Share News

అంతా మిస్టరీ.

ABN , Publish Date - Sep 11 , 2026 | 11:23 PM

తల్లి అదృశ్యమై నెల రోజుల చిన్నారి ముళ్లపొదల్లో లభ్యమైన ఘటన అంతా మిస్టరీగా మారింది.

   అంతా మిస్టరీ.
ముళ్ల పొదల్లో నెల రోజుల చిన్నారిని పడేసిన దృశ్యం

ఐదు రోజుల క్రితం తల్లి అదృశ్యం..

గాయాలతో బెంగుళూరు ఆస్పత్రిలో ఆమె చికిత్స

అయ్యలూరులో ముళ్లపొదల్లో లభ్యమైన చిన్నారి

నంద్యాల క్రైం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తల్లి అదృశ్యమై నెల రోజుల చిన్నారి ముళ్లపొదల్లో లభ్యమైన ఘటన అంతా మిస్టరీగా మారింది. నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట ప్రాంతంలో నెల రోజుల చిన్నారి గురువారం ముళ్లపొదల్లో లభ్యమైంది. మరోవైపు చిన్నారి తల్లి స్పందన బెంగుళూరు ఎలహంకలోని విక్టోరియా ఆస్పత్రిలో గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం వారికి అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

ఐదు రోజుల క్రితం..

గోస్పాడు మండలం జిల్లెల్లకి చెందిన వ్యవసాయ కూలీ శివనాగరాజుకు కామినేనిపల్లెకు చెందిన స్పందనతో రెండేళ్ల క్రితం వివాహమైంది. నెల రోజుల క్రితం స్పందన నంద్యాల జీజీహెచలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం భార్యాభర్తలు చిన్నారితో కలిసి జిల్లెల్లకు వచ్చారు. ఐదు రోజుల క్రితం శివనాగరాజు తన భార్య స్పందన, నెల రోజుల కుమార్తెను బైక్‌పై తీసుకొని నంద్యాలకు బయల్దేరాడు. అయ్యలూరు మెట్ట ప్రాంతానికి చేరుకున్న సమయంలో తనకు వాంతులు వస్తున్నాయని స్పందన భర్తకు చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో శివనాగరాజు స్పందనను ఆటోలో నంద్యాలకు పంపించినట్లు సమాచారం. ఆమె నంద్యాలకు చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన భర్త గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో నంద్యాల రూరల్‌ పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేశాడు.

అపస్మారక స్థితిలో..

స్పందన బెంగుళూరులోని ఎలహంకలో ఉన్న విక్టోరియా ఆస్పత్రిలో గాయాలతో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పోలీసుల ద్వారా నంద్యాల తాలుకా పోలీసులకు సమాచారం అందింది. కుటుంబ సభ్యులు బెంగుళూరుకు వెళ్లి ఆమెను గుర్తించనట్లు తెలిసింది. అయితే ఆమె అపస్మారక స్థితిలో ఉండడంతో ఏం జరిగిందనే విషయం తెలియని పరిస్థితి.

జీజీహెచలో చిన్నారి

మరోవైపు అయ్యలూరు మెట్ట సమీపంలోని ముళ్లపొదల్లో నెల రోజుల చిన్నారి కనిపించడంతో స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పసికందును సురక్షితంగా బయటకు తీసి నంద్యాల జీజిహెచకు తరలించారు. ప్రస్తుతం చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రెండు ఘటనలకు సంబంధం ఉందా?

చిన్నారి తల్లి స్పందన బెంగుళూరుకు ఎలా చేరుకుంది? ఆమెకు గాయాలు ఎలా అయ్యాయి? నెల రోజుల పసికందు అయ్యలూరు ముళ్లపొదల్లోకి ఎలా వచ్చింది? తల్లిని ఎవరు అక్కడి నుంచి తీసుకెళ్లారు? తల్లి, చిన్నారి వేర్వేరు ప్రాంతాల్లో ఎలా కనిపించారు అనే ప్రశ్నలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి. ఒక సంఘటన మరో సంఘటనకు సంబంధం ఉందా లేదా మధ్యలో మరేదైనా జరిగిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనల మధ్య ఉన్న కాల వ్యవధి, ప్రయాణ మార్గాలు, సీసీ కెమెరా దృశ్యాలు, తదితర అంశాలను పరిశీలించే అవకాశం ఉంది.

పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు..

ప్రస్తుతం స్పందన అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె నుంచి వివరాలు సేకరించలేని పరిస్థితి. ఆమె స్పృహలోకి వచ్చి జరిగిన విషయాన్ని చెబితేనే ఈ మిస్టరీకి తెరపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తమకు కూడా అర్ధం కావడం లేదని స్పందన బంధువు లక్ష్మీదేవి తెలిపారు. పోలీసుల దర్యాప్తులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

Updated Date - Sep 11 , 2026 | 11:23 PM