Share News

బడికెళ్లే పిల్లల్నీ చంపేస్తున్నారు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:18 AM

అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల సైనికులు ఇరాన్‌లో పాఠశాలలకు వెళ్లే పసిపిల్లలపై కూడా బాంబులు వేసి కిరాతకంగా హతమారుస్తున్నారని ...

బడికెళ్లే పిల్లల్నీ చంపేస్తున్నారు

ఇరాన్‌ దౌత్యవేత్త ఆయతుల్లా అబ్దుల్‌ మజీద్‌ కంటతడి

విశాఖ, రాజమహేంద్రిలో ఖమేనీ స్మారక సభలకు హాజరు

అక్కయ్యపాలెం (విశాఖపట్నం), రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాల సైనికులు ఇరాన్‌లో పాఠశాలలకు వెళ్లే పసిపిల్లలపై కూడా బాంబులు వేసి కిరాతకంగా హతమారుస్తున్నారని ఆ దేశ (సుప్రీం లీడర్‌) దౌత్యవేత్త ఆయతుల్లా అబ్దుల్‌ మజీద్‌ హకీం ఇలాహీ అన్నారు. ఇరాన్‌లోని మినాబ్‌లో 160 మంది విద్యార్థులు బాంబు దాడిలో మరణించిన ఘటనను ప్రస్తావిస్తూ.. ఆయన కంటతడి పెట్టారు. విశాఖ, రాజమహేంద్రవరంలో పలు ముస్లిం సంస్థలు గురువారం నిర్వహించిన ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ సంస్మరణ సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘అలీ ఖమేనీ నిరాడంబర జీవితం గడిపారు. ఆయన తన కుటుంబంతో కలిసి అద్దె భవనంలో ఉండేవారు. యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సైన్యం సూచించినా ఆయన అంగీకరించలేదు. దేశ ప్రజలకు రక్షణగా, వారి మధ్యనే ఉండటానికి ఇష్టపడ్డారు’’ అని తెలిపారు. విశాఖ వచ్చి, వెనక్కి వెళుతున్న ఇరాన్‌ నౌకను పేల్చేసిన విషయం గుర్తుచేశారు. చర్చలంటూ అమెరికా అలవికాని డిమాండ్లు పెడుతోందని మండిపడ్డారు. హోర్ముజ్‌ వద్ద భారత నౌకల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఇరాన్‌- భారత్‌ మధ్య బంధానికి సుదీర్ఘ చరిత్ర ఉన్నదన్న ఆయన.. మహాత్మాగాంధీ తమకు ఆదర్శం అని తెలిపారు.

Updated Date - Apr 24 , 2026 | 05:20 AM