Share News

‘కల్తీ’ మాటలు ఎవరివి జగన్‌?

ABN , Publish Date - Feb 07 , 2026 | 06:29 AM

తిరుమలకు సరఫరా చేసిన నె య్యిలో జంతువులు, పంది మాంసం నుంచి తీసిన కొవ్వు కలిపారని చెప్పింది ఎవరండీ? సీబీఐ చెప్పిందా? ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందా?

‘కల్తీ’ మాటలు ఎవరివి జగన్‌?

  • చంద్రబాబు, ‘ఆంధ్రజ్యోతి’లదే పాపమంటూఇబ్రహీంపట్నంలో జగన్‌ దుష్ప్రచారం

  • ఏ నివేదికా ‘కొవ్వు’ను నిర్ధారించలేదట!

  • పందికొవ్వు కలిసిందని ‘ఎన్‌డీడీబీ’ స్పష్టీకరణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘‘తిరుమలకు సరఫరా చేసిన నె య్యిలో జంతువులు, పంది మాంసం నుంచి తీసిన కొవ్వు కలిపారని చెప్పింది ఎవరండీ? సీబీఐ చెప్పిందా? ఎన్‌డీడీబీ రిపోర్టు చెప్పిందా? ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టు చెప్పిందా? ఏ ల్యాబ్‌ రిపోర్టు చెప్పింది? ఈ మాటలు చెప్పిందెవరంటే చంద్రబాబు, ఆయనకు ఢంకా బజాయిస్తున్న ఆంధ్రజ్యోతి. లేని అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. ఒక అబద్ధాన్ని తప్పుడు ప్రచారం చే శారు’’.. ఇదీ వైసీపీ అధినేత జగన్‌ తీరు. వైసీపీ నేత జోగి రమేశ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన శుక్రవారం ఇబ్రహీంపట్నంలో మాట్లాడారు. తిరుమలకు సరఫరా చేసిన నె య్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఏ ల్యాబ్‌ చెప్పకపోయినా ‘ఆంధ్రజ్యోతి’ తప్పుడు ప్రచారం చేస్తోందని జగన్‌ నిరాధారణ ఆరోపణలు చేశారు. తిరుమల నెయ్యికల్తీ అంశంపై ఏకధాటిగా అబద్ధాలు, అసత్యాలు వల్లించారు. తను పచ్చి అబద్ధం చెప్పినా అది నిజమే అని జనం నమ్ముతారన్న భ్రమలో జగన్‌ ఉన్నట్లు ఆయన మాటలే చెబుతున్నాయి. వాస్తవాలను వక్రీకరించి, అబద్ధాలను పోగేసి మాట్లాడి అవే నిజలుగా జనం నమ్మాలని తాపత్రయపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో పందికొవ్వు కలిసిందని నేషనల్‌ డెయిరీ డెవల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) ‘కాఫ్‌’ నివేదిక చెప్పింది. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే, ఆ సంస్థ ఇలాంటి నివేదికే ఇవ్వలేదని వైసీపీ నేత చాలా సులువుగా అబద్ధాలు మాట్లాడేశారు. కానీ, ఆయన బాబాయి, నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఢిల్లీలో మాట్లాడుతూ, ఎన్‌డీడీబీ నివేదికను నిర్ధారించారు. నెయ్యిలో పందికొవ్వు కలిసిందని ఎన్‌డీడీబీ కేవలం అనుమానం మాత్రమే వ్యక్తం చేసిందని ఆయన తెలిపారు. ఇలాంటి నిజాలను గుర్తించలేక జగన్‌ చాలా సులువుగా ‘ఆంధ్రజ్యోతి’పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు.


ఎన్‌డీడీబీ నివేదిక ఇదిగో...

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలనుకుంది. ఆ నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీలకు టెండర్‌ వైసీపీ ప్రభుత్వంలో కట్టబెట్టారు. నిబంధనలను సడలించిన తర్వాతే ఆ కంపెనీలు టెండర్‌ దక్కించుకున్నాయి. కాబట్టి, ఆ కంపెనీలు కేజీకి 20 రూపాయల చొప్పున నష్టపోతూ, టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో అసలు నెయ్యే లేదన్న ఫిర్యాదులు రావడంతో 2024 జూలై 9న నేషనల్‌ డెయిరీ డె వల్‌పమెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ-కాఫ్‌) ల్యాబ్‌లో పరీక్షించాలని, రెండు శాంపిల్స్‌ పంపించారు. ఆ తర్వాత జూలై 17న మరో రెండు శాంపిల్స్‌ పరీక్ష కోసం పంపించారు. ఇలా రెండు దఫాలుగా పంపించిన నాలుగు శాంపిల్స్‌లో పందికొవ్వు మాంసం నుంచి తీసిన కొవ్వు ఉన్నట్లు ల్యాబ్‌ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని ఎన్‌డీడీబీ తన రెండు రిపోర్టుల్లోనూ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే సీఎం చంద్రబాబు స్పందిస్తూ, నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నివేదిక ఆధారంగానే కల్తీ నెయ్యిపై పోలీసు కేసు తొలుత నమోదైంది. అసలు కేసుకు మూలాధారమే ఈ నివేదిక. తొలుత నాటి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ నివేదిక గురించి మాట్లాడేందుకు వెనుకంజ వేశారు. ఎప్పుడయితే ఈ నివేదికను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చిందే తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీ వేదికగా మాట్లాడారు. జగన్‌కు ఈ విషయం తెలియదనుకోవాలా?


అబద్ధాలకు రెక్కలు..

నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ‘ఎన్‌డీఆర్‌ఐ’ చెప్పిందా? అని జగన్‌ మరో ప్రశ్న వేస్తున్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? చేపనూనె కలిసిందా? లేదా అని నిర్ధారించే సాంకేతికత, సామర్థ్యం తనకు లేదని ఎన్‌డీఆర్‌ఐ... సీబీఐ కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. సిట్‌ ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌ల్లో నెయ్యిని పరీక్షించిందని, అందులో జంతువుల కొవ్వు లేదని తేలిందని జగన్‌ మరో అబద్ధం చెప్పారు. వైసీపీ హయాంలో వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉండగానే, 2022 ఆగస్టులో తిరుమల నెయ్యిని మైసూరులోని సీఎ్‌ఫటీఆర్‌లో పరీక్షించారు. తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఆ సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ విషయం గురించి జగన్‌ మాట్లాడరు. ఎందుకంటే, నాడు కల్తీ ఉన్నట్లు తేలినా, చర్యలు ఎందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది మరి.

Updated Date - Feb 07 , 2026 | 06:31 AM