సాగునీటి ప్రాజెక్టులు ఎంతో కీలకం
ABN , Publish Date - Mar 13 , 2026 | 11:43 PM
రాయలసీమ జిల్లాలో కరువు, వలసల నివారణ జరగాలంటే వృథాగా కడలిపాలు అవుతున్న వరద జలాలు ఒడిసిపట్టి పల్లెసీమలకు మళ్లించాలని కర్నూలు జిల్లా రిటైర్డు ఇంజనీర్ల సంఘం కార్యదర్శి జి.విశ్వనాథ్ పేర్కొన్నారు.
జిల్లా రిటైర్డు ఇంజనీర్ల సంఘం కార్యదర్శి జి.విశ్వనాథ్
కర్నూలు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జిల్లాలో కరువు, వలసల నివారణ జరగాలంటే వృథాగా కడలిపాలు అవుతున్న వరద జలాలు ఒడిసిపట్టి పల్లెసీమలకు మళ్లించాలని కర్నూలు జిల్లా రిటైర్డు ఇంజనీర్ల సంఘం కార్యదర్శి జి.విశ్వనాథ్ పేర్కొన్నారు. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సీమ సాగునీటి అవసరాలు, ప్రాజెక్టుల నిర్మాణం, నీటి లభ్యత, వంటి అంశాలపై శుక్రవారం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. స్థానిక ఇరిగేషన ప్రాజెక్ట్స్ సీఈ కార్యాలయ మీటింగ్ హాలులో జరిగిన ఈ పోటీలకు కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన పలువురు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్బంగా విశ్వనాథ్ మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న బీటెక్ విద్యార్థులకు సీమ ప్రాజెక్టులపై అవగాహన ఎంతో అవసరమన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల ద్వారా ఏటా వేల టీఎంసీలు వరద జలాలు కడలిపాలు అవుతున్నాయన్నారు. కరువు తీరాలంటే ఆ నీటిని ఆపే ప్రాజెక్టులు నిర్మించాలని అన్నారు. భవిష్యత్తులో ఎక్కడ పని చేసినా కరువుసీమ సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని సూచించారు. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాటి నిర్మాణం తీరును తెలుసుకోవాలన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని భవిష్యత్తులో ఉత్తమ ఇంజనీర్లుగా రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ మురళినాథ్ రెడ్డి, రిటైర్డు ఎస్‌ఈలు సుధాకర్ రెడ్డి, కృష్ణమోహన, పురర్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.