Share News

మావిగన్‌.. మా అజెండా

ABN , Publish Date - Jul 02 , 2026 | 03:48 AM

2029లో మావిగన్‌ అజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతా. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. మావిగన్‌ను సమర్థించేవారంతా వైసీపీకి ఓటేస్తారు..

మావిగన్‌.. మా అజెండా

  • 2029 ఎన్నికల్లో ఇదే మా నినాదం

  • మ్యానిఫెస్టోలో రాజధానిగా చేరుస్తాం

  • సమర్థించేవారంతా వైసీపీకి ఓటేస్తారు

  • అమరావతిని బలపరిచేవారు టీడీపీకి వేస్తారు

  • సానుకూల మీడియాతో జగన్‌

  • ‘హేరామ్‌ సేవ్‌ ఏపీ’ అంటూ కొత్త నినాదం

  • విశాఖపై ప్రశ్నకు జవాబు దాటవేత

అమరావతి, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ‘2029లో మావిగన్‌ అజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతా. ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ రాజధానిగా మావిగన్‌ను చేరుస్తాం. మావిగన్‌ను సమర్థించేవారంతా వైసీపీకి ఓటేస్తారు. అమరావతిని బలపరిచేవారంతా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. చూద్దాం ఏమవుతుందో? మా నిర్ణయంలో మార్పేమీ లేదు’ అని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ప్రకటించారు. బుధవారం సానుకూల మీడియా ప్రతినిధులతో జగన్‌ మాట్లాడారు. రైతుల కోరిక మేరకు ఉండవల్లిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, నాయకులపై పోలీసుల సమక్షంలోనే చంద్రబాబు ప్రోద్బలంతో రాళ్లదాడి చేశారని ఆరోపించారు. బాధితులైన వైసీపీ నేతలపైనే తిరిగి కేసులు పెట్టారని విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకే తమ పార్టీ నేతలపై చంద్రబాబు దాడికి ఉసిగొల్పారని విమర్శించారు. రిటైర్డ్‌ జడ్జీలను, న్యాయవాదులను, మేధావులను పరిశీలనకు పంపుతానని, ఆ తర్వాతే తాను అమరావతిలో పర్యటించడంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. గతంలో పరిపాలనా రాజధానిగా పేర్కొన్న విశాఖ సంగతేంటని ఓ జర్నలిస్టు అడగగా... ఆయన స్పందించలేదు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా నడవడం లేదని, రూల్‌ ఆఫ్‌ ఫియర్‌ నడుస్తోందని అన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యం నడుస్తోందని, పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ‘హేరామ్‌ సేవ్‌ ఏపీ’ అంటూ జగన్‌ కొత్త స్లోగన్‌ ఎత్తుకున్నారు. సాయికృష్ణను పోలీసులు లాక్‌పడెత్‌ చేశారని, పోలీసుల వేధింపుల వల్ల క్రాంతికుమార్‌ వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళం సంతకవిటీ కళావతి కేసులు రాష్ట్రంలో దిగజారిపోయిన చట్టం, పోలీసు వ్యవస్థకు అద్దం పడుతున్నాయన్నారు. కృష్ణలంక సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని చంద్రబాబు కాపాడుతున్నారని ఆరోపించారు. కృష్ణలంక సీఐని ప్రభుత్వ పెద్దలు చంపేస్తారంటూ సందేహాన్ని వ్యక్తం చేశారు. బిహార్‌ రాష్ట్రాన్ని ఇప్పటిదాకా జంగిల్‌రాజ్‌ అని అనుకునేవారమని, వాస్తవానికి రాష్ట్రంలోనే ఆటవిక రాజ్యం నడుస్తోందని అన్నారు. కులాలు, మతాల మధ్య చంద్రబాబు విద్వేషాలు రగిలిస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలను తాను ఆధారాలతో సహా నిరూపించానన్న జగన్‌.. మంత్రి లోకేశ్‌ వాటిని తప్పని నిరూపించగలరా అని ప్రశ్నించారు.

Updated Date - Jul 02 , 2026 | 05:07 AM