ఇంటర్‌లో తక్కువ ఉత్తీర్ణతపై చర్యలు
ABN , Publish Date - May 06 , 2026 | 05:58 AM
ఇంటర్మీడియట్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫ్యాకల్టీపై ఇంటర్ విద్యామండలిచర్యలకు దిగింది.
జేఎల్స్‌కు షోకాజ్ నోటీసులు... గెస్ట్ ఫ్యాకల్టీ తొలగింపు
50 కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఇంటర్ బోర్డు కార్యదర్శి సమీక్ష
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫ్యాకల్టీపై ఇంటర్ విద్యామండలిచర్యలకు దిగింది. ఆయా సబ్జెక్టుల జూనియర్ లెక్చరర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. గెస్ట్ ఫ్యాకల్టీని పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 50 ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఇంటర్ బోర్డు కార్యదర్శి పి.రంజిత్ బాషా మంగళవారం బోర్డు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. తక్కువ ఉత్తీర్ణత సాధించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు రోజూ తరగతులకు హాజరు కాకపోవడం, సకాలంలో సిలబస్ పూర్తిచేయకపోవడం, రివిజన్ టెస్టుల నిర్వహణలో నిర్లక్ష్యం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. క్షేత్రస్థాయిలో బోధనపై ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణ లోపించిందని కార్యదర్శి అభిప్రాయపడ్డారు. సబ్జెక్టు లెక్చరర్లతో పాటు కాలేజీ ప్రిన్సిపాళ్లు కూడా వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచే క్వశ్చన్ బ్యాంక్‌లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఈ సమీక్షలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సైమన్ విక్టర్ పాల్గొన్నారు.