తెలియదు..గుర్తు లేదు
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:29 AM
నేను ఎవరినీ కొట్టలేదు...కొట్టించలేదు...నాకేమీ తెలియదు..! ... నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణలో ఐపీఎస్ సునీల్ నాయక్ స్పందించిన తీరు ఇదీ!
రెండో రోజు విచారణకూ సహకరించని ఐపీఎస్ సునీల్ నాయక్
రఘురామకు టార్చర్ వ్యవహారంపై ప్రశ్నలవర్షం
టార్చర్ రూమ్‌లోని సిబ్బంది వాంగ్మూలాలను ముందుపెట్టి విచారణ..తడబడ్డ సునీల్ నాయక్
నేను ఎవరినీ కొట్టలేదు..కొట్టించలేదు
కేసులో ఇరికించాలని చూస్తున్నారన్న ఐపీఎస్
చాలా ప్రశ్నలకు మౌనమే సమాధానం
నేడూ విచారించనున్న అధికారులు
గుంటూరు,మార్చి 6 ( ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఎవరినీ కొట్టలేదు...కొట్టించలేదు...నాకేమీ తెలియదు..!’... నాటి ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురిచేసిన కేసు విచారణలో ఐపీఎస్ సునీల్ నాయక్ స్పందించిన తీరు ఇదీ! ఈ కేసులో రెండోరోజు, శుక్రవారం గుంటూరు సీసీఎస్ కార్యాలయంలో విజయనగరం ఎస్పీ దామోదర్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. తొలి రోజు ఏడు గంటల పాటు విచారించినప్పటికీ సాధారణ అంశాలకే దర్యాప్తు పరిమితమైంది. అయితే రెండో రోజు మాత్రం రఘురామ కస్టోడిల్ టార్చర్‌కు సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను ఆధారాలతో సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. రఘురామను కస్టడీలో పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన సమయంలో గదిలో ఎవరెవరు ఉన్నారు..? అక్కడ ఏం జరిగింది అనే విషయాలను కొందరు సీఐ, ఎస్సైల నుంచి కిందిస్థాయి కానిస్టేబుల్స్ వరకు మెజిస్ర్టేట్ ఎదుట పూసగుచ్చినట్లు వాంగ్మూలాలు ఇచ్చారు. వాటిని సునీల్ నాయక్ ఎదుట ఉంచి దామోదర్ ప్రశ్నించారు. ‘ఆరోజు అక్కడ మీరు ఉన్న’ట్టు సిబ్బంది చెప్పారనగా, ఆయన నుంచి మౌనమే సమాధానం అయింది. ఆ రోజు గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని ప్రశ్నించగా, నిందితుడు ఎంపీ కదా.. నేను చూసుకోకపోతే ఎలా అని బదులిచ్చినట్లు తెలిసింది. హైదరాబాద్‌లో రఘురామను అరెస్టు చేసి తీసుకొచ్చేందుకు పంపిన టీమ్‌లను ఎవరు ఏర్పాటు చేశారనే ప్రశ్నకు తనకు తెలియదని బదులిచ్చినట్లు సమాచారం.
‘రఘురామను కస్టడీలో మీరు కొట్టారని, తులసి బాబు, సునీల్ కుమార్ గన్మెన్, వంట మాస్టర్, డ్రైవర్ తదితరులతోనూ కొట్టించారని ప్రత్యక్ష సాక్షులైన సిబ్బంది చెప్పారని అనగా, తాను ఎవరినీ కొట్టలేదని, కొట్టించలేదని చెప్పినట్లు తెలిసింది. ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారనగా, చాలా కాలమైనందున తనకు గుర్తు లేదని చెప్పినట్లు తెలిసింది. ఇలా.. ఉదయం 9.47 గంటలకు మొదలైన విచారణ సాయంత్రం 5 గంటల 18 నిమిషాల వరకు సాగింది. కాగా, సునీల్ నాయక్‌ను శనివారం కూడా అధికారులు విచారించనున్నారు.