Share News

మా హయాంలో గొప్పగా లడ్డూ!

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:41 AM

చంద్రబాబు సీఎం కాకముందు తిరుమల లడ్డూను భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారని మాజీ సీఎం జగన్‌ అన్నారు.

మా హయాంలో గొప్పగా లడ్డూ!

  • భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారు

  • ప్రసాదం ప్రతిష్ఠ బాబు దిగజార్చారు : జగన్‌

విజయవాడ, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు సీఎం కాకముందు తిరుమల లడ్డూను భక్తులు కళ్లకు అద్దుకుని తినేవారని మాజీ సీఎం జగన్‌ అన్నారు. లడ్డూప్రసాదం ప్రతిష్ఠను చంద్రబాబు ప్రభుత్వం దిగజార్చిందని ఆరోపించారు. విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్‌ కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. తిరుమల నెయ్యిలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేని సిట్‌ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసిందని జగన్‌ అన్నారు. ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఏ తప్పు చేయలేదని నిర్ధారించిందని తెలిపారు. తప్పు చేస్తున్నదల్లా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌లేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేసిన తప్పులను సీబీఐ ఏకంగా చార్జిషీటులో ప్రస్తావించిందని ఆరోపించారు. చంద్రబాబు వేంకటేశ్వరస్వామి వద్ద లెంపలు వేసుకుని, ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఈ పనిచేయని చంద్రబాబుకు మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. ‘‘వైవీ, భూమన ప్రమేయం లేదని సీబీఐ స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా కల్తీ నెయ్యి అంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయడం ధర్మమేనా? ఆ ఫ్లెక్సీలపై ముద్రించిన అసత్యాలపై ప్రశ్నించినందుకు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌ ఇళ్లపై దాడులు చేయించారు. ఇది హత్యాయత్నం కాకపోతే ఇంకేమిటి?’’ అని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగిల్‌ రాజ్‌లో ఉన్నామా అన్నది అర్థం కావడం లేదన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 06:43 AM