధాలే మాట్లాడారు. ఆత్మస్తుతితో ఆగకుండా.. అడ్డగోలుగా పర నిందకూ పాల్పడ్డారు. అప్సడా చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేశామని, సీడ్, ఫీడ్ ధరలను నియంత్రించామని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులందరికీ రూ.1.50కు యూనిట్ విద్యుత్ ఇవ్వడం లేదన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌లను రాయితీ మీద ఇస్తామన్న చంద్రబాబు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే రాయితీ లేకుండా ట్రాన్స్‌ఫార్మర్ ధరలను అమాంతంగా పెంచేసింది గతంలో జగన్ ప్రభుత్వమే. ఇలా తాము చేసిన తప్పులను విస్మరించి, ఆక్వా రంగానికి ఎంతో చేశామంటూ గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా కూటమిపై బురదజల్లే ప్రయత్నం చేశారు. నర్సాపురంలో ఆక్వా విశ్వవిద్యాలయాన్ని తాము ఏర్పాటు చేస్తే, మూతవేసే దశకు తీసుకొచ్చిందని ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కారు. వాస్తవానికి వైసీపీ హయాంలోనే విద్యార్థులు నరకం చూశారు. నాడు తుపాన్ భవనంలో తరగతులు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఆ విద్యార్థులకు స్వర్ణాంధ్ర కళాశాలలో తరగతులు ఏర్పాటు చేసింది. వర్సిటీ నిర్మాణానికి ఈ ఏడాది రూ.30 కోట్లు కేటాయించారు. మొత్తంగా జిల్లా నేతలు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జగన్ ఉపన్యాసం సాగింది. ఆయన ప్రసంగం కంటే క్యాడర్ కేరింతలు, కేకలే సభలో ఎక్కువగా వినిపించాయి.