విశాఖలో వచ్చే 18న ఐఎఫ్ఆర్
ABN , Publish Date - Jan 22 , 2026 | 04:04 AM
విశాఖపట్నంలో వచ్చే నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో...
19 నుంచి మిలాన్
రాష్ట్రపతి, ముఖ్యమంత్రి హాజరు
విశాఖపట్నం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో వచ్చే నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్), 19న మిలాన్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ వివిధ శాఖల అధికారులతో బుధవారం సమీక్షించారు. నగరంలోని పార్కులు, ప్రధాన రహదారుల సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. నేవీ అధికారులు మాథ్యూ, రజనీశ్‌శర్మలు మాట్లాడుతూ, ఈ కార్యక్రమాలకు దేశ, విదేశాల నుంచి 73 మంది అతిథులు వస్తున్నారన్నారు. 22 దేశాల నుంచి నౌకలు వస్తాయని తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు మిలాన్ సందర్శన ఉంటుందన్నారు. 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, 19న సిటీ పరేడ్ ఉంటాయన్నారు. 19, 20 తేదీల్లో మిలాన్ హార్బర్ ఫేజ్, 21 నుంచి 25 వరకు సీ ఫేజ్ ఉంటాయని పేర్కొన్నారు. ఫ్లీట్ రివ్యూకు రాష్ట్రపతి ద్రౌపతిముర్ము, మిలాన్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తారని తెలిపారు.
ఐఎ్‌ఫఆర్ అంటే.. భారత రాష్ట్రపతి తన హయాంలో నౌకాదళ సామర్థ్యాన్ని ఒకసారి సమీక్షిస్తారు. దానిని ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ అంటారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎ్‌ఫఆర్) అంటే.. దేశ నౌకాదళంతోపాటు పొరుగు దేశాలకు చెందిన నౌకలు పాల్గొంటాయి. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన నౌకల సామర్థ్యాలను రాష్ట్రపతి సమీక్షిస్తారు. ఈ కార్యక్రమంలో కీలకమైన యుద్ధనౌకలు, సబ్‌మెరైన్లు పాల్గొంటాయి.
మిలాన్.. వివిధ దేశాలకు చెందిన నౌకాదళాలు ప్రదర్శనలో పాల్గొంటాయి. సముద్ర కార్యకలాపాల్లో పరస్పర సహకారం, సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి ఉద్దేశించిన నిర్వహించే కార్యక్రమమే మిలాన్. ఈ సందర్భంగా ఆయా దేశాలకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు.