శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యిపై సమగ్ర విచారణ చేయాలి
ABN , Publish Date - Feb 21 , 2026 | 05:52 AM
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని...
జగన్ ప్రభుత్వంలో మంత్రి, ఎమ్మెల్యే, ఓ అధికారి హస్తం ఉంది
ఆలయ చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు
రాజంపేట, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేశ్‌నాయుడు డిమాండ్ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2023-24 సంవత్సరంలో మే 2023 నుంచి మార్చి 2024 వరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని తెలిపారు. అంతకుముందు విజయా డెయిరీ సరఫరా చేస్తున్న నెయ్యిని కాదని.. డెయిరీ సంస్థలే కాకుండా ట్రేడర్స్ కూడా పాల్గొనవచ్చు అని నిబంధనలు మార్చి టెండర్లు నిర్వహించారని వివరించారు. దీంతో ఆనాడు ఎలాంటి అనుభవం లేకపోయినా రాజేశ్ కార్పొరేషన్‌కు టెండర్లు అప్పజెప్పారని, వారి హయాంలోనే ఈ కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్నారు. దీని వెనుక గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేబినెట్‌లోని ఒక మంత్రి, అప్పటి ఓ శాసనసభ్యుడితో పాటు ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి హస్తం ఉందన్నారు. వారి సహకారంతో 2,92,845 కేజీల నెయ్యిని ఆనాడు కొని రూ.16 కోట్లు వారికి చెల్లించారన్నారు. అప్పటి ప్రభుత్వంలో కల్తీనెయ్యి వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఆ ఉన్నతాధికారి నేటి ప్రభుత్వంలో కూడా ఓ కీలకశాఖలో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించి, ఇందుకు బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు.