Share News

సాగునీరా..? తాగునీరా..?

ABN , Publish Date - Aug 21 , 2026 | 11:34 PM

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు సాగునీరు ఇస్తారా..? హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసి చెరువులు నింపుతారా..?

   సాగునీరా..? తాగునీరా..?
తుంగభద్ర డ్యాంలో చేరిన వరద జలాలు

తుంగభద్ర జలాల విడుదలపై ఎటూ తేల్చని పాలకులు

హంద్రీ నీవా ద్వారా చెరువులు నింపేందుకు నిర్ణయం తీసుకుంటారా..?

గుండ్రేవులపై తీర్మానం చేసి హైపవర్‌ కమిటీకి పంపాలి

నేడు జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం

కర్నూలు, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆయకట్టుకు సాగునీరు ఇస్తారా..? హంద్రీ నీవా కాలువ నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసి చెరువులు నింపుతారా..? లద్దగిరి, కృష్ణగిరి తూముల ద్వారా హంద్రీ నదికి నీటి విడుదల చేసి నదితీర గ్రామాలకు జీవం పోస్తారా..? అనే ప్రశ్నలు జిల్లా రైతాంగాన్ని వేధిస్తున్నాయి. వీటిపై ఎమ్మెల్యేలు, అధికార యంత్రాగం నేడు జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో తీసుకునే కీలక నిర్ణయాలపై ఆధారపడి ఉంది. తుంగభద్ర డ్యాంలో 94.743 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఆశాజనకంగా వరద వచ్చి చేరుతుంది. హంద్రీ నీవా కాలువ ద్వారా మూడు వేల క్యూసెక్కులకు పైగా కృష్ణా జలాలు సరిహద్దులు దాటిపోతున్నాయి. ఎననినో ప్రభావం వల్ల భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతాయనే భయం ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. ఆ సాకుతో సాగునీరు ఇవ్వకుండా ఎగనామం పెడుతారా..? నేటి ఐఏబీ సమావేశంలో తేలవలసి ఉంది. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

జిల్లా పశ్చిమ ప్రాంతం జీవనాడి తుంగభద్ర జలాశయం. టీబీపీ ఎల్లెల్సీ కాలువ ద్వారా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటితో పాటుగా ఖరీఫ్‌, రబీలో ఖరీఫ్‌, రబీలో 1,51,134 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి. ఖరీఫ్‌లో 43,519 ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే రైతులు సాగునీరు వస్తాయనే ఆశతో వరినాట్లు వేసుకుంటున్నారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా డ్యాంకు ఆలస్యంగా వరద మొదలైంది. 2026-27 నీటి సంవత్సరంలో 98 టీఎంసీలకు మించి చేరే అవకాశం లేదని టీబీపీ వాటర్‌ రివ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంది. తాజాగా 105 టీఎంసీలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాకు టీబీపీ ఎల్లెల్సీ వాటాగా కేడబ్ల్యూడీటీ-1 కేటాయింపు దమాషా ప్రకారం 11.896 టీఎంసీలు కేటాయించే అవకాశం ఉంది. ఇప్పటికే తాగునీటి కోసం 1.43 టీఎంసీలు వాడుకోగా, డ్యాంలో మిగులు వాటా 10.466 టీఎంసీలు ఉంది. అందులో నవంబరు ఆఖరు వరకు సాగు, తాగునీటి కోసం 6 టీఎంసీలు ఇవ్వాలని ఆయకట్టు రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం ఎటు తేల్చలేని పరిస్థితిలో ఉంది. అయితే.. తక్షణమే ఇండెంట్‌ ఇచ్చి ఆయకట్టు రైతులకు భరోసా ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

ఫ అధికారులను వెంటాడుతున్న భయం:

తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం 94.743 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పటికే కర్ణాటక దాదాపుగా 7.50 టీఎంసీలు, ఏపీ టీబీపీ ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ద్వారా సుమారుగా 2.50 టీఎంసీలు వరకు వినియోగించుకున్నారు. అంటే.. ఈ ఏడాది ఇప్పటి వరకు 105 టీఎంసీలు చేరినట్లే లెక్క. తాజాగా సరాసరి 11,000-12,000 క్యూసెక్కులు ఇనఫ్లో కొనసాగుతుంది. ఈ ఇనఫ్లో ఇలాగే ఉంటే మరో పది టీఎంసీలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం 90 రోజులు సాగు నీరు ఇస్తామని ప్రకటించడంతో కర్ణాటక పరిధిలో జోరుగా వరినాట్లు వేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం టీబీపీ ఎల్లెల్సీ ఇండెంట్‌ 650 క్యూసెక్కులు విడుదల చేస్తుంది. ఏపీ కూడా కర్నూలు జిల్లా సాగు, తాగునీటి అవసరాల కోసం 650 క్యూసెక్కులు ఇండెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంటే.. డ్యాం నుంచి ఏపీ, కర్ణాటక ఇండెంట్‌ కలిపి 1,300 క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే.. వాస్తవంగా కాలువను 1,800 క్యూసెక్కులకు డిజైన చేశారు. అందులోనూ ఖరీఫ్‌లో 40 శాతం వర్షాధారం, 60 శాతం కాలువ ద్వారా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేలా డిజైన చేశారు. అయితే.. కేవలం 1,300 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తే, కర్ణాటకలోని హోస్పెట్‌ నుంచి 250.588 కిలోమీటర్లు ప్రవహించి జిల్లాలోని ఆదోని మండలం హాలవాలు దగ్గర టీబీపీ బోర్డు సరిహద్దు వద్ద 650 క్యూసెక్కులు ఇండెంట్‌ ఇవ్వడం సాధ్యమా..? టీబీపీ బోర్డు, జిల్లా జలవనరుల శాఖ ఇంజనీర్లనే వేధిస్తున్న ప్రశ్న. గత అనుభవాలను పరిశీలిస్తే.. కర్ణాటక రైతుల జల చౌర్యం వల్ల తుంగభద్ర బోర్డు సరిహద్దు వద్ద 250-300 క్యూసెక్కులకు మించి నీటి ప్రవాహం ఇవ్వలేని పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో సాగునీటిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలుస్తుంది.

ఫ చెరువు నింపుతారా.. నీళ్లను వదిలేస్తారా..?:

శ్రీశైలం ఎగువన మాల్యాల లిఫ్ట్‌ నుంచి హంద్రీనీవా కాలువకు తొమ్మిది పంపుల ద్వారా 3,050 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ద్వారా 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీరు అందించడం, కరువు పల్లెలను సస్యశ్యామలం చేయడం ప్రధాన లక్ష్యం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 8 టీఎంసీలు వినియోగించుకొని 80 వేల ఎకరాలకు సాగునీరు, ఆయా గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని ఆశయం. అంటే లిఫ్ట్‌ చేసే నీటిలో 20 శాతం మేరకు జిల్లాలో వాడుకోవాల్సి ఉంది. ప్రస్తుతం 3,050 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు. అందులో దాదాపు 650 క్యూసెక్కులు జిల్లాలో వాడుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు నామమాత్రమే. ఎత్తిపోసిన నీటిని ఎత్తిపోసినట్లుగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. అనంతపురం జిల్లాలో జీడిపల్లి రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండి కడతూము పొంగిపొర్లుతుంది. జిల్లాలో మాత్రం ఒక్క చెరువుకు కూడా చుక్కనీరు ఇవ్వడం లేదు. జిల్లాలో 74 చెరువుల్లో 1.238 టీఎంసీలు నింపేందుకు రోజుకు 150 క్యూసెక్కులు ఎత్తిపోయాలని, లద్దగిరి, కృష్ణగిరి తూముల ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేసి హంద్రీ నదితీర గ్రామాలకు జీవం పోయాలని, కృష్ణగిరి, పత్తికొండ జలాశయాలతో పాటు గాజులదిన్నె జలాశయాలను నింపాలని పలువురు కోరుతున్నారు.

ఫ గుండ్రేవులపై తీర్మానం చేయాలి:

తుంగభద్ర నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో సుంకేసుల బ్యారేజీ ఎగువన గుండ్రేవుల జలాశయం నిర్మించాలనే డిమాండ్‌ రైతుల్లో సెంటిమెంట్‌గా మారింది. ఈ జలాశయం ఆవశ్యకతపై నేటి ఐఏబీ సమావేశంలో చర్చించి, నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలి. ఆ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం, తుంగభద్ర జలాలు వినియోగంపై ఏర్పాటు చేసిన హైపవర్‌ కమిటీకి పంపించేలా ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఫ నేడు ఐఏబీ సమావేశం:

జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నేటి ఉదయం 11 గంటలకు నిర్వహించేలా జలవనరుల శాఖ ఇంజనీర్లు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి అందుబాటులో లేకపోవడంతో జాయింట్‌ కలెక్టర్‌ నూరల్‌ ఖమర్‌ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన, టీబీపీ ఎల్లెల్సీ ప్రాజెక్టు కమిటీ చైర్మన సహా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. టీబీపీ ఎల్లెల్సీ నీటి వినయోగం, హంద్రీ నీవా కాలువ ద్వారా చెరువులు నింపడంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు గాజులదిన్నె ప్రాజెక్టు అసంపూర్తి పనులు, గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల మరమ్మతులు, వేదవతి ప్రాజెక్టు పనులు ప్రారంభం, భూ సేకరణ.. వంటి అవకాశాలపై చర్చించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 11:35 PM