Share News

అంతర్జాతీయ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

ABN , Publish Date - May 06 , 2026 | 04:43 AM

అనంతపురం జిల్లా పోలీసులు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు చేశారు. ఫిలిప్పీన్స్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాలోని 10 మంది సభ్యులను అరెస్టు చేశారు.

అంతర్జాతీయ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

  • రూ.19.70 లక్షల నగదు స్వాధీనం

  • బ్యాంకు ఖాతాల్లోని రూ.18.20 లక్షలు ఫ్రీజ్‌

  • పరారీలో కీలక నిందితుడు, మరొకరు

  • స్థానికుల పేరుతో బ్యాంకు ఖాతాలు

  • లావాదేవీల కోసం ఇతరుల పేరుతో సిమ్‌ కార్డులు

  • కారు, నాలుగు బైక్స్‌, ఇతర సామగ్రి సీజ్‌

  • క్రికెట్‌ బెట్టింగ్‌ జోలికి వెళితే కఠిన చర్యలు: అనంతపురం ఎస్పీ

అనంతపురం క్రైం, మే 5(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా పోలీసులు ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు చేశారు. ఫిలిప్పీన్స్‌ కేంద్రంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠాలోని 10 మంది సభ్యులను అరెస్టు చేశారు. ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న బెట్టింగ్‌ ముఠా కింగ్‌ పిన్‌ శివ, కర్ణాటకకు చెందిన సచిన్‌ పరారీలో ఉన్నారు. ఈ కేసు వివరాలను అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌ మంగళవారం మీడియాకు వెళ్లడించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్న శివ ఫిలిప్పీన్స్‌లో ఉంటూ తొమ్మిది మందితో కలిసి అంతర్జాతీయ నిషేధిత ఆన్‌లైన్‌ గేమింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఫిలిప్పీన్స్‌లోని మాకాటి మెట్రో మనిలా అనే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నాడు. నిషేధిత డ్రీప్‌ ప్లే-1 యాప్‌ ద్వారా మూడేళ్లుగా ఆన్‌లైన్‌లో క్యాసినో, రోలెంట్‌, డ్రాగన్‌, మోనోపోలో, క్రికెట్‌ బెట్టింగ్‌, ఇతర నిషేధిత గేమ్స్‌ ఆడిస్తున్నాడు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన తలారి మధు(33)తో శివకు పరిచయమైంది. క్రికెట్‌ బెట్టింగ్‌కు సహకరిస్తే వచ్చే ఆదాయంలో 40 శాతం ఇస్తానని మధుకు ఎరవేశాడు. డబ్బుకు ఆశపడిన మధు, కళ్యాణదుర్గానికి చెందిన వేపరాళ్ల మహమ్మద్‌, షేక్‌ బాబ్జాన్‌, షేక్‌ రోషన్‌ వలీ, మాకొడికి శ్రీనివాసులు, తిమ్మయ్యను ఏజెంట్లుగా పెట్టుకున్నాడు. ఏలూరు జిల్లాకు చెందిన పవన్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌, జగిత్యాల జిల్లాకు చెందిన ప్రశాంత్‌, విజయవాడకు చెందిన మణికంఠ రాజు వీరికి జతకలిశారు. తలారి మధు ఫిలిప్పీన్స్‌లో ఉంటున్న శివకు టచ్‌లో ఉంటూ, ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించాడు. డ్రీమ్‌ ప్లే-1 యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తూ వచ్చారు.


పాస్‌బుక్‌ ఉంటే రూ.10 వేలు

బెట్టింగ్‌ లావాదేవీల కోసం సుమారు 70 మంది స్థానికుల చేత తలారి మధు బ్యాంకు ఖాతాలను తెరిపించాడు. వివిధ బ్యాంకుల పాస్‌ బుక్స్‌ను సిద్ధం చేసుకున్నాడు. పాస్‌ బుక్‌ ఉన్న ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇచ్చాడు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లావాదేవీలన్నీ ఫోన్‌ పే ద్వారా నిర్వహించారు. ఫోన్‌ పే లావాదేవీల కోసం ఇతరుల పేరిట సిమ్‌కార్డులు తీసుకుని, వాటిని ఢిల్లీలోని తోటి ముఠా సభ్యులకు కార్గో జీన్స్‌ ప్యాంట్ల పార్సిళ్లలో చేరవేశాడు. వాటిని అక్కడి నుంచి ఫిలిప్పీన్స్‌కు చేరవేశారు. ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌ నియంత్రణకు జిల్లా ఎస్పీ జగదీష్‌ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు, సీఐలు హరినాథ్‌, వెంకటరమణ, పలువురు ఎస్‌ఐలతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం ఈ నెల 4వ తేదీన కళ్యాణదుర్గం పట్టణంలోని సిద్ధపవంక వీధిలోని ఓ ఇంటిపై దాడులు నిర్వహించి బెట్టింగ్‌ ముఠాలోని తలారి మధు సహా పదిమందిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి రూ.19.70 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. బెట్టింగ్‌ లావాదేవీలకు వినియోగిస్తున్న 49 మంది బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.18.20 లక్షల నగదును ఫ్రీజ్‌ చేయించింది. నిందితులకు చెందిన ఒక కారు, నాలుగు బైక్స్‌, 15 సెల్‌ఫోన్లు, 15 సిమ్స్‌, మూడు ల్యాప్‌ట్యా్‌పలు, ఒక ట్యాబ్‌, 13 ఏటీఎం కార్డులు, నాలుగు చెక్‌బుక్స్‌, పలు పెన్‌డ్రైవ్‌లు, పవర్‌ బ్యాంక్‌లు, బ్లూటూత్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువు సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని ఎస్పీ జగదీష్‌ తెలిపారు. క్రికెట్‌ బెట్టింగ్‌ జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Updated Date - May 06 , 2026 | 04:44 AM