Share News

ఐటీడీఏ ఏపీవోగా లెక్చరర్‌!

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:54 AM

గిరిజన సంక్షేమ శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక డిగ్రీ కళాశాల అధ్యాపకుడిని ఐటీడీఏ ఏపీవోగా నియమించడం కలకలం రేపింది. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ కాగా..

ఐటీడీఏ ఏపీవోగా లెక్చరర్‌!

  • గిరిజన సంక్షేమ శాఖలో అడ్డగోలు వ్యవహారం

  • 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులు రద్దు

విశాఖపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒక డిగ్రీ కళాశాల అధ్యాపకుడిని ఐటీడీఏ ఏపీవోగా నియమించడం కలకలం రేపింది. శుక్రవారం ఈమేరకు ఉత్తర్వులు జారీ కాగా.. నిబంధనలకు విరుద్ధమని తెలియడంతో 24 గంటల్లోనే ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పి.చలపతిరావును డిప్యుటేషన్‌పై పాడేరు ఐటీడీఏ ఏపీవోగా నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ సదా భార్గవి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఐటీడీఏల్లో మేనేజర్లు, పరిపాలనాధికారులుగా పనిచేస్తున్న వారినే పదోన్నతిపై ఏపీవోలుగా నియమిస్తారు. అటువంటిది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్‌ను ఏపీవోగా నియమించడం చర్చనీయాంశమైంది. ఇది సరికాదని, నిబంధనలకు విరుద్ధమని గిరిజన సంక్షేమ శాఖకు చెందిన కొందరు సీనియర్‌ అధికారులు విషయాన్ని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం.ఎం.నాయక్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సూచన మేరకు శనివారం ఆ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే ఈ నియామకం.. గిరిజన సంక్షేమ శాఖ పాలనావ్యవహారాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టిందని విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jul 05 , 2026 | 05:55 AM