Irrigation Canals: పొలాలకు పూర్వోదయం
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:55 AM
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేయడం ద్వారా పొలాలకు సమృద్ధిగా నీటిని అందించాలన్న బృహత్తర లక్ష్యం దిశగా ప్రభుత్వ ం అడుగులు వేస్తోంది.
29.9 లక్షల ఎకరాలకు జల సిరులు
రూ.14,100 కోట్ల కేంద్ర నిధులతో రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం
రెండేళ్లలో పెండింగ్ నిర్మాణాలు పూర్తి.. ఉత్తరాంధ్రకు 5 వేల కోట్లు కేటాయింపు
కోస్తాంధ్ర జిల్లాల్లో 9 వేల కోట్లతో పనులు.. కేంద్రానికి నివేదిక పంపనున్న ప్రభుత్వం
అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను వడివడిగా పూర్తి చేయడం ద్వారా పొలాలకు సమృద్ధిగా నీటిని అందించాలన్న బృహత్తర లక్ష్యం దిశగా ప్రభుత్వ ం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకాన్ని సంపూర్ణంగా వినియోగించుకోనుంది. ఈ పథకం కింద రూ.14,100 కోట్లను తీసుకువచ్చి రాష్ట్రంలో పెండింగులో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించింది. తద్వారా ప్రస్తుతం ఉన్న ఆయకట్టుతోపాటు కొత్త ఆయకట్టును కూడా స్థిరీకరించాలని జలవనరుల శాఖ భావిస్తోంది. పూర్వోదయ నిధులను ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేటాయించి, ప్రాజెక్టులను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఉత్తరాంధ్రలో రూ.5 వేల కోట్లతో 2,69,369 ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు 2,49,690 ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కోస్తాంధ్రలో రూ.9100 కోట్ల నిధులు వెచ్చించి.. 1,27,700 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని కార్యాచరణను సిద్ధం చేసింది. పూర్వోదయ పథకం ద్వారా రూ.14,100 కోట్లతో 3,97,339 ఎకరాల కొత్త ఆయకట్టు, 25,96,690 ఎకరాల ప్రస్తుత ఆయకట్టును స్థిరీకరించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను కేంద్రానికి పంపనున్నారు. ఈ ప్రతిపాదనలను అధికారులు ఇటీవల సీఎం చంద్రబాబు ముందు ఉంచారు. ఆర్థిక శాఖ ఆమోదం, సీఎం అనుమతి రాగానే కేంద్రానికి పంపాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. పూర్వోదయ పథకం కింద నిధులు అందగానే.. వచ్చే రెండేళ్లలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తయి.. పొలాలకు సమృద్ధిగా సాగునీరు అందనుంది.