ఇంటర్ ‘ప్రాక్టికల్స్’ ప్రారంభం
ABN , Publish Date - Jan 28 , 2026 | 06:38 AM
ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్) ప్రారంభమయ్యాయి. జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి.
ముందు ఒకేషనల్, 1 నుంచి మిగతా వారికి
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు(ప్రాక్టికల్స్) ప్రారంభమయ్యాయి. జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే.. ఒక బ్యాచ్‌లో 25శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 100 శాతం మార్కులు వస్తే వారి పేపర్లను పునఃపరిశీలించాలని అధికారులకు ఇంటర్ విద్యామండలి స్పష్టంచేసింది. ప్రాక్టికల్స్‌పై మార్గదర్శకాలతో కూడిన ‘హ్యాండ్‌బుక్’ను విడుదల చేసింది. జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. పరీక్ష నిర్వహణకు 2గంటల ముందు ప్రాక్టికల్స్ ప్రశ్నపత్రాలను ఆన్‌లైన్‌లో కాలేజీలకు పంపుతారు. రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 2 ప్రాక్టికల్స్ జరగనున్నాయి. కాగా, థియరీ పబ్లిక్ పరీక్షలకు ప్రైవేటు కాలేజీల్లోని సిబ్బందినే ఇన్విజిలేటర్లుగా వినియోగించుకుంటున్నారు. చీఫ్ సూపరింటిండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, కస్టోడియన్ ముగ్గురు ఇంటర్ బోర్డు తరఫున అధికారులుగా వ్యవహరిస్తారు. వారి పర్యవేక్షణలో ఆ కాలేజీ సిబ్బంది ఇన్విజిలేషన్ చేస్తారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇన్విజిలేటర్లుగా జూనియర్ లెక్చరర్లే ఉంటారా? లేక టీచర్లను కూడా వినియోగిస్తారా? అనే దానిపై స్పష్టత రాలేదు.