మీకు ఇంత నగదు ఎక్కడిది?
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:09 AM
పాస్టర్ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీసుల ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
పాస్టర్‌ను ప్రశ్నించిన ఐటీ అధికారులు.. సొమ్ముకు ఆధారాలున్నాయన్న కుమార్తె
నరసాపురం, ఏప్రిల్ 17(ఆంద్రజ్యోతి): పాస్టర్ నివాసంలో నోట్ల కట్టల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీసుల ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. శుక్రవారం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన ఇద్దరు అధికారులు పాస్టర్ గంటా జాన్ బాబూరావు ఇంటికి వెళ్లి 2గంటల పాటు విచారించారు. ‘మీ వద్ద పట్టుబడిన రూ.2.27 కోట్ల నగదు ఎక్కడి నుంచి, ఎలా వచ్చింది? దీనికి సంబంధించిన ఆధారాలు చూపించండి’ అని కోరారు. అనంతరం బాబూరావు కుమార్తె జ్యోత్స్నతో ఫోన్‌లో మాట్లాడారు. ‘ఆ సొమ్ము మా కష్టార్జితం. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. రెండు రోజుల్లో మీ కార్యాలయానికి వచ్చి అందజేస్తాను. అనారోగ్యంతో మంచంపై ఉన్న అన్నయ్యకు సహాయకుడిగా మా నాన్నను ఉంచండి’ అని ఆమె కోరారు. దీంతో అధికారులు ఆమె తల్లి ఝాన్సీరాణి, భర్త శ్యాంసన్‌కు నోటీసులు ఇచ్చి,వారిద్దరినీ రాజమహేంద్రవరం ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కాగా, బాబూరావు చిన్న కుమారుడు జోయల్ పౌల్ ఆన్‌లైన్‌లో చెస్ కోచింగ్ ఇస్తుంటారు. ఈ కోచింగ్ ద్వారానే వీరు పెద్దమొత్తంలో సంపాదించారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పోలీసులు, ఐటీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. విదేశాల్లో ఉన్న వీరిద్దరూ వస్తే గానీ ఈ వ్యవహారం తేలేట్లు కనిపించడం లేదు.