ఇనుము, సిమెంట్ బొక్కేశారు!
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:58 AM
‘ఆడింది ఆట.. పాడింది పాట’ అన్న చందంగా తయారైంది గృహ నిర్మాణశాఖ ఉయ్యూరు డివిజన్ అధికారుల తీరు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇనుము, సిమెంటును అడ్డగోలుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వీటిని పసిగట్టిన ఆశాఖలోని పలువురు ఉద్యోగులు సమగ్ర వివరాలతో ఉన్నతాధికారులు, గృహ నిర్మాణశాఖ మంత్రికి ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరగకుండా పలువురు చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- గృహ నిర్మాణాల్లో అధికారుల చేతివాటం
- ఉయ్యూరు మున్సిపాల్టీ 5వ వార్డులో ఇంటి నిర్మాణానికి అనుమతి
- పామర్రు మండలం అడ్డాడ గ్రామంలో నిర్మాణం
- భార్య పేరుతో మంజూరైన ఇంటి విషయంలో హౌసింగ్‌శాఖ ఉద్యోగి నిర్వాకం
- పెనమలూరు గోడౌన్‌లో ఇనుము దించాలని కలెక్టర్ ఉత్తర్వులు
- ఉయ్యూరు గోడౌన్‌లో దించి 36 టన్నులు అమ్మేశారు..!
- 20 గృహాలకు ఇనుము ఇవ్వకుండానే ఇచ్చినట్లు లెక్కలు
- మంత్రి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు
- అయినా ఇంత వరకు చర్యలు నిల్
‘ఆడింది ఆట.. పాడింది పాట’ అన్న చందంగా తయారైంది గృహ నిర్మాణశాఖ ఉయ్యూరు డివిజన్ అధికారుల తీరు. లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇనుము, సిమెంటును అడ్డగోలుగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత తీరిగ్గా తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వీటిని పసిగట్టిన ఆశాఖలోని పలువురు ఉద్యోగులు సమగ్ర వివరాలతో ఉన్నతాధికారులు, గృహ నిర్మాణశాఖ మంత్రికి ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరగకుండా పలువురు చక్రం తిప్పుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
ఉయ్యూరు మండలంలోని గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి భార్య పేరున ఉయ్యూరు పట్టణం 5వ వార్డులో గృహ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. అయితే ఉయ్యూరులో గృహ నిర్మాణం చేయకుండా సదరు మహిళ పేరున పామర్రు మండలం అడ్డాడ గ్రామంలో ఇంటి నిర్మాణం చేశారు. ఉయ్యూరు పట్టణంలో గృహ నిర్మాణం చేసినట్లుగా చూపి పట్టణ కోటాలో పూర్తిస్థాయిలో బిల్లు చేశారు. సంబంధిత మహిళ పేరున అడ్డగోలుగా వేరే ప్రాంతంలో ఇంటి నిర్మాణం చేయడంపై సమగ్ర వివరాలతో గృహ నిర్మాణ సంస్థ జిల్లా కార్యాలయంలో ఫిర్యాదు అందింది. ఈ విషయంపై అధికారులు విచారణ చేయకుండా జాప్యం చేస్తూ వస్తున్నారు.
పెనమలూరు గోడౌన్‌లో ఇనుము దించమంటే..
పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు మండలాలకు సంబంధించి ఇనుము, సిమెంటును పెనమలూరు మండలంలోని గృహ నిర్మాణ సంస్థ గోడౌన్‌లో 250 టన్నుల ఇనుమును దించి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని గతేడాది డిసెంబరులో కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన రవాణా చార్జీలను కూడా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే పెనమలూరు గోడౌన్‌లో దించాల్సిన ఇనుము 36 టన్నులకుపైగా ఉయ్యూరు గోడౌన్‌లో దించి ఇష్ట్టానుసారంగా లెక్కలు రాసి మాయం చేశారని ఫిర్యాదు అందింది. ప్రస్తుతం ఈ ఇనుముకు సంబంధించిన లెక్కలు తేలడం లేదు. గతంలో పమిడిముక్కల మండలంలోని లబ్ధిదారులకు ఇచ్చేందుకు పమిడిముక్కల మండలంలోని గోడౌన్‌కు ఇనుము, సిమెంటును ఇవ్వగా, కంకిపాడులోని గోడౌన్‌లో దించి 50 టన్నుల ఇనుము, 1200 బస్తాల సిమెంటును మాయం చేసిన అంశంపై పమిడిముక్కల మండలం గృహనిర్మాణ సంస్థ సిబ్బంది పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశారు. అయినా అప్పట్లో పనిచేసిన డీఈ, ఏఈలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సాచివేత ధోరణిని అవలంభిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఈ డివిజన్‌లో ఏఈగా పనిచేసి ప్రస్తుతం డివిజన్ స్థాయి అధికారిగా పదోన్నతి పొందిన అధికారి ఈ లెక్కలు బయటకు రాకుండా తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఉయ్యూరు పట్టణంలో గృహ నిర్మాణాలకు సంబంధించి 20 గృహాలకు ఇనుము ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా తప్పుడు లెక్కలు రాయడంతో ఈ గృహ నిర్మాణ పనులు చేస్తున్న ఒక కాంట్రాక్టర్ నేరుగా ఈ అంశంపై గృహనిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఇటీవల ఫిర్యాదు చేయడం గమనార్హం.
ఉద్యోగి భార్య పేరుతో కారు బిల్లులు
ఉయ్యూరు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి తన భార్య పేరున కారును కొనుగోలు చేశాడు. ఉయ్యూరు డివిజన్ డీఈ కార్యాలయంలో ఈ కారును అద్దె ప్రాతిపదికన పెట్టి నెలకు రూ.34వేల చొప్పున బిల్లులు చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.