Rajamahendravaram: ముంబై నుంచి ప్రత్యేక టీమ్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:18 AM
ఇరుసుమండ బ్లోఔట్‌ను నియంత్రిచడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీకి చెందిన పలు టీమ్‌లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా..
బ్లో ఔట్ నియంత్రణకు సమయం పట్టొచ్చు
డీప్ ఇండస్ర్టీస్ సామర్థ్యంపై అనుమానాలు
(రాజమమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
ఇరుసుమండ బ్లోఔట్‌ను నియంత్రిచడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఎన్జీసీకి చెందిన పలు టీమ్‌లు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నా.. సోమవారం రాత్రికి కూడా అవి నియంత్రణలోకి రాలేదు. ఇరుసుమండ బావి మోరీ జీసీఎస్ పరిధిలోని 5వ నంబర్ బావి. ఇది వర్కు ఓవర్ బావి. అంటే ఇప్పటికే ఇక్కడ చమురు, సహజవాయును డ్రిల్లింగ్ చేసి వాటి ఉనికిని కూడా కనుగొన్నారు. ఇక్కడ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కోసం డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సోమవారం ప్రాథమిక పని మొదలు పెట్టింది. ఆ సమయంలోనే గ్యాస్ లీకై మంటలు ఎగసిపడ్డాయి. వాస్తవానికి డ్రిల్లింగ్ పూర్తయిన తర్వాత బావిలోని పైపుల నుంచి గ్యాస్ లీకవ్వడకుండా ఐదు, ఆరు వాల్వులతో కూడిన బ్లోఔట్ ప్రివెంటర్ (బీవోపీ)లను అమర్చుతారు. ప్రతీ బోరులోనూ డ్రిల్లింగ్ పూర్తి చేసి, రిగ్‌ను తొలగించిన తర్వాత బీవోపీని అమర్చుతారు. మళ్లీ ఆ బావి నుంచి గ్యాస్, చమురును వెలికితీసే సమయంలో బీవోపీని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఇక్కడ అధికంగా ఉన్న గ్యాస్, చమురును వెలికి తీసే పని మొదలు పెట్టడంతో అధిక పీడనంతో గ్యాస్ లీక్ అయినట్టు చెబుతున్నారు. ఇది బీవోపీ కింద భూ మిలో నాలుగైదు అడుగుల్లోనే జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే నిజమైతే బ్లో ఔట్‌ను త్వరలోనే నియంత్రించవచ్చు. లీకేజీ బాగా లోతు నుంచి ఉంటే మరికొంత సమయం పట్టవచ్చు. ప్రస్తుతం ఓఎన్జీసీకి చెందిన సంక్షోభ నియంత్రణ బృందాలు(సీఎంటీ), ఆర్‌సీఎంటీ కు చెందిన వారు నియంత్రణ పనులు మొదలు పెట్టారు.
ఓఎన్జీసీ డ్రిల్లింగ్.. డీప్ ఇండస్ర్టీస్ ఉత్పత్తి..
కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్‌లో మొదట ఓఎన్జీసీ మాత్రమే చమురు, సహజవాయులను వెలికి తీసింది. తర్వాత కెయిర్న్, రిలయన్స్ వంటి సంస్థలు వచ్చేశాయి. కొద్దినెలల క్రితం జాయింట్ వెంచర్ పేరిట ఓఎన్జీసీ మోరి జీసీఎస్ పరిధిలోని పలుబావులను డీప్ ఇండస్ర్టీస్ సంస్థకు అప్పగించింది. వాస్తవానికి మోరి జీసీఎ్‌సలో మోరి, కేశనపల్లి, కేశవదాసుపాలెం ప్రాంతాల్లో సుమారు 50 బావుల వరకూ ఉంటాయి. వాస్తవానికి ప్రస్తుతం బ్లోఔట్ జరిగిన ఇరుసుమండ బా విని డ్రిల్లింగ్ చేసింది ఓఎన్జీసీనే. చాలా కా లం క్రితమే ఇక్కడ డ్రిల్లింగ్ చేసి సహజవాయువులు, చమురు ఉన్నట్టు గుర్తించి.. దాని కి బీవోపీని అమర్చి పెట్టింది. సోమవారం డీపీ ఇండస్ర్టీస్ లిమిటెడ్ ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టగా.. బ్లోఔట్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఓఎన్జీసీలో అంతా రహస్యమే!
ఇటీవల ఓఎన్జీసీ సమాచారాన్ని దాచేస్తుంది. గతంలో ఎక్కడ డ్రిల్లింగ్ చేసినా, అన్వేషణ చేసినా, ఏ బావిలో ఎంత చమురు ఉందో, ఎంత గ్యాస్ ఉందో కూడా వివరించేది. ఇటీవల ఎన్ని బావులు ఉన్నాయనేది కూడా చెప్పడం లేదు. ఇరుసుమండ బ్లోఔట్ విషయంలో ఓఎన్జీసీకి చెందిన కొంతమంది ప్రమాదానికి డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్‌దే బాధ్యత అని చెప్పారు. కానీ, చివరకు ఓఎన్జీసీకి చెందిన బృందాలు రంగంలోకి దిగాయి.