చేతిరాత బాలేదని మార్కులు తగ్గించొద్దు
ABN , Publish Date - Mar 19 , 2026 | 05:27 AM
చేతిరాత బాలేదనే కారణంతో మార్కులు తగ్గించొద్దని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి.
సమాధానాలు సరిగా ఉండటమే ప్రామాణికం
మూల్యాంకనంపై ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు
అమరావతి, మార్చి 18(ఆంధ్రజ్యోతి): చేతిరాత బాలేదనే కారణంతో మార్కులు తగ్గించొద్దని ఇంటర్ విద్యా మండలి స్పష్టం చేసింది. ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో మూల్యాంకనం చేసే జూనియర్ లెక్చరర్లకు మార్గదర్శకాలు జారీ చేసిం ది. ‘విద్యార్థి రాసిన సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలి. చేతిరాత, విద్యార్థి నేపథ్యం, ఊహాగానాలకు ప్రాధాన్యమివ్వకూడదు. పూర్తిగా చదవకుండా మార్కులు ఇవ్వకూడదు. సమాధానం సరిగా ఉంటే చేతిరాతను చూసి మార్కులు తగ్గించకూడదు. మూల్యాంకనం పూర్తయ్యాక తిరిగి పరిశీలించాలి. మార్కులు స్పష్టంగా బబుల్ చేయాలి’ అని విస్పష్టంగా పేర్కొంది. అలాగే మూల్యాంకనంలో పొరపాట్లు వస్తే విధించే జరిమానాలనూ ఉటంకించింది. పేపరు మూల్యాంకనం చేసిన వారికి రూ.3,000 నుంచి రూ.7,500 వరకూ, పరిశీలించినవారికి రూ.2,000 నుంచి రూ.3,750 వరకూ జరిమానాలు ఉంటాయని తెలిపిం ది. అలాగే మార్కుల వ్యత్యాసం ఆధారంగా మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తారు. కాగా, ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలు ముగిశాయి. బుధవారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రసాయనశాస్త్రం పరీక్ష జరిగింది. 3,86,886 మంది హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా తెలిపారు. ఈ నెల 21 నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వివరించారు.