తప్పులన్నీ చంద్రబాబు చేసి మాపై నిందలు
ABN , Publish Date - Mar 12 , 2026 | 03:31 AM
తప్పులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని, ఆ నిందలను తమపై మోపుతారని.. ఆయన కుట్రలు చేస్తారని, ఆ తప్పులన్నీ తనపై నెడతారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు....
ఒక్క ఎన్నికల హామీ కూడా నెరవేర్చలేదు
మా పథకాలన్నీ రద్దు చేశారు: జగన్
అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): తప్పులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తారని, ఆ నిందలను తమపై మోపుతారని.. ఆయన కుట్రలు చేస్తారని, ఆ తప్పులన్నీ తనపై నెడతారని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఏ సినిమాలోనూ ఆయన లాంటి విలన్ కనిపించరని అన్నారు. బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో తాను ఎంపిక చేసుకున్న మీడియా ప్రతినిధుల సమక్షంలో దాదాపు 2.20గంటల పాటు ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదని అన్నారు. తాము అందించిన సంక్షేమ పథకాలన్నీ రద్దు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. న్యాయం కోసం వస్తే, బాధిత మహిళలపైనే ఎదురు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడే తిరుమలకు కల్తీ నెయ్యి చేరిందని, ఆ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారని ఆరోపించారు. ఆయనకు దేవుడంటే భయమూ, భక్తీ లేవని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ఆర్థిక, సంక్షేమ, అభివృద్ధి అంశాలపై తాను లేవనెత్తిన ప్రశ్నలకు సీఎం నుంచి సమాధానం రాలేదని అన్నారు. ఒకవైపు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతూనే, మరోవైపు గొప్ప పాలకుడిగా చంద్రబాబు బిల్డప్ ఇస్తారని వ్యాఖ్యానించారు. ఇసుక, మైనింగ్, భూము లు, మట్టి, లిక్కర్ మాఫియా చేస్తుంటే.. రాష్ట్రానికి రాబడి ఎలా వస్తుందని ప్రశ్నించారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ 1100 మంది అనే లెవల్‌లో భయపెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అంటున్నారంటే మంచిదేగా.. తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుకు క్రెడిట్ ఇచ్చినట్లే కదా అన్నారు. శాసనసభలో ఆర్థికశాఖ అప్పుల విషయంలో తప్పుడు లెక్కలు చూపినందుకు తాను డీవోపీటీకి, సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మీడియా ప్రతినిధులెవరూ ప్రశ్నించకుండా.. తన ప్రసంగం పూర్తయిన వెంటనే ‘ఇక చాలు’ అన్నట్లుగా జగన్ లేచి నిలబడ్డారు. షర్టుకు ఉన్న మైక్‌ను తీసేశారు. ఈ సమయంలో మీడియా ప్రతినిధి.. చంద్రబాబు కేంద్రానికి వెళ్తారని, డిప్యూటీ పీఎం అవుతారంటూ కథనాలు వస్తున్నాయంటూ ప్రస్తావించారు. ‘ఎవరు? చంద్రబాబు కేంద్రానికి వెళతారా? ఉప ప్రధాని అవుతారా? చంద్రబాబును సీఎంగానే రాష్ట్ర ప్రజలు భరించలేకపోతున్నారు. దేశప్రజలు ఉప ప్రధానిగా ఎలా భరిస్తారు’ అని జగన్ అన్నారు.