Share News

మీ విమానం రద్దయింది!

ABN , Publish Date - May 17 , 2026 | 04:33 AM

విమానాలు ఆకాశంలోకి ఎగరకుండానే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ముందుగా ప్రణాళికలు వేసుకొని విదేశాలకు వెళ్లాలనుకుని కంటున్న కలలకు గండికొడుతున్నాయి.

మీ విమానం రద్దయింది!

  • విదేశాలకు వెళ్లే వారికి విమానయాన సంస్థల ఝలక్‌

  • పాత చార్జీలతో నడపలేకే క్యాన్సిలేషన్‌

  • కొత్త బుకింగ్‌లకు 3 రెట్లు పెరిగిన చార్జీలు

  • విధిలేని పరిస్థితుల్లో ప్రయాణాలు రద్దు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

విమానాలు ఆకాశంలోకి ఎగరకుండానే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎంతో ముందుగా ప్రణాళికలు వేసుకొని విదేశాలకు వెళ్లాలనుకుని కంటున్న కలలకు గండికొడుతున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాలనుకుని ముందుగానే విదేశాలకు టికెట్లు బుక్‌ చేసుకున్న వారు కొందరైతే... వివిధ దేశాల్లో ఉంటున్న పిల్లల వద్దకు వెళ్దామనుకొని ముందుగానే ప్లాన్‌ చేసుకొని టికెట్లు కొనుగోలు చేసిన వారు మరెందరో. వాళ్లలో 95 శాతం మందికి ప్రయాణానికి నాలుగైదు రోజుల ముందు ‘మీరు ప్రయాణించాల్సిన విమాన సర్వీసు అనివార్య పరిస్థితుల్లో రద్దయింది’ అంటూ ఆయా విమానయాన సంస్థల నుంచి మెసేజ్‌ వస్తోంది. ఆ వెనువెంటనే టికెట్‌ సొమ్ము రిఫండ్‌ అవుతోంది. అప్పటికే అన్నీ సిద్ధం చేసుకొని వుండడంతో మరో విమానానికి టికెట్‌ బుక్‌ చేసుకోవాలని ప్రయత్నించిన వాళ్లకు కళ్లు గిర్రున తిరుగుతున్నాయి. టికెట్‌ ధరలు దాదాపుగా మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయి. దీంతో ఉసూరంటూ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగానే ఉంది.


నష్టాలు వస్తాయన్న కారణంతోనే...

పశ్చిమ ఆసియాలోని ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ఇంధనం ధర భారీగా పెరిగింది. విమాన సర్వీసులను నడపడానికి అయ్యే ఖర్చులో మేజర్‌ వాటా ఇంధనానిదే. ఈ నేపథ్యంలో పాత చార్జీలతో సర్వీసులను నడిపి నష్టాల బారిన పడలేక విమాన సర్వీసులనే రద్దు చేసుకుంటున్నాయి. దీంతో గన్నవరం, విశాఖపట్నం, హైదరాబాద్‌, చెన్నై తదితర ప్రాంతాల నుంచి విదేశాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రద్దయింది సరే... మరో విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకొని వెళ్దామంటూ టికెట్‌ ధర మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగింది. దీంతో చాలా మంది ఉసూరంటూ రద్దు చేసుకుంటున్నారు.


ముందుగా, తక్కువకు చేసుకున్నా...

విదేశాలకు వెళ్లే ప్రయాణికుల్లో అత్యధికులు గల్ఫ్‌ దేశాల నుంచి కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ బుక్‌ చేసుకున్న వారే ఉన్నారు. విజయవాడ విమానాశ్రయం నుంచి షార్జా ఫ్టైట్‌కు సింహభాగం బుక్‌ చేసుకున్నారు. షార్జా నుంచి దుబాయ్‌కు రోడ్డు మార్గాన చేరుకుని అక్కడి నుంచి అమెరికా, యూరప్‌, ఆఫ్రికా, ఆస్ర్టేలియా దేశాలకు కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ బుక్‌ చేసుకున్నారు. డైరెక్ట్‌ విమానాల కంటే ఇలా కనెక్టింగ్‌ ఫ్లైట్స్‌ ద్వారా చాలా ఖర్చు తగ్గుతుంది. గన్నవరం నుంచి కాకుండా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కూడా నేరుగా దుబాయ్‌, కువైత్‌, అబూధాబీలకు విమాన టికెట్లను బుక్‌ చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయా దేశాలకు టికెట్లను ముందస్తుగా బుకింగ్‌ చేసుకున్నారు. ఇప్పుడు గల్ఫ్‌ దేశాలకు విజయవాడ నుంచి వెళ్లే పరిస్థితి లేదు. షార్జా విమాన సర్వీసు రద్దు అయింది. హైదరాబాద్‌ నుంచి కూడా దాదాపుగా ఇంతే. కువైత్‌, అబూధాబీలకు కొన్ని విమానాలు నడుస్తున్నా.. పాత బుకింగ్స్‌ వల్ల నష్టపోవాల్సి వస్తోందన్న ఉద్దేశ్యంతో ప్రయాణ సమయం దగ్గరకు వచ్చే సరికి ఒక్కొక్కటిగా రద్దు చేసుకుంటున్నాయి. దీంతో విమానయాన సంస్థలను ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడుతోంది. పోనీ, నేరుగా వెళదామనుకుంటే.. ప్రస్తుత ధరలు ఆందోళనలను కలిగిస్తున్నాయి. కువైట్‌ నుంచి అమెరికాకు రాక, పోక రూ.70 వేలకు బుక్‌ చేసుకున్న వారికి.. ఇప్పుడు అమెరికాకు నేరుగా వెళ్లటానికి వనవేలోనే రూ.2 లక్షల ధర చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ ధరలను చూసి విదేశీ ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా మూడు రెట్లు పెరిగిన ధరలతో విమాన ప్రయాణం చేయలేక అల్లాడిపోతున్నారు.

Updated Date - May 17 , 2026 | 04:34 AM