Share News

పెట్టుబడిదారులను భయపెడుతున్న జగన్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:51 AM

రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో విధ్వంస పాలన చేసిన జగన్‌.. ఇప్పుడు పెట్టుబడిదారులను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.

పెట్టుబడిదారులను భయపెడుతున్న జగన్‌

  • భారీగా పెట్టుబడులు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు

  • కడుపు మంటతో ఓర్వలేక నీచ రాజకీయాలు

  • గొడ్డలి పార్టీగా పేరు మార్చుకోవాలి: మంత్రులు

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో విధ్వంస పాలన చేసిన జగన్‌.. ఇప్పుడు పెట్టుబడిదారులను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే.. కడుపు మంటతో ఓర్వలేక జగన్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఇద్దరు మంత్రులు మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు, లోకేశ్‌ కృషితో భారీగా పెట్టుబడులు రావడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ఉనికిని చాటుకోవటానికే జువ్వలదిన్నెలో అవాస్తవాలు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమలను వెళ్లగొట్టి, ఇప్పుడు పారిశ్రామికవేత్తలపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. మూడేళ్లలో అధికారంలోకి వస్తాం. పెట్టుబడులు పెట్టే వారిని అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారు. జగన్‌కు మత్స్యకారుల ప్రయోజనాలు పట్టలేదు. గత ప్రభుత్వంలో ఒక్క ఫిషింగ్‌ హార్బర్‌ పూర్తి చేయలేదు. గతంలో టీడీపీ ప్రభుత్వం అనుమతించిన ఫిషింగ్‌ హార్బర్లకు కేంద్రం వాటా నిధులను కూడా వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. రాష్ట్ర వాటా చెల్లించకుండానే రెండేళ్ల క్రితమే జువ్వలదిన్నె పూర్తయిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. గతంలోనే జువ్వలదిన్నె హార్బర్‌ను జాతికి అంకితం చేసి ఉంటే.. అక్కడ కార్యకలాపాలు ఏవీ? పోర్టు పనులు చేపట్టిన సంస్థలను బెదిరించి, బినామీల పేరుతో వాటాలు రాయించుకున్న చరిత్ర జగన్‌ది.


కనీసం భూసేకరణ కూడా చేయకుండా వివాదాస్పద భూముల్లో పనులు చేపట్టడం వల్ల కూటమి ప్రభుత్వం వాటిని సరిదిద్దాల్సి వచ్చింది. ఇప్పుడు ఫిషింగ్‌ హార్బర్లను ప్రైవేట్‌ పరం చేస్తున్నామంటూ జగన్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మత్స్యకారులను రెచ్చగొట్టి, గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ... గొడ్డలి పార్టీ అని పేరు మార్చుకోవాలి’ అని జనార్దన్‌రెడ్డి సూచించారు. ‘114 ఎకరాల జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో కేవలం 7 ఎకరాలే సాగర్‌ డిఫెన్స్‌ ఇంజనీరింగ్‌ కంపెనీకి కేటాయించాం. 40ఏళ్ల అవసరాల దృష్ట్యా 900 మీటర్లున్న జెట్టీలో 150 మీటర్లు మాత్రమే ఉపయోగిస్తుంటే.. వాస్తవాలు తెలుసుకోకుండా జగన్‌ మత్స్యకారులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు’ అని మంత్రి మండిపడ్డారు. మత్స్యకారుల గురించి జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి రవీంద్ర విమర్శించారు. తీరప్రాంత రక్షణలో కీలకమైన సాగర్‌డిఫెన్స్‌ సంస్థ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే..తరిమేస్తామని జగన్‌ హెచ్చరించడం ఏమిటని మండిపడ్డారు.

Updated Date - Apr 17 , 2026 | 03:52 AM