తిరుపతమ్మ రంగుల ఉత్సవానికి వేళాయె
ABN , Publish Date - Jan 05 , 2026 | 01:21 AM
శ్రీతిరుపతమ్మ రంగుల ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను సోమవారం ఉదయం 6.11 గంటలకు బయటకు తీసేందుకు ఆలయ అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. అక్కడి నుంచి రజకులు విగ్రహాలను తలపై పెట్టుకొని గ్రామంలోని రంగుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. రాత్రికి ఎంపిక చేసిన ఎడ్లబండ్లపై విగ్రహాలను ఉంచి వేడుకగా జగ్గయ్యపేటకు తీసుకువెళ్లనున్నారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర బాబు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్త్ కల్పిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీశ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
-నేడు ఆలయం నుంచి బయలుదేరనున్న విగ్రహాలు
-జగ్గయ్యపేట వరకు భారీ బందోబస్తు ఏర్పాటు
- ఏర్పాట్లు సమీక్షించిన కలెక్టర్, సీపీ
పెనుగంచిప్రోలు రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి):
శ్రీతిరుపతమ్మ రంగుల ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను సోమవారం ఉదయం 6.11 గంటలకు బయటకు తీసేందుకు ఆలయ అర్చకులు ముహూర్తం నిర్ణయించారు. అక్కడి నుంచి రజకులు విగ్రహాలను తలపై పెట్టుకొని గ్రామంలోని రంగుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. రాత్రికి ఎంపిక చేసిన ఎడ్లబండ్లపై విగ్రహాలను ఉంచి వేడుకగా జగ్గయ్యపేటకు తీసుకువెళ్లనున్నారు. ఎన్టీఆర్ జిల్లా సీపీ రాజశేఖర బాబు పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్త్ కల్పిస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీశ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
150 మందితో భారీ భద్రత
ఆలయంలోని 11 విగ్రహాలు జగ్గయ్యపేటకు తరలించే క్రమంలో ఎటువంటి ఆవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గత ఏడాది పసుపు, కుంకుమ బండ్ల ఉత్సవంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు ఈ సారి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆఽధ్వర్యంలో నందిగామ ఏసీపీ తిలక్ పలుమార్లు దేవదాయశాఖ అధికారులతో చర్చించి సమన్వయంతో ముందుకు వెళ్లనున్నారు. నలుగురు సీఐలు, 10 మంది ఎస్సైలు, 150 మంది పోలీస్ సిబ్బందితో విగ్రహాలకు భద్రత కల్పిస్తున్నారు. వీరు కాకుండా రెండు స్పెషల్ పార్టీలు బందోబస్త్‌కు రానున్నట్లు అధికారులు తెలిపారు. విగ్రహాలు తీసుకువెళ్లే 11 ఎడ్ల బండ్లకు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమిస్తున్నారు. రాజకీయ పార్టీల జెండాలు, పాటలు లేకుండా ప్రతి బండికి ఇరువైపులా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం నుంచి బయలు దేరే విగ్రహాలకు రోప్ పార్టీలతో మూడంచల బందోబస్త్ సిద్ధం చేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి మక్కపేట వరకు ఆర్‌ఆండ్‌బీ రోడ్డులో ఇరువైపులా అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు నరికించి, మార్జిన్లలో ఉన్న కంపను తొలగించారు. పలుచోట్ల గుంతలకు దేవస్థానం అధికారులు మరమ్మతులు చేయించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు
విగ్రహాలు జగ్గయ్యపేటకు తీసుకుపోయే వేడుకలో భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు తన సొంత నిధులు రూ.5.50 లక్షల వ్యయంతో కోలాటాలు, తీన్మార్ బ్యాండ్లు, డప్పు కళాకారులు, కేరళా బ్యాండ్, పలు రకాల వేషగాళ్లు, కొమ్ములు, సన్నాయి, డీజేలు ఏర్పాటు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు ప్రకటించారు.