Share News

సీమపై ప్రేమ నిజమేనా?

ABN , Publish Date - Jan 07 , 2026 | 11:18 PM

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తలెత్తిన చిచ్చుతో వైసీపీ చలిమంట కాచుకునే ప్రయత్నం చేస్తోంది.

   సీమపై ప్రేమ నిజమేనా?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌తో నిండి ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్‌ ప్రదేశం

రాయలసీమ ప్రాజెక్టుకు ముగింపు పలికింది వైఎస్‌ జగనే

స్టే తొలగించేందుకు నాడు ఆసక్తి చూపని వైసీపీ ప్రభుత్వం

రాజకీయ లబ్ధి కోసం నేడు ధర్నాలు

నందికొట్కూరు జనవరి 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తలెత్తిన చిచ్చుతో వైసీపీ చలిమంట కాచుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ అది కొరివితో తలను గోక్కోవడమని వైసీపీ నాయకులకు తెలియడం లేదు. వారి హయాంలోనే ప్రారంభించి, కేంద్రం మొట్టికాయలతో నిలిపేసిన రాయలసీమ ప్రాజెక్టును ఆ తర్వాత మూడున్నరేళ్లు అధికారంలో ఉన్నా వైసీపీ స్టే ఎందుకు తొలగించుకోలేకపోయిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. నేడు తెలంగాణ అసెంబ్లీలో రాయలసీమ ప్రాజక్టును అడ్డుకున్నది తామేనని అధికార, ప్రతిపక్ష పార్టీలు వాదించుకుంటున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశలో వైసీపీ నాయకులు ఉలిక్కి పడి రాయలసీమ ప్రాజెక్టు కోసం ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమపై తమకు ప్రేమ ఉందని చాటుకోడానికి నిజాయితీ లేని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై వైసీపీ నేడు మొసలి కన్నీరు కారుస్తోంది. 2020 మే 5వ తేదీన జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సీమకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.3,378 కోట్లతో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే శ్రీశైలం జలాశయం ఎగువన 800 అడుగుల నీటి మట్టం ఉండగా సంగమేశ్వరం వద్ద ఉన్న అప్రోచ కాలువ ద్వారా రోజుకు ఒక టీఎంసీ చొప్పున నీటిని ఎత్తిపోస్తామని నాడు చెప్పారు. పోతులపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సమీపాన్నే ఈ పథకాన్ని నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి సంగమేశ్వరం వరకు 23 కిలోమీటర్ల మేర సంగమేశ్వరం వరకు శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో అప్రోచ కాలువను తవ్వి తద్వారా నీటిని పోతిరెడ్డిపాడు ప్రధాన కాలువలోకి విడుదల చేసే సమగ్ర నివేదిక (డీపీఆర్‌) చేయకుండానే పనులు ప్రారంభించారు. కేంద్ర జలశక్తి, పర్యావరణ- అటవీశాఖలు, అపెక్స్‌ కౌన్సిల్‌, కృష్ణానది యాజమాన్య బోర్డు నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే ఈ ప్రాజెక్టు వైసీపీ హయాంలో జగన్మోహనరెడ్డి పనులు ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్‌ జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎనజీటీ)ను ఆశ్రయించారు. డీపీఆర్‌, పర్యావరణ అనుమతుల్లేకుండా ఏకంగా పనులే ప్రారంభించారని ఫిర్యాదు చేశారు. పనులేమీ చేపట్టడం లేదని కేవలం డీపీఆర్‌ తయారీకే తవ్వకాలు చేస్తున్నామని జగన ప్రభుత్వం నాడు పేర్కొంది. అయితే ఎనజీటీ ఆ పథకంపై స్టే విధించింది. ఈ ఎత్తిపోతలకు కేంద్ర పర్యావరణ- అటవీశాఖ నుంచి పర్యావరణ అనుమతులు తప్పని సరని, అవి వచ్చాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని 2020 అక్టోబరు 29న స్పష్టం చేసింది. 2021 ఆగస్టు 11న కృష్ణాబోర్డు కమిటీ సభ్యులు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు పరిశీలించారు. ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయాలని ఆ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెలువడ్డాక జగన్మోహనరెడ్డి దాదాపు మూడేళ్లు అధికారంలో కొనసాగారు. కానీ ఎనజీటీ స్టే ఉత్తర్వులను ఎత్తివేయించేందుకు మొక్కుబడి ప్రయత్నాలతో సరిపెట్టుకున్నారు. దీన్ని బట్టే జగన్మోహనరెడ్డికి రాయలసీమపై ఏ మేరకు చిత్తశుద్ధి ఉన్నదీ ఇట్టే అర్థమౌతోంది. రాయలసీమ ప్రజలపై ప్రేమకంటే... రాయలసీమ పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టుపై వచ్చే కమీషన్లపైనే ఆయన ప్రేమ ఎక్కువ అనే ఆరోపణలు నాడు వినిపించాయి. చేపట్టిన అరకొర పనులు కూడా గుత్తేదారు గోప్యంగా చేయడం వెనుక ఆంతర్యం ఇట్టే అర్థమౌతోంది.

ఫ రాయలసీమ ప్రాజెక్టుకు ఆది.. అంతం జగనే..!

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞం పేరుతో పలు ప్రాజెక్టులను ప్రారంభించి ఒక ధన యజ్ఞంలా మార్చేశారు. అదే పంథాలో జగన్మోహనరెడ్డి తన అనాలోచిత విధానాలతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తూతూ మంత్రంగా ప్రారంభించిన తొలి దశలో 2020 అక్టోబరులోనే అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందాకే ప్రాజెక్టు పనులు చేపట్టాలని కేంద్రం నుంచి సుస్పష్టమైన ఆదేశాలు అందాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతుల్లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎనజీటీ ఆదేశించింది. వీటిపై నాడు ట్రిబ్యునల్‌కు జగన ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఫ సొంత జిల్లాపైనే చిత్త శుద్ధిలేని ఘనుడు:

జగన్మోహనరెడ్డి సొంత జిల్లాకే తాగు, సారునీరు తీసుకెళ్లలేకపోయాడనే విమర్శలు ఉన్నాయి. కడప జిల్లాకు సాగునీరు అందించే అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బండ్‌ కుంగి పోతే గత వైసీపీ ఐదేళ్ల పాలనలో పట్టించుకున్న పాపాన పోలేదు. 2021లో అధికారులు రూ.3.12 కోట్లతో ప్రతిపాదనలు పంపంచారు. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్‌ కేవలం రూ.57 లక్షల మేర పనులు చేసి చేతులెత్తేశారు. నిపుణుల కమిటీ పరిశీలించి రిజర్వాయర్‌ మొత్తం మీద అర కిలోమీటరు మేర బండ్‌ కుంగిపోయిందని ఈ మొత్తాన్ని మరమ్మతు చేసేందుకు నిపుణుల కమిటీ తీర్మానించింది. ఈ మేరకు బండ్‌ మొదట కుంగిన చోటే కాకుండా, మిగతా చోట్ల కూడా కుంగిందని, బండ్‌ మొత్తాన్ని ఆధునికీకరించాల్సిందేని అధికారులు రూ.22 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. పెరిగిన అంచనా వ్యయాలకు అనుగుణంగా రూ.26.33 కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. రూ. మూడు కోట్లతో పూర్తి కావాల్సిన పనులు వైసీపీ నిర్లక్ష్యం కారణంగా నాడు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.51 కోట్లు అయితే అందులో సగం మరమ్మతులకు నేడు కేటాయిస్తున్నారు. ఇది సాగునీటి ప్రాజెక్టులపై గత వైసీపీ ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

Updated Date - Jan 07 , 2026 | 11:18 PM