దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు రండి
ABN , Publish Date - Mar 24 , 2026 | 06:02 AM
బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, మార్చి 23(ఆంధ్రజ్యోతి): బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్‌కుమార్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణార్హతపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఈ వ్యవహారంపై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని పేర్కొంటూ విచారణను ఏప్రిల్ 6కి వాయిదా వేసింది. అప్పటివరకు దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని నాయక్‌ను ఆదేశించింది. 24 గంటలు పనిచేసే సెల్‌ఫోన్, వాట్స్‌ప నెంబర్లను దర్యాప్తు అధికారికి అందజేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తును కొనసాగించవచ్చని, ఈ క్రమంలో పిటిషనర్‌పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని దర్యాప్తు అధికారికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు. దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చి, ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యేందుకు వెసులుబాటు ఇవ్వాలన్న సునీల్ నాయక్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి ఆ తరహా వెసులుబాటు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. రేపటి రోజున జైలు శిక్షను కూడా ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో అనుభవిస్తాననే ప్రమాదం ఉందన్నారు.
ఇదీ కేసు
తనను సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని పేర్కొంటూ మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024, జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అప్పటి సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా పిటిషన్ విచారణార్హతపై ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. సునీల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, న్యాయవాది ఎన్. అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌కు విచారణార్హత ఉందని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సునీల్ నాయక్ ఈ నెల 23న దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారని తెలిపారు. దర్యాప్తు అధికారి ముందు ఆన్‌లైన్‌లో విచారణకు హాజరయ్యేందుకు వెసులుబాటు ఇవ్వాల ని అభ్యర్థించారు. అయితే, ఈ వినతిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. పోలీసుల తరఫున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ అగర్వాల్, పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. ‘‘అరెస్టు మెమోపై సునీల్ నాయక్ సంతకం చేశారు. అరెస్టుకు కారణాలు ఆయనకు తెలియజేశాం. పిటిషనర్‌పై నమోదు చేసిన సెక్షన్లలో ఏడేళ్ల పైబడి శిక్షకు వీలున్నవి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు. దర్యాప్తు అధికారి ముందు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దు.’’ అని కోరారు.