Share News

వైసీపీ నేతల అడ్డగోలు బిల్లులకు బ్రేకులు

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:33 AM

గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల లెవలింగ్‌ పనుల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. పనులు చేయకపోయినా చేసినట్టు వైసీపీ నేతలు, కార్యకర్తలు బిల్లులు చేసుకున్నారు.

వైసీపీ నేతల అడ్డగోలు బిల్లులకు బ్రేకులు

  • జగనన్న కాలనీల లెవలింగ్‌ పనుల్లో అక్రమాలు

  • పనులు చేయకున్నా బిల్లుల కోసం కోర్టులకు

  • అడ్డుకుంటున్న గ్రామీణాభివృద్ధి శాఖ

  • తనిఖీలతో ‘లెక్క’ తేలుస్తున్న క్వాలిటీ కంట్రోల్‌

  • అక్రమ చెల్లింపులకు చెక్‌.. రికవరీలు

  • కోర్టు కేసులు విత్‌డ్రా చేసుకుంటున్న వైనం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల లెవలింగ్‌ పనుల్లో అడ్డగోలుగా దోచుకున్నారు. పనులు చేయకపోయినా చేసినట్టు వైసీపీ నేతలు, కార్యకర్తలు బిల్లులు చేసుకున్నారు. ఇంకా పెండింగ్‌ బిల్లులు ఉండటంతో కూటమి ప్రభుత్వంలో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు పూర్తిగా పనులు చేయకపోయినా బిల్లుల కోసం ఏకంగా కోర్టును ఆశ్రయించారు. గ్రామీణాభివృద్ధి శాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలతో తనిఖీలు చేపట్టి పనుల ‘లెక్క’ తేలుస్తుండటంతో వైసీపీ కార్యకర్తలు తోకముడుస్తున్నారు. కొందరు కేసులు ఉపసంహరించుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు రూ.1500 కోట్ల మేర పనులు చేపట్టామంటూ రికార్డులు సృష్టించి సుమారు రూ.1150 కోట్ల వరకు జేబులో వేసుకున్నారు. మరో రూ.300 కోట్లకు పైగా బిల్లులు రావాలంటూ కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. అప్పట్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఈ పనులు నిషేధమంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలివ్వడంతో మిగిలిన బిల్లులు చెల్లించే బాధ్యతను గృహ నిర్మాణ శాఖకు అప్పగించారు. దీంతో పలువురు వైసీపీ కార్యకర్తలు పెండింగ్‌ బిల్లుల కోసం హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో హడావుడి చేసి బిల్లులు వసూలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖ అప్రమత్తమైంది. ఆయా పనులను వెంటనే క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలతో తనిఖీలు చేపట్టింది. క్వాలిటీ కంట్రోల్‌ నిర్ణయించిన మేర కోత విధిస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ వైసీపీ నేత చేసిన పనులను క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీలు చేసి రూ.1.29 కోట్లు రికవరీ విధించడంతో ఆ నేత హైకోర్టు నుంచి కేసు ఉపసంహరించుకున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కోర్టు కేసులకు సంబంధించి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాన్ని అప్రమత్తం చేయడంతో వైసీపీ నేతల ఆటలు సాగడం లేదంటున్నారు. చేయని పనులకు కోర్టు ఆదేశాలతో బిల్లులు పొందే ప్రక్రియకు తెరపడిందని పేర్కొంటున్నారు.


నాడు అడ్డగోలు దోపిడీ

గత ప్రభుత్వంలో చేపట్టిన లెవలింగ్‌ పనులపై కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత అసెంబ్లీలోను, క్షేత్రస్థాయిలోను ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 5 శాతం జగనన్న కాలనీల్లో కూడా ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. చాలా గ్రామాల్లో ఊరిబయట చెరువులు, గుట్టలు, కొండల్లోను లెవలింగ్‌ పనులు చేసినట్లు మమ అనిపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తుచేయాలని కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆ శాఖకు చెందిన చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారిని ఆదేశించారు. గత 8 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కోర్టులను ఆశ్రయించినవారి పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం అధికారులు సత్వరమే తనిఖీలు నిర్వహించి కోర్టుకు నివేదికలు సమర్పిస్తున్నారు.


50 శాతం తనిఖీలు పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం తనిఖీలు పూర్తయ్యాయి. 9,384 జగనన్న కాలనీల లెవలింగ్‌ పనులకు సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తనిఖీలు చేపట్టింది. అందులో 4,336 పనులకు సంబంధించి రికవరీ చేయాలంటూ అధికారులు ఇప్పటికే ఆయా డ్వామా పీడీలకు సూచించారు. ఈ లోపు తమకు బిల్లులు చెల్లించాలంటూ సుమారు 367 పనులకు సంబంధించి 106 మంది వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. కొన్ని మండలాల్లో అయితే 10 శాతం పనులు చేపట్టి నూరుశాతం బిల్లులు పొందే ప్రయత్నాలు చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో 38 జగనన్న కాలనీల్లో లెవలింగ్‌ పనులు చేపడితే అందులో 37 కాలనీల్లో అసలు నివాసానికే యోగ్యత లేనివి. వీటికి సంబంధించి రూ.2.58 కోట్లు పనులు చేసినట్లు ఎంబుక్‌లు రికార్డు చేయించుకున్నారు. అందులో ఇప్పటికే రూ.1.03 కోట్లు చెల్లింపులు జరిగాయి. ఇటీవల క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు తనిఖీ చేపట్టడంతో అక్కడ రూ.38.21 లక్షల పని మాత్రమే జరిగిందని నిర్ధారణ అయింది. దీంతో వైసీపీ నేతలకు చెల్లించిన మొత్తంలో రూ.65.34 లక్షలు రికవరీ చేయాలని చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఆఫీసర్‌ నెల్లూరు డ్వామా అధికారులను ఆదేశించారు. 12 శాతం పనులు మాత్రమే చేసి నూరు శాతం బిల్లులు కొట్టేయాలని ప్రయత్నించారు.

Updated Date - Feb 09 , 2026 | 04:33 AM