Share News

డ్రైవింగ్‌ రాని వ్యక్తికి డ్రైవర్‌ ఉద్యోగం

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:57 AM

అది ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థ.. అక్కడి ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ నియామకాల నుంచి.. నిధుల ఖర్చు వరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా..

డ్రైవింగ్‌ రాని వ్యక్తికి డ్రైవర్‌ ఉద్యోగం

  • అతడి భార్యకు హాస్టల్‌ సూపర్‌వైజర్‌ పోస్టు

  • తన ఇంటి పనిమనిషి కూతురు జూనియర్‌ అసిస్టెంట్‌గా..

  • పెట్రోలియం వర్సిటీలో ఓ అధికారి ఇష్టారాజ్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

అది ఒక జాతీయ స్థాయి విద్యాసంస్థ.. అక్కడి ఓ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ నియామకాల నుంచి.. నిధుల ఖర్చు వరకు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా.. మహిళల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ)లో ఒక అధికారి వ్యవహారశైలి చర్చనీయాంశమవుతోంది!. వర్సటీలో ఇప్పటికే ఇద్దరు అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లు, ఒక డిప్యూటీ రిజిస్ర్టార్‌ ఉండగా, కొద్దిరోజుల కిందట మరో ఇద్దరు అసిస్టెంట్‌ రిజిస్ర్టార్లు, ఒక డిప్యూటీ రిజిస్ర్టార్‌ను నియమించినట్టు తెలుస్తోంది. తన ఇంట్లో పనిచేసే మహిళ కుమార్తెకు ఆయన ఉద్యోగాన్ని కల్పించినట్టు చెబుతున్నారు. ఆమెను తొలుత సెమీస్కిల్డ్‌గా ఉద్యోగంలోకి తీసుకుని, ఆ తరువాత రూ.28వేల జీతంతో ఆఫీస్‌ అసిస్టెంట్‌గా నియమించారంటున్నారు. ఆమెకు ఆయనే స్వయంగా స్కిల్స్‌ నేర్పిస్తుంటారని చెబుతున్నారు. తనకు సన్నిహితుడైన మరొకరికి డ్రైవింగ్‌ రాకపోయినా డ్రైవర్‌గా ఉద్యోగంలోకి తీసుకున్నారు. తర్వాతే ఆయన డ్రైవింగ్‌ నేర్చుకున్నట్టు చెబుతున్నారు. అలాగే, అతడి భార్యకు హాస్టల్‌లో సూపర్‌వైజర్‌ పోస్టు కట్టబెట్టారు. ఆమె అక్కడ పెత్తనం చలాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


వర్సిటీ ఏర్పాటుకు భూములిచ్చిన స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే నిబంధన ఉన్నప్పటికీ సదరు అధికారి తమకు కావాల్సిన వారిని తెచ్చుకుంటున్నట్టు చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట ఒక మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో మరో మహిళా అధికారి ద్వారా ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దానిపై చర్యలు తీసుకుంటామన్న ఉన్నతాధికారి.. ఆ విషయం బయటకు రానివ్వలేదు. సదరు అధికారి గెస్ట్‌హౌస్‌లో కొందరు విద్యార్థినులకు వసతి కల్పించారు. ఈ వంకతో రాత్రివేళలో అక్కడికి వెళుతుండడంతో వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారి దృష్టికి తీసుకువెళ్లగా, ఆ ఫిర్యాదునూ బుట్టదాఖలు చేశారు. వర్సిటీలో నిధుల వినియోగం, నియామకాలకు సంబంధించిన సమాచారం కోరుతూ గత 6నెలల్లో సుమారు 21 దరఖాస్తులు అందాయి. ఒక్కదానికీ అధికారులు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిసారించాలని వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 05:58 AM